జాకీ పెట్టి లేపినా కాంగ్రెస్ లేచే పరిస్థితి లేదు

‘‘తెలంగాణలో అసలు కాంగ్రెస్ పార్టీ యాడుంది? కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా దేశంలో ఎక్కడా ఆ పార్టీ  లేదు.. జాకీ పెట్టి లేపినా కాంగ్రెస్ పార్టీ లేవదు” అంటూ బిజెపి రాష్త్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణాలో కాంగ్రెస్ పుంజుకొందని, బిజెపిని వెనుకకు నెట్టేసిందని జరుగుతున్న ప్రచారంపై తీవ్రంగా స్పందిస్తూ బీఆర్ఎస్, కాంగ్రెస్, ఓ సెక్షన్ మీడియా బీజేపీ గ్రాఫ్ ను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నయని ధ్వజమెత్తారు.
 
ఈ నెల 15న ఖమ్మంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రసంగించే బహిరంగసభ ఏర్పాట్ల గురించి ఖమ్మం పర్యటనకు వచ్చిన ఆయన ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, జిల్లాల సమావేశంలో మాట్లాడుతూ  కర్ణాటక ఫలితాలను బూచీగా చూపి బీజేపీ పనైపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలెవరూ పట్టించుకోవద్దల్ని అంటూ రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని భరోసా ఇచ్చారు. 
 
“కమ్యూనిస్టుల పనైపోయింది. సూది దబ్బడం పార్టీలని అవమానించిన కేసీఆర్ పంచనే చేరిన సిగ్గు, శరంలేని పార్టీల నేతలు కమ్యూనిస్టులు’’అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ సింహంలాంటి పార్టీ అని, తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేసి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
 
అన్ని ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదని సంజయ్ గుర్తు చేశారు.  ఖమ్మంలో నిరుద్యోగ మార్చ్ సక్సెస్ తో కేసీఆర్ కళ్లు బైర్లు కమ్మినయ్ అంటూ మళ్లీ 15న అమిత్ షా వస్తున్నారని తెలుసుకుని కేసీఆర్ కు చెమటలు పడుతున్నయని తెలిపారు. ఇక్కడ అమిత్ షా సభ సక్సెస్ అయిన తరువాత అవసరమైతే ప్రధాని మోదీ  సభను కొత్తగూడెంలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
 
 ఈ జిల్లాలో బీఆర్ఎస్ నేతల అరాచకాలకు అంతులేదని చెబుతూ  బీఆర్ఎస్ బాధితుల సంఘం సమావేశం పెడితే సర్దార్ పటేల్ స్టేడియం కూడా సరిపోదని ఎద్దేవా చేశారు.  బీఆర్ఎస్ మీద అంత కసితో ఉన్నారని పేర్కొంటూ కొంత మంది పోలీసులు బీఆర్ఎస్ కు తలొగ్గి బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మీరు బెదిరిస్తే భయపడే కార్యకర్తలు బీజేపీలో లేరని సంజయ్ పోలీసులను హెచ్చరించారు.
 
మహజన్ సంపర్క్ అభియాన్ పేరుతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ 9 ఏళ్ల పాలనా ఫలితాలపై ఇంటింటికీ తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపిచ్చారు.
తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కిందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీజేపీవైపు మొగ్గు చూపుతున్నారని స్పష్టం చేశారు. ఇప్పటివరకు అన్ని పార్టీలకు అవకాశమిచ్చిన ప్రజలు ఈసారి బీజేపీకి అధికారమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని సంజయ్ తెలిపారు.
బీఆర్ఎస్ నేతల ఆగడాలు ప్రజలు భరించలేకపోతున్నారని, ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీలేవీ అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. సీఎం ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వచ్చి ఇఛ్చిన హామీలొక్కటీ అమలు కాలేదని గుర్తు చేశారు.  భద్రాచలం రామాలయం అభివృద్ధికి కేసీఆర్‌ ఇస్తామన్న రూ. 100 కోట్లు నిధులు ఇవ్వలేదని, వరదలప్పుడు కరకట్ట నిర్మాణానికి రూ. 1000 కోట్లు ఇస్తానన్న హామీ అమలు కాలేదని, నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణం జరగలేదని వివరించారు.