కేరళలో గత రెండు రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఆ రాష్ట్రంలో అధిక తేమతో కూడిన త్రీవమైన వేడి కనీసం ఏప్రిల్ 27 వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ నీతా కె. గోపాల్ వెల్లడించారు. వడదెబ్బకు ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఒకరిద్దరు మరణించారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కరోనా తరహాలో ఇప్పుడు సెల్ఫ్ లాక్ డౌన్ (స్వీయ నిర్బంధం) పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
తీవ్రమైన ఎండ తగిలే సమయాల్లో నేరుగా సూర్యరశ్మికి గురికాకుండా ఉండేందుకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య అనవసర ప్రయాణాలు, బహిరంగ ప్రదేశాలలో పనులు మానుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. అలాగే ఈ సమయంలో బహిరంగ ప్రదేశాల్లో సమావేశాలు, క్రీడా కార్యక్రమాలు నిషేధించనున్నట్లు వెల్లడించారు.
వడగాలుల హెచ్చరికల దృష్ట్యా, పాలక్కాడ్, కొల్లాం, త్రిస్సూర్ జిల్లాల్లో పండుగల సమయంలో పగటిపూట జరిగే ఏనుగుల ఊరేగింపులు, బాణాసంచా ప్రదర్శనలను నివారించాలని లేదా వాయిదా వేయాలని ఆయన ఆదేశించారు. అలాగే ప్రయాణికులకు, ప్రజలకు తాగునీటిని అందించడానికి నీటి ట్యాంకులను, నీడ ఉన్న విశ్రాంతి ప్రదేశాలను ఏర్పాటు చేయాలని స్థానిక సంస్థలు, కుటుంబశ్రీ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
అలసట లేదా వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని ఆయన సూచించారు. ఎండదెబ్బకు ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తే వెంటనే వారిని నీడ ఉన్న ప్రదేశానికి తరలించి వైద్య సహాయం అందించాలని విజయన్ కోరారు.. పాలక్కాడ్, కొల్లాం, త్రిస్సూర్ వంటి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40°సి దాటడంతో, అధిక తేమ కారణంగా అసౌకర్యం మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో, భారత వాతావరణ శాఖ వడగాలుల హెచ్చరికలను జారీ చేసింది.

More Stories
మాలేగావ్ పేలుళ్ల కేసులో నలుగురు నిందితులకు విముక్తి
కేరళలో బాణాసంచా తయారీలో పేలుడు.. 13 మంది మృతి
తమిళనాడులో ప్రతి ఐదుగురు అభ్యర్థుల్లో ఒకరిపై క్రిమినల్ కేసులు