భారతదేశ జనాభాలో 11.4 శాతం మంది డయాబెటిస్ (మధుమేహ వ్యాధి)తో, 35.5 శాతం మంద్రి హైపర్‌టెన్షన్ (అధిక రక్తపోటు)తో బాధపడుతున్నట్లు దేశవ్యాప్తంగా జరిపిన తాజా సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే నివేదికను ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ జర్నల్ ప్రచురించింది. భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్), ఇతర సంస్థలతో కలసి మద్రాసు డయాబెటిస్ రిసెర్చ్ ఫౌండేషన్ నిర్వహించింది.
మధుమేహ రోగుల సంఖ్య ప్రస్తుతం 10 కోట్ల మందికి పైగా ఉన్నట్టు ఈ సర్వే తెలిపింది. 2019లో 7 కోట్లుగా ఉన్న ఆ సంఖ్య కేవలం నాలుగేండ్లలో 44 శాతం పెరిగింది. అంతేగాక ప్రస్తుతం దేశంలో ప్రీడయాబెటిక్స్ (త్వరలో మధుమేహం బారినపడే అవకాశం ఉన్నవాళ్లు) సంఖ్య కూడా భారీగా పెరిగిపోయింది. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే గోవాలో డయాబెటిక్ రోగుల శాతం (26.4 శాతం) ఎక్కువగా ఉన్నది. పుదుచ్చేరి (26.3 శాతం), కేరళ (25.5 శాతం) ఆ తర్వాత వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా చూస్తే దేశం మొత్తం జనాభాలో 11.4 శాతం మంది మధుమేహం వ్యాధిగ్రస్తులు ఉన్నారు.
మధుమేహుల సంఖ్య తక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తాజా అధ్యయనం హెచ్చరికలు చేసింది. రాబోయే ఐదేళ్లలో ఆయా రాష్ట్రాల్లో షుగర్ రోగుల సంఖ్య శరవేగంగా పెరిగే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.
ఇక గోవా, కేరళ, తమిళనాడు, చండీగఢ్‌లలో డయాబెటిస్ కేసులతో పోలిస్తే ప్రీడయాబెటిక్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. పుదుచ్చేరి, ఢిల్లీల్లో డయాబెటిక్, ప్రిడయాబెటిక్ కేసులు సమంగా ఉన్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో డయాబెటిక్ రోగుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, ప్రీడయాబెటిక్ కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నదని పరిశోధకులు తెలిపారు.
ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో డయాబెటిక్ రోగుల సంఖ్య కేవలం 4.8 శాతంగా ఉన్నది. కానీ అక్కడి ప్రీడయాబెటిక్ కేసుల సంఖ్య మాత్రం 18 శాతానికి పైగా ఉన్నది. అంటే జాతీయ సగటు 15.3 శాతం కంటే ఇది చాలా ఎక్కువ. ఆ రాష్ట్రంలో ఒక్క డయాబెటిక్ పేషెంట్ ఉంటే.. నలుగురు ప్రీడయాబెటిక్స్ ఉన్నారన్నమాట. వీళ్లంతా డయాబెటిక్ రోగులుగా మారితే అత్యధిక షుగర్ రోగులు ఉన్న రాష్ట్రంగా యూపీ నిలుస్తుంది.
మధ్యప్రదేశ్‌లో ప్రతి డయాబెటిక్ పేషెంట్‌కు ముగ్గురు ప్రీడయాబెటిక్ లక్షణాలు కలిగినవాళ్లు ఉన్నారు. సిక్కింలో డయాబెటిక్ రోగులు, ప్రీడయాబెటిక్స్ సంఖ్య రెండూ ఎక్కువగానే ఉన్నాయి. ప్రీడయాబెటిక్ అంటే శరీరంలో షుగర్ స్థాయిలు ఉండాల్సిన దానికంటే కాస్త ఎక్కువగా ఉంటాయి.
ప్రీడయాబెటిక్ లక్షణాలు ఉన్నవాళ్లు తమ జీవనశైలిని మార్చుకోకపోతే కొన్ని నెలల్లోనే డయాబెటిక్ రోగులుగా మారిపోవచ్చని, కొందరు ఆ తర్వాత కూడా ప్రీడయాబెటిక్స్‌గానే కొనసాగవచ్చని, మరికొందరు జీవనశైలిని మార్చుకుని, హెల్తీ డైట్, వ్యాయామాలతో ప్రీడయాబెటిక్ లక్షణాలను పోగొట్టుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
భారత జనాభాలో 28.6 శాతం మంది సాధారణ స్థూలకాయంతో, 39.5 శాతం మంది పొట్ట స్థూలకాయంతో బాధపడుతున్నట్లు కూడా సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 2008 నుంచి 2020 మధ్య ఈ సర్వే జరిగింది. మొత్తం 1,13,043 మంది సర్వేలో తమ అభిప్రాయం తెలిపారు. వీరిలో పట్టణ ప్రాంతాలవారు 33,537 మంది గ్రామీణ ప్రాంతాల వారు 79,506 మంది ఉన్నారు.
భారత జనాభాలో 35.5 శాతం హైపర్ టెన్షన్‌తో బాధపడుతుందగా 15.3 శాతం మంది ప్రీ డయాబెటిస్‌తో బాధపడుతున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. అంతేగాక 81.2 శాతం మంది కొలెస్ట్రాల్, లో డెన్సిటీ లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్(ఎల్‌డి-సి), ట్రిగ్లిసెరైడ్స్, హై డెన్సిటీ నలిపోప్రొటీన్(హెచ్‌డి-ఎల్) వంటి లిపిడ్స్ అసమతుల్యతైన డిస్లిపిడీమియాతో బాధపడుతున్నారని సర్వేలో బయటపడింది.
గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణ ప్రాంతాలలోనే ప్రీడయాబెటిస్ తప్పించి ఇతర మెటబాలిక్ ఎన్‌సిడిలన్నీ అధికంగా ఉన్నట్లు తేలింది. డయాబెటిస్‌కు ప్రీడయాబెటిస్‌కు మధ్య నిష్పత్తి ఒకటి కన్నా తక్కువే ఉందని సర్వే ద్వారా తెలిసింది. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు చెందిన పరిశోధకులు ఈ సర్వే బృందంలో ఉన్నారు.
గత అంచనాల కన్నా ప్రస్తుతం డయాబెటిస్, మెటబాలిక్ ఎన్‌సిడిలు భారత్‌లో అధికంగా ఉన్నాయని, వీటిని అదుపు చేసేందుకు ప్రభుత్వాలు నిర్దిష్టమైన విధానాలను అమలు చేయాలని సర్వేలో పరిశోధకులు సూచించారు.
More Stories
ప్రొటోకాల్ ఉల్లంఘనలపై బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
చెన్నమనేని జర్మనీ పౌరుడే…తేల్చిచెప్పిన హైకోర్టు
చైనా జలవిద్యుత్ డ్యామ్ లతో 12 లక్షల మంది టిబెటన్ల నిరాశ్రయం