ప్రశ్నపత్రం లీకేజిలో రూ.1.63 కోట్ల లావాదేవీలు

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు రూ.1.63 కోట్ల లావాదేవీలు జరిగినట్లు విచారణలో తేలినట్లు పేర్కొన్నారు.  ఇప్పటికే నిందితులకు సంబంధించిన ఖాతా వివరాలు, చేతులు మారిన నగదు వివరాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
మరికొంత మందిని అరెస్టు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల అరెస్టయిన డీఈ పూల రమేష్‌ సహకారంతో ఏఈఈ, డీఏవో పరీక్షల్లో చూచిరాతకు పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.  నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలను రామంతాపూర్‌లోని సెంట్రల్‌ ఫోరెనిక్స్‌ సైన్స్‌ లాబోరేటరికి పంపించినట్లు తెలిపారు. వాటిని విశ్లేషిస్తున్న క్రమంలో మరికొంత సమాచారం బయటికి వచ్చినట్లు వెల్లడించారు.
 
 డీఈ రమేష్‌ ఏఈఈ ప్రశ్నపత్రాన్ని మరికొంత మందికి విక్రయించినట్లు సిట్‌ అధికారులు భావిస్తున్నామని చెప్పారు. దీన్ని బట్టి ఈ కేసులో అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. తర్వాత కేసు దర్యాప్తులో తేలే మిగతా నిందితులను బట్టి అనుబంధ అభియోగపత్రం దాఖలు చేయాలని భావిస్తున్నట్లు సిట్‌ అధికారులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.
 
ఈ కేసులో ఇప్పటివరకు 49 మందిని సిట్‌ అధికారులు అరెస్టు చేయగా, వీరిలో 16మంది మధ్యవర్తులుగా ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని ఛార్జ్‌షీట్‌లో తెలిపారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసిన ప్రశాంత్‌ మరో నిందితుడు న్యూజిలాండ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. ఈ కేసులో భాగంగా అరెస్ట్ అయిన వారిలో ఇందులో 15 మంది నిందితులు బెయిల్‌పై బయటకు వచ్చారని సిట్ తెలిపింది.
ప్రధాన నిందితుడు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డితో పాటు మిగతా నిందితులంతా జైల్లోనే ఉన్నారని… పూల రమేషే హైటెక్ మాస్ కాపీయింగ్ చేయించినట్లుగా గుర్తించినట్లు ప్రస్తావించింది. ఏఈ ప్రశ్నాపత్రాన్ని దాదాపు 80 మందికి పూల రమేష్ విక్రయించాడని, అతను నుంచి రాబట్టిన కీలక సమాచారంతో అరెస్ట్‌ల సంఖ్య మరింత పెరిగే అవకాశ ఉందని చెప్పుకొచ్చింది.
 
ఏఈఈ ప్రశ్నపత్రం లీకైన తర్వాత 13 మందికి, డీఏవో పేపర్‌ 8మందికి, గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ నలుగురికి చేరినట్లు గుర్తించినట్లు తెలిపారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌ చేరిన నలుగురిలో టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ముగ్గురు ఉద్యోగులు ఉండగా, మరో వ్యక్తి బయటివాడని తేల్చినట్లు వివరించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో దశలోనే ఉన్నట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.