ఉత్పత్తి పెరుగుదల, ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధికి పి ఎల్ ఐ పథకాలు

ఉత్పాదకతతో ముడి పెట్టిన ప్రోత్సాహక (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ -పీఎల్ఐ) పథకాలు దేశంలో ఉత్పత్తి, ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధి, ఎగుమతుల్లో గణనీయమైన పెరుగుదలకు దారితీశాయి. పీఎల్ ఐ పథకాల కారణంగా 2020-21తో  (12.09 బిలియన్ డాలర్లు) పోలిస్తే 2021-22లో తయారీ రంగంలో ఎఫ్ డీఐలు గణనీయంగా 76 శాతం (21.34 బిలియన్ డాలర్లు) పెరిగాయని డీపీఐఐటీ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ తెలిపారు.

భారతదేశాన్ని ‘ఆత్మనిర్భర్’గా మార్చే లక్ష్యంతో ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ ఆశించిన విధంగా పిఎల్ఐ పథకాలు రూ. 1.97 లక్షల కోట్ల (సుమారు 26 బిలియన్ అమెరికన్ డాలర్లు) ప్రోత్సాహక వ్యయంతో 14 రంగాల పునాదిపై వాటి ఉత్పత్తి సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, గ్లోబల్ ఛాంపియన్‌లను సృష్టించేందుకు నిర్మించబడ్డాయి.

2021-22 నుంచి 2022-23 వరకు పీఎల్ఐ పథకాలు ఉన్న, ఎఫ్ డి ఐ ల ప్రవాహం పెరిగిన రంగాల్లో డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ (+46%), ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ (+26%), మెడికల్ అప్లయెన్సెస్ (+91%) ఉన్నాయి. పిఎల్ఐ పథకాలు భారతదేశ ఎగుమతుల బుట్టను సాంప్రదాయ వస్తువుల నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ వస్తువులు, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులు వంటి అధిక విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చాయి.

ఇప్పటి వరకు 14 రంగాల్లో రూ.3.65 లక్షల కోట్ల పెట్టుబడులతో 733 దరఖాస్తులకు ఆమోదం లభించింది. బల్క్ డ్రగ్స్, మెడికల్ డివైజెస్, ఫార్మా, టెలికాం, వైట్ గూడ్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్ అండ్ డ్రోన్స్ వంటి రంగాల్లో 176 ఎంఎస్ఎంఈలు పీఎల్ఐ లబ్ధిదారుల్లో ఉన్నాయి. 2023 మార్చి వరకు వాస్తవంగా రూ.62,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఫలితంగా రూ.6.75 లక్షల కోట్లకు పైగా ఉత్పత్తి, అమ్మకాలు పెరిగాయని, సుమారు 3,25,000 మందికి ఉపాధి లభించిందని తెలిపారు.  2022-23లో ఎగుమతులు రూ.2.56 లక్షల కోట్లు పెరిగాయి.

2022-23లో పీఎల్ఐ పథకాల కింద 8 రంగాలైన లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఎల్ఎస్ఈఎం), ఐటీ హార్డ్వేర్, బల్క్ డ్రగ్స్, మెడికల్ డివైజెస్, ఫార్మాస్యూటికల్స్, టెలికాం అండ్ నెట్వర్కింగ్ ప్రొడక్ట్స్, ఫుడ్ ప్రాసెసింగ్, డ్రోన్లు, డ్రోన్ కాంపోనెంట్స్ కింద రూ.2,900 కోట్ల ప్రోత్సాహక మొత్తాన్ని పంపిణీ చేశారు.

పిఎల్ఐ స్కీమ్ ప్రధాన స్మార్ట్ ఫోన్ కంపెనీలు తమ సరఫరాదారులను భారతదేశానికి తరలించడానికి దారితీసింది, ఉదా: ఫాక్స్కాన్, విస్ట్రాన్ పెగాట్రాన్. ఫలితంగా టాప్ హైఎండ్ ఫోన్లు ఇండియాలో తయారవుతున్నాయి. దీని ఫలితంగా బ్యాటరీ , ల్యాప్ టాప్ లు వంటి ఐటి హార్డ్ వేర్ లో మహిళల ఉపాధి, స్థానికీకరణ 20 రెట్లు పెరిగింది.

భారత్ లో మొబైల్ తయారీలో విలువ జోడింపు 20 శాతం వరకు ఉందని డీపీఐఐటీ కార్యదర్శి తెలిపారు. మొబైల్ తయారీలో విలువను 3 సంవత్సరాల వ్యవధిలో 20 శాతానికి పెంచగలిగామని, వియత్నాం వంటి దేశాలు 15 సంవత్సరాలలో 18% విలువ జోడింపును సాధించాయని, చైనా 25 సంవత్సరాలలో 49% విలువ జోడింపును సాధించిందని అన్నారు. ఈ కోణంలో చూస్తే, ఇది ఒక పెద్ద విజయం అని రాజేష్ కుమార్ సింగ్ వివరించారు.

ప్రస్తుతమున్న దశలవారీ తయారీ కార్యక్రమం (పిఎంపి)తో పాటు ఎల్ఎస్ఇఎమ్ కోసం పిఎల్ఐ పథకం ఎలక్ట్రానిక్స్ రంగంలో , స్మార్ట్ ఫోన్ తయారీలో 2014-15 లో నామమాత్రంగా ఉన్న విలువ జోడింపును వరుసగా 23%, 20% పెంచడానికి దారితీసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 101 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో స్మార్ట్ ఫోన్లు 44 బిలియన్ డాలర్లు, ఎగుమతులు 11.1 బిలియన్ డాలర్లు ఉన్నాయి.

టెలికాం రంగంలో 60% దిగుమతి ప్రత్యామ్నాయం సాధించబడింది యాంటెనా, జిపిఒఎన్ (గిగాబిట్ పాసివ్ ఆప్టికల్ నెట్ వర్క్) ,సిపిఇ (కస్టమర్ ప్రాంగణ పరికరాలు) లలో భారతదేశం దాదాపు స్వయం సమృద్ధి సాధించింది. అన్ని ఎంఎస్ఎంఇ స్టార్టప్ లను కలిగి ఉన్న పిఎల్ఐ పథకం కారణంగా డ్రోన్ల రంగం టర్నోవర్ 7 రెట్లు పెరిగింది.

పిఎల్ఐ స్కీమ్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ కింద, భారతదేశం నుండి ముడి పదార్థాల సోర్సింగ్ గణనీయమైన పెరుగుదలను చూసింది, ఇది భారతీయ రైతులు, ఎంఎస్ఎంఈల ఆదాయాన్ని సానుకూలంగా ప్రభావితం చేసింది.

పీఎల్ఐ పథకం కారణంగా ఫార్మా రంగంలో ముడి పదార్థాల దిగుమతులు గణనీయంగా తగ్గాయి. పెన్సిలిన్-జితో సహా ప్రత్యేకమైన ఇంటర్మీడియట్ మెటీరియల్స్ ,బల్క్ డ్రగ్స్ భారతదేశంలో తయారు అవుతున్నాయి. సిటి స్కాన్, ఎంఆర్ఐ మొదలైన  వైద్య పరికరాల తయారీలో సాంకేతిక పరిజ్ఞానం బదిలీ జరిగింది.