
వచ్చే ఎన్నికల్లో బిజెపి తనకు అండగా ఉండకపోవచ్చన్న జగన్ వ్యాఖ్యలపై ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. జగన్ ను బీజేపీ ఏనాడూ సమర్థించలేదని, ఆయనకు అండగా లేదని ఆయన స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్‌సిపితో బిజెపి ఎప్పుడుందో జగన్ చెప్పాలని ఆయన నిలదీశారు.
యువ మోర్చా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా మోసాలు చేసిందో మోటారు ర్యాలీలు, సభల ద్వారా వివరించామన్నారు. గతంలో నడ్డాతో పాటు కేంద్రమంత్రుల ఏపీ పర్యటనలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారని గుర్తుచేశారు. మతతత్వ వైఖరితో బిజెపి లేదని… ఆ వైఖరితో వైఎస్‌ఆర్‌సిపి ఉందని ధ్వజమెత్తారు. బిజెపి గురించి మాట్లాడే హక్కు కూడా జగన్ కు లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బిజెపికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సపోర్ట్ చేయడని జగన్ ఎలా చెపుతారని వీర్రాజు మండిపడ్డారు. పవన్ కల్యాణ్ బిజెపితోనే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ గురించి వైఎస్‌ఆర్‌సిపి నేతలు ఎప్పుడూ మాట్లాడరని, వారి పార్టీని విమర్శించినప్పుడే వారికి ఇవి గుర్తొస్తాయని వీర్రాజు ఎద్దేవా చేశారు.
వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంలో అంతులేని అవినీతి జరుగుతోందని పేర్కొంటూ ఏపీ అవినీతి మంత్రులపై బిజెపి పోరాడుతుందని చెప్పారు. ఏపీలో జరుగుతున్న అన్ని విషయాలు అమిత్ షా దృష్టికి తీసుకు వెళుతూ ఉంటామని తెలిపారు. ఏపీలో బిజెపిని పలచన చేయడానికి జగన్ వ్యూహాత్మకంగా ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం వద్దకు వెళ్ళి నిధులు తెచ్చుకొంటూ ప్రధాని మోదీ పేరునే చెప్పడంలేదని సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్, మంత్రి పేర్ని నాని పొంతన లేకుండా తలో మాట మాట్లాడుతున్నారని వీర్రాజు చెప్పారు.
More Stories
డిల్లీ స్కామ్ కంటే ఏపీ లిక్కర్ స్కామ్ పది రెట్లు పెద్దది
కృష్ణానదిపై తొమ్మిది వంతెనల నిర్మాణంకు సన్నాహాలు
షేర్ల బదిలీపై జగన్, భారతి ఆరోపణలు ఖండించిన విజయమ్మ