ఎన్సీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా సుప్రియా, ప్రఫుల్‌ పటేల్‌

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) శాసనసభాపక్షంలో చీలిక తీసుకొచ్చి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని సీనియర్ నేత అజిత్ పవర్ ప్రయత్నాలు చేస్తున్నారని ఇటీవల కధనాలు వెలువడిన సమయంలో పార్టీ అధ్యక్ష పదవి నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటన చేసి కలకలం రేపిన పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవర్ ఇప్పుడు పార్టీకి ఇద్దరి నేతలను వర్కింగ్ ప్రెసిడెంట్ లుగా నియమించారు.

తన కుమార్తె, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, పార్టీ ఉపాధ్యక్షుడు ప్రఫుల్‌ పటేల్‌ను ఎన్సీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా వెల్లడించారు. తద్వారా పార్టీలో తన వారసురాలు కుమార్తె అనే స్పష్టమైన సంకేతం ఇచ్చినట్లయింది. గతంలో పార్టీలో తిరుగుబాటుకు ప్రయత్నించిన మేనల్లుడు, ఎన్సీపీ కీలక నేత అజిత్‌ పవార్‌ సమక్షంలోనే శరద్‌ పవార్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 25 వ ఆవిర్భావ దినోత్సవాల్లో ఈ నిర్ణయాన్ని పార్టీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. 1999లో శరద్ పవార్, పీఏ సంగ్మా కలిసి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఎన్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్, ఉమన్ యూత్, లోక్‌సభ సమన్వయకర్తగా సుప్రియా సూలే బాధ్యతలు నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా వ్యవహారాలను ప్రఫుల్ పటేల్ చూసుకుంటారు.
 
ఎన్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ టక్కరెకు ఒడిశా, పశ్చిమబెంగాల్, రైతులు, మైనారిటీ శాఖ బాధ్యతలు అప్పగించారు. నంద శాస్త్రిని ఢిల్లీ ఎన్‌సీపీ చీఫ్‌గా పవార్ ప్రకటించారు. గత నెలలో పార్టీ అధ్యక్ష పదవి నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించడంతో  ఆ పార్టీ నేతలు, కార్యకర్తల నుండి నిరసనలు ఎదురై,  ఈ నిర్ణయాన్ని పవార్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ విషయమై సీనియర్ నేతలతో ఏర్పాటు చేసిన బృందం రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మే 5 న కోరింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని విజ్ఞప్తి చేసింది. అప్పుడే, పార్టీలో సంస్థాగతంగా మార్పులు తీసుకొస్తానని, నూతన నాయకత్వంపై అప్పచెప్పే పక్రియ ప్రారంభిస్తానని శరద్ పవర్ ప్రకటించారు. మరోవైపు, మహారాష్ట్ర సీఎం పదవి కోసం 2024 అసెంబ్లీ ఎన్నికల వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదని అంటూ అజిత్ పవార్ సంచలన వాఖ్యలు చేశారు. సీఎం పదవికి ఇప్పుడు కూడా సిద్ధమేనని వెల్లడించారు.