మరోసారి టాలీవుడ్ లో కలకలం రేపుతున్న డ్రగ్స్

ఒకప్పుడు బాలీవుడ్‌ సహా కొంత మంది ఉన్నత  వర్గాలకు  పరిమితమైన డ్రగ్స్ ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమకు పాకిపోయింది. గత కొన్నేళ్లుగా దక్షిణాది సినీ పరిశ్రమలో డ్రగ్స్ కేసులు కలకలం రేపుతోంది. తాజాగా టాలీవుడ్ లో `కాబాలి’ చిత్ర నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్ కావడంతో మరోసారి తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. తమ తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయో అంటూ పలువురు సినీ తారలు కలవరం చెందుతున్నారు.
 
కొంతకాలం క్రితం తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ కేసులో పలువురు హీరోలు, దర్శకులను ప్రశ్నించడం  పెద్ద సంచలనమే సృష్టించింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి, హీరో నవదీప్, రవితేజ, సుబ్బరాజు, తరుణ్, నందు, తనీష్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులను ప్రత్యేక విచారణ బృందం విచారణ కూడా జరిపింది.
 
ఇటీవల ఓ డ్రగ్స్ ముఠా సైబరాబాద్ పోలీసుల చేతికి చిక్కింది. ఈ కేసులో ప్రముఖ సినీ నిర్మాత, కబాలి ప్రొడ్యూసర్ కేపీ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా కేపీ చౌదరి గోవాలో ఉంటున్నారు. ఆయన మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు తేలడంతో ఆయనను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
 
డ్రగ్స్ కేసులో కేబి.చౌదరికి సంబంధం ఉందని అరోపణలతో అతనిపై నిఘా పెట్టి అరెస్ట్ చేయడం తెలుగు సినీ పరిశ్రమలో కలకలం సృష్టిస్తోంది. ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఇంకా ఎవరైనా సినీ నటుల ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. పోలీసులు కేపీ చౌదరి కాల్ డేటా విశ్లేషిస్  సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి.
 
ఆయన కాల్ డేటాలో టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు ప్రముఖ హీరోయిన్స్‌తో పాటు నలుగురు తారలు, ఓ దర్శకుడు కూడా ఈ డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉన్నట్టు సమాచారం. పోలీసులు కూడా ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేస్తున్నారు.
 
అతనికి డ్రగ్స్ ఎక్కడ నుంచి వచ్చాయి? ఏ గ్యాంగ్ నుంచి వచ్చింది? లేదా డార్క్ వెబ్‌లో వెళ్లి ఈయన ఈ డ్రగ్స్ కొనుగోలు చేసాడు? ఈ కేసులో ఈయనతో పాటు ఇంకెరెవరు ఉన్నారు? వంటి అంశాలపై దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతం కేపీ  చౌదరి నుంచి 4 సెల్ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లోని డేటాను విశ్లేషిస్తున్నారు. ఆ తర్వాత ఈ కేసులో ఎవరెవరి ప్రమేయం ఉందనే విషయం బయట పెడతామని చెబుతున్నారు.
 
చౌదరి నుండి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఏడు రోజుల కస్టడీ ఇవ్వాలని కోరుతూ రాజేంద్ర నగర్ కోర్టులో పోలీసులు పిటీషన్ దాఖలు చేశారు. చౌదరి డ్రగ్స్ నెట్ వర్క్ లో రెండు రాష్ట్రాలకు చెందిన సెలెబ్రెటీలు, వ్యాపారవేత్తలు, డ్రగ్ పెడ్లర్లు, ఏజెంట్లు ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. గత రెండేళ్లుగా గోవాలో టాలీవుడ్ సెలెబ్రెటీలతో కలసి పెద్ద పెద్ద ఈవెంట్లు, స్పెషల్ ప్యాకేజీలో పార్టీలు నిర్వహిస్తున్నాడు.
 
నైజీరియాన్ గాబ్రియేల్ తో కలిసి కొకైన్ సరఫరా చేస్తుండేవాడు. రెగ్యులర్ కస్టమర్లు, ఏజెంట్స్ లకు ఒక ప్రత్యేక వాట్స్ అప్ గ్రూప్ ను సృష్టించి, ఒకొక్క డ్రగ్ కు ఒకొక్క కోడ్ పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్ కు ఆర్డర్లు తీసుకొని సరఫరా చేసేవాడని భావిస్తున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న నాలుగు ఫోన్లలో వారి వివరాలున్నాయి. దానితో ఎవరెవరి గుట్టు బయట పడుతుంది అని భయపడుతున్నారు.