బీఆర్‌ఎస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు కలకలం

తెలంగాణలో  బీఆర్‌ఎస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి బీఆర్‌ఎస్‌కు చెందిన ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లు, కంపెనీలు, షాపింగ్ కాంప్లెక్స్‌లలో ఐటీ అధికారులు సోదాలు చేయడం ఆ పార్టీ నేతలలో ఆందోళన కలిగిస్తుంది.  ముందుగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసాలపై ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. తెల్లవారుజాము నుంచే సోదాలు జరుగుతున్నాయి. కొండాపూర్‌లోని లుంబిని ఎస్‌ఎల్‌ఎన్ స్ప్రింగ్స్ విల్లాస్‌లో ఎంపీ ఉండే ఇంటితో పాటు కార్యాలయాలపైన ఇన్కమ్ టాక్స్ అధికారులు సోదాలు జరుపుతున్నారు. సెంట్రల్ ఫోర్స్ బందోబస్తు మధ్య ఈ సోదల ప్రక్రియ కొనసాగుతోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
 
అలాగే యాదాద్రి జిల్లాలో భువనగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసం, కంపెనీల్లో ఈరోజు ఉదయం నుంచి ఏకకాలంలో ఐటీ సోదాలు చేపట్టింది. భువనగిరి, హైదరాబాద్‌ కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలానీలోని కార్యాలయాల్లో మొత్తం 12 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటు నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి చెందిన షాపింగ్ మాల్‌పై కూడా ఐటీ శాఖ దాడులు నిర్వహించింది.
బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్- కొత్తపేట, భువనగిరి లోని ఎమ్మెల్యే నివాసానికి ఐటి అధికారులు చేరుకున్నారు. సుమారు 30 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే స్థిరాస్తులను పరిశీలించి వాటి వివరాలు సేకరిస్తున్నారు.  మరోవైపు ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి సతీమణి పైళ్ల వనిత డైరెక్టర్ గా కొనసాగుతున్న, హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ , మేయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్, కంపెనీలల్లో తనిఖీలు కొనసాగుతున్నట్లు సమాచారం.
అలాగే శేఖర్ రెడ్డి దగ్గర పనిచేసే సిబ్బంది ఇళ్లల్లో కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి.  ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు పలు వ్యాపారాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అనేక కంపెనీలలో బినామీగా ఉన్నాడని, 15 కంపెనీలలో పెట్టుబడి దారుడుగా ఉన్నారని సమాచారం.
మర్రిజనార్థన్ రెడ్డికి సంబంధించిన క్లాత్ షోరూమ్స్, మాల్స్‌లో సోదాలు జరుగుతున్నాయి. కెపిహెచ్‌బిలోని జెసి బ్రదర్స్‌లో ఐటి అధికారులు తనిఖీలు చేపట్టారు. మర్రి జనార్థన్ రెడ్డికి రాజకీయాలలోకి రాకముందు నుంచే జేసీ బ్రదర్స్  క్లాత్ షోరూమ్స్ హైదరాబాద్ తో పాటు, తెలంగాణాలో పలు పట్టణాలలో నిర్వహిస్తున్నారు. మరో కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి. 

భువనగిరి నియోజకవర్గంలో 2014, 2018 ఎన్నికల్లో పైళ్ల శేఖర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. శేఖర్ రెడ్డిపై జరుగుతున్న ఐటీ దాడులతో బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఆయన అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ తనిఖీలతో కలవర పడుతున్నారు. గతంలో హైదరాబాద్‌లో మంత్రి మల్లారెడ్డిపై జరిగిన ఐటీ దాడులు సంచలనం రేపాయి.

ఏకంగా మూడు రోజుల పాటు ఆయన ఇళ్లు, కార్యాలయాలు, కాలేజీలతో పాటు ఆయన కుమారుడు, బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.18 కోట్ల నగదుతో పాటు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.

మల్లారెడ్డిపై ఐటీ దాడుల తర్వాత మంత్రి గంగుల కమలాకర్, బీఆర్ఎస్ ఎంపీ గాయత్రి రవి ఇంట్లో సోదాలు జరిగాయి. ఆ తర్వాత ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో చిక్కుకున్నారు. ఈ కేసులో ఒకసారి సీబీఐ, మూడుసార్లు ఈడీ ఆమెను ప్రశ్నించాయి.