బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాలు

పశ్చిమ బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వంలో హింస పేట్రేగిపోతున్నది. బాంబులతో దద్దరిల్లుతుంది. పంచాయతీ ఎన్నికలకు ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్న హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో ఆ రాష్ట్ర హైకోర్టు స్పందించింది. రాష్ట్రంలో షెడ్యూల్‌ ప్రకారం వచ్చే నెల 8న పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
 
అయితే హింసాత్మక ఘటనల దృష్ట్యా రాష్ట్రంలో కేంద్ర పారా మిలటరీ బలగాలను మోహరించాలని కలకత్తా హైకోర్టు పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కాగా, పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్‌ ప్రక్రియ జూన్‌ 9న ప్రారంభమై జూన్‌ 15న ముగియనున్నది. ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియలో అనేక హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి.
బుధవారం దక్షిణ 24 పరగణాలు, బంకురా జిల్లాల్లో ఘర్షణలు చెలరేగడంతో అల్లరి మూకలను పోలీసులు చెదరగొట్టారు. ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌(ఐఎస్‌ఎఫ్‌), టీఎంసీ నేతల మధ్య ఘర్షణ జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఇరు పార్టీల కార్యకర్తలు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
నామినేషన్‌లు వేసేందుకు ఊరేగింపుగా వెళ్తూ ఘర్షణలకు పాల్పడుతున్నారు.
గల్లాలు పట్టుకొని కొట్టుకుంటున్నారు. బుధవారం ఉదయాన్నే దక్షిణ 24 పరగణాల జిల్లాలోని కాన్నింగ్‌ బ్లాకులో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ కార్యాలయంలో నామినేషన్‌లు వేసేందుకు వెళ్లి.. ఒకే పార్టీకి చెందిన కార్యకర్తలు రెండు గ్రూపులుగా ఏర్పడి కొట్టుకున్నారు.
 
ఈ నెల 11న, తూర్పు బర్ధమాన్‌ జిల్లాలోని బార్సుల్‌లో వామపక్ష పార్టీల మద్దతుదారులపై దాడి జరిగి హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే ఉత్తర 24 పరగణాలు జిల్లాలోని మినాఖాన్‌ గ్రామంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సోమ దాస్‌పై దాడి జరగటంతో ఆయన తలకు గాయమైంది.  దుండగులు పార్టీ కార్యాలయం, బయట పార్క్‌ చేసిన పలు మోటర్‌బైక్‌లను కూడా ధ్వంసం చేశారు.
అలాగే, నాడియా జిల్లా, ఉత్తర దినాజ్‌పూర్‌ జిల్లాలోని నకాషిపరా వద్ద కాంగ్రెస్‌ నాయకులు, మద్దతుదారులు లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగాయని వార్తలు వచ్చాయి.  ఇలా ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులపై దాడులు జరగటంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్‌ శివజ్ఞాన్‌, న్యాయమూర్తి హిరణ్మరు భట్టాచార్యలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ప్రతిపక్ష నాయకులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించింది.  కేంద్ర బలగాలను మోహరించాలని ఈసీకి రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణలో భాగంగా ఎన్నికల సంఘం సున్నిత ప్రాంతాలుగా గుర్తించిన జిల్లాలు, ప్రాంతాలలో కేంద్ర బలగాలను మోహరించాలని కోర్టు ఆదేశించింది. అన్ని పోలింగ్‌ బూత్‌లు, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేయాలని వెల్లడించింది.
 
అయితే, నామినేషన్ల దాఖలుకు సమయాన్ని పొడిగించాలన్న అభ్యర్థనను పరిశీలించడానికి మాత్రం హైకోర్టు నిరాకరించింది. దానిని ఎన్నికల సంఘం విచక్షణకు వదిలివేసినట్లు తెలిపింది.