గుండెపోటుతో ములుగు జెడ్పీ చైర్మన్ మృతి

బిఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత, ప్రస్తుతం ములుగు జిల్లా జిల్లా పరిషత్  చైర్మన్ గా ఉన్న కుసుమ జగదీష్ మృతి చెందారు. గుండెపోటుతో హన్మకొండలోని అజార హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కుసుమ జగదీశ్ బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడిగా, ఆ పార్టీ ఆ ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
గత 6 నెలలుగా గుండె నొప్పితో బాధపడుతున్న కుసుమ జగదీష్ ఆదివారం ఉదయం మరోసారి గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతడిని కుటుంబ సభ్యులు హుటాహుటిన హనుమకొండలోని అజర హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగానే జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మృతి చెందారు.
కుసుమ జగదీష్ అకాల మరణం పట్ల బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి  చంద్రశేఖర్ రావు గారు తీవ్ర దిగ్భ్రాంతిని సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి మృతి పట్ల ఆవేదన చెందారు. శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని భగవంతున్ని ప్రార్థించారు. తెలంగాణ ఉద్యమకారుడిగా నాటి ఉద్యమంలో జగదీష్ పోషించిన చురుకైన పాత్రను, ములుగు జిల్లా పార్టీ అధ్యక్షుడుగా జిల్లా పరిషత్ చైర్మన్ గా జగదీష్ చేస్తున్న సేవలను సీఎం స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కుసుమ జగదీష్ అకాల మరణం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు అత్యంత సన్నిహతుడైన జగదీష్ మృతి ఎంతో బాధకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో చురుకుగా పాల్గొన్నారన్నారు. కుసుమ జగదీష్ హఠాన్మరణం బాధాకరమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా నాటి ఉద్యమంలో జగదీష్ చురుకైన పాత్ర పోషించారన్నారు. ములుగు జిల్లా పార్టీ అధ్యక్షుడుగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా జగదీష్ నన్ను కలిసినప్పుడల్లా ములుగు ప్రాంత అభివృద్ధికి కావాల్సిన నిధుల గురించే అడిగేవారని గుర్తు చేసుకున్నారు.  జ‌గ‌దీశ్వ‌ర్ మృతి పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి మృతి దురదృష్టకరం అని తెలిపారు.