మనీలాండరింగ్‌ కేసులో తమిళనాడు మంత్రి అరెస్ట్‌

మనీలాండరింగ్‌ కేసులో తమిళనాడు విద్యుత్తు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి సెంథిల్‌ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేసింది. చెన్నైలోని ఆయన నివాసంలో 18 గంటలపాటు విచారించిన తర్వాత అదుపులోకి తీసుకుంటున్నట్లు బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు ఈడీ ప్రకటించింది.  ఆ వెంటనే వైద్య పరీక్షల కోసం చెన్నైలోని ఓమందురార్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది.
అక్కడకు చేరుకోగానే సెంథిల్ ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుని బిగ్గరగా ఏడవడంతో హైడ్రామా చేటుచేసుకుంది. పీఎంఎల్ఏ చట్టం కింద ఆయనను అరెస్టు చేసినట్టు ఈడీ అధికారులు చెబుతుండగా, అధికారికంగా అరెస్టు విషయాన్ని తమకు తెలియజేయలేదని డీఎంకే నేతలు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను ఆసుపత్రి వద్ద మోహరించారు.
 ఆయన ఇంట్లో లభించిన పత్రాలను సీజ్‌ చేసిన అధికారులు మూడు కార్లలో తమ వెంట తీసుకెళ్లారు. కాగా,  సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చిందని, ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు ఆయన స్పృహలో ఉన్నట్టు కనిపించడం లేదని డీఎంకే రాజ్యసభ ఎంపీ, న్యాయవాది ఎన్ఆర్ ఇలాంగో తెలిపారు. మంత్రిని 24 గంటల పాటు కస్టడీలో చిత్రహింసలు పెచ్టారని, ఇది పూర్తిగా మానవహక్కులకు విరుద్ధమని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎస్.రఘుపతి ఆరోపించారు. కోర్టుకు, ప్రజలకు ఈడీ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ మాట్లాడుతూ, దీనిని తాము న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న బెదిరింపు రాజకీయాలకు తాము భయపడేది లేదని స్పష్టం చేశారు. తమిళనాడు సచివాలయంలో ఈడీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. సెక్రటేరియట్‌లోని సెంథిల్‌ బాలాజీతో చాంబర్‌తోపాటు కొందరి ఇండ్లు, కార్యాలయాలయాలపై దాడులు చేశారు. మనీ లాండరింగ్‌ కేసులో చెన్నై సహా రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు నగరాల్లో ఈడీ దాడులు చేపట్టింది.

సెంథిల్‌ బాలాజీ ఛాంబర్‌లో తనిఖీలు చేపట్టేందుకు సీఐఎస్‌ఎఫ్‌ దళాలతో సచివాలయానికి చేరుకున్న ఈడీ అధికారులను రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. దాంతో సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లను అక్కడే ఉంచిన అధికారులు మంత్రి ఛాంబర్‌కు వెళ్లి మూడు గంటలపాటు తనిఖీ చేశారు. అదే విధంగా సెంథిల్‌ బాలాజీ అధికారిక నివాసంతో పాటు ఆయన కుటుంబానికి చెందిన నివాసాలు, కార్యాలయాలు, సోదరుడి నివాసంలో కూడా ఈడీ అధికారులు సాయంత్రం వరకు సోదాలు నిర్వహించారు.

బాలాజీ పర్యవేక్షిస్తున్న మంత్రిత్వ శాఖతో సంబంధం ఉన్న కాంట్రాక్టర్లు, ఆయనకు సన్నిహితంగా ఉండే వారిని కూడా లక్ష్యంగా చేసుకొని సోదాలు జరిపారు. ఈ దాడుల సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లను వారు స్వాధీనం చేసుకున్నారని, దాని ఆధారంగా ఆయనను అరెస్ట్ చేశారని చెబుతున్నారు. ఈరోడ్‌లోని తమిళనాడు స్టేట్‌ మార్కెటింగ్‌ కార్పొరేషన్‌ లారీ కాంట్రాక్టర్‌ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు.
గత నెల బాలాజీ సన్నిహితుల ఇండ్లల్లో ఐటీ అధికారులు కూడా సోదాలు నిర్వహించారు. బాలాజీ గతంలో అన్నాడీఎంకే పార్టీలో ఉన్నారు. ఆయనపై ఉద్యోగాల విషయంలో ఆరోప‌ణ‌లు వచ్చాయి. లంచం తీసుకుని ఉద్యోగాలు ఇప్పించిన‌ట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో సుప్రీంకోర్టు ఈడీ విచార‌ణ‌కు గ‌తంలో అనుమ‌తి ఇచ్చింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు త్వరలోనే విస్తృతంగా దాడులు జరపబోతోన్నారని, కొందరు కీలక వ్యక్తులు అరెస్ట్ అవ్వొచ్చంటూ తమిళనాడు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామలై ఇటీవలే హెచ్చరించారు. త్వరలో సెంథిల్‌ బాలాజీ అరెస్ట్‌ అవుతారని కూడా స్పష్టం చేశారాయన.