జులై 1 నుంచి అమర్‌నాథ్ యాత్ర

పవిత్ర అమర్‌నాథ్‌ యాత్ర జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31 వరకు కొనసాగనుంది. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయ పర్వతాల్లో 3,880 మీటర్ల ఎత్తున కొలువుదీరే మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు భారీ ఎత్తున భక్తులు రానున్నారు.  గత ఏడాది 3.45 లక్షల మంది అమర్‌నాథ్‌ యాత్రలో పాల్గొనగా ఈసారి 5 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.
గత ఏడాది ఆకస్మిక వరదల కారణంగా 16 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనను దృష్టిలో ఉంచుకొని ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
62 రోజుల పాటు సాగనున్న ఈ పవిత్ర అమర్‌నాథ్ యాత్రకు జమ్మూకాశ్మీర్ యంత్రాంగం ముమ్మరంగా సన్నాహాలు చేస్తోంది. ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ గత ఏప్రిల్ 17న ప్రారంభమైంది.
యాత్రకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ పరిపాలనా విభాగం కూడా అనేక ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.  అమర్‌నాథ్ యాత్రలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ల సెలవులను రద్దు చేశారు.  అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాం ట్రాక్, గందర్‌బల్ జిల్లాలోని బల్తాల్ అనే రెండు మార్గాల నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమవుతుంది. ఇందుకోసం సంబంధిత అధికారులు, సెక్యూరిటీ ఏజెన్సీలన్నింటికీ అవసరమైన సూచనలు చేశారు.
 
అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్రం బోర్డు  ఉదయం, సాయంత్రం హారతి (ప్రార్థన)లో పాల్గొనేందుకు భక్తుల కోసం ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. యాత్ర కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 17 నుంచి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ మోడ్‌లో ప్రారంభమైంది.  అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాం ట్రాక్, గందర్‌బల్ జిల్లాలోని బల్తాల్ నుంచి ఏకకాలంలో ప్రారంభమయ్యే యాత్రలో యాత్రికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూసేందుకు యంత్రాంగం ఫూల్‌ప్రూఫ్ ఏర్పాట్లు చేస్తోంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
 
అమర్‌నాథ్ ప్రయాణం మొదటి మార్గం  దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లోని పహల్గామ్ ద్వారా సాంప్రదాయక 48 కి.మీ మార్గం. రెండోది సెంట్రల్ కాశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లాలో 14 కిలోమీటర్ల ఏటవాలుగా ఉండే బల్తాల్ మార్గం. రెండు మార్గాల నుంచి ఒకేసారి యాత్ర ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.  గతేడాది మాన్యువల్ ప్రక్రియకు బదులు ఈసారి ప్రయాణికుల కోసం ఆధార్ గుర్తింపు ఆధారిత ఫారమ్ జనరేషన్ విధానాన్ని రూపొందించారు.
 
యాత్రకు వెళ్లాలనుకునే ప్రయాణికులందరూ భారతదేశం అంతటా గుర్తింపు పొందిన డాక్టర్ల నుంచి ఆరోగ్య ధృవీకరణ పత్రాలను పొందవలసి ఉంటుంది.
యాత్రికులందరికీ ఆరోగ్య ధృవీకరణ పత్రం తప్పనిసరి. అమర్‌నాథ్ యాత్రలో విధులు నిర్వహిస్తున్న పారా మెడికల్ సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. ఆరోగ్యకరమైన ఆహారాన్నే అనుమతించాలని అమర్‌నాథ్‌జీ ఆలయ బోర్డు నిర్ణయించింది.
 
అమర్‌నాథ్‌కు వెళ్లే బట్కల్‌, పహల్‌గామ్‌ దారుల్లో భారీగా మంచు పేరుకొని ఉండటంతో జూన్‌ 15 నాటికి మంచును తొలగించే పనిని బార్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ చేపట్టింది. మరోవైపు యాత్రను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే ముప్పు ఉందనే ఇంటెలిజెన్స్‌ హెచ్చరికల నేపథ్యంలో మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
ఈ మేరకు శుక్రవారం యాత్ర భద్రతా ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ ప్రాంతంలో తగినన్ని పోలీసులు, భద్రతా బలగాలను మోహరించడంతోపాటు పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రస్తుత భద్రతా విధానం, యాత్రకు వ్యతిరేకంగా వచ్చిన బెదిరింపులను దృష్టిలో ఉంచుకుని సి ఆర్ పి ఎఫ్, పోలీసు, నిఘా సంస్థల మధ్య వివరణాత్మక చర్చ జరిగింది.
 
అదే సమయంలో జమ్మూకాశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్ర కోసం 2,500కి పైగా టాయిలెట్లను సిద్ధం చేసే యోచన ఉంది. నేషనల్ బ్యాంక్ 316 శాఖలు, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ 90 శాఖలు, యెస్ బ్యాంక్ 37 శాఖలు, ఎస్ బి ఐ  99 శాఖలతో సహా దేశవ్యాప్తంగా 542 బ్యాంక్ శాఖలలో అమర్‌నాథ్ యాత్ర ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.