అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ఓ నరకకూపమంటూ ఓ పోస్టును రీషేర్ చేయడం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుమారం రేగడంతో దాన్ని చల్లార్చేందుకు అమెరికా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా భారత్‌పై చేసిన వాఖ్యలపై భారతీయుల్లో వెల్లువెత్తిన ఆగ్రహాన్ని గమనించిన వైట్ హౌస్ భారత్ ఒక గొప్ప దేశమని, భారత ప్రధాని తనకు అత్యంత సన్నిహిత మిత్రుడని ట్రంప్ స్వయంగా అన్నట్లు ఓ ప్రకటనను విడుదల చేసింది.
అమెరికాలో పుట్టుకతో వచ్చే పౌరసత్వ చట్టాన్ని రద్దు చేయాలని ట్రంప్ చాలా రోజులుగా భావిస్తున్నారు. అయితే దీనికి మద్దతుగా ఆయన మైఖేల్ సావేజ్ అనే కన్జర్వేటివ్ రచయిత చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పంచుకుంటూ జన్మతః పౌరసత్వంపై తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ఒక లేఖను ట్రంప్ బుధవారం షేర్ చేశారు.
అందులో భారత్, చైనాలను నరకకూపలుగా వర్ణించడమే కాకుండా, అక్కడి నుంచి వచ్చే వలసదారులు కేవలం పౌరసత్వం కోసమే గర్భిణులను అమెరికాకు పంపిస్తున్నారని అత్యంత ఘాటుగా విమర్శించారు.పుట్టిన పసికందు తక్షణమే పౌరసత్వం పొందుతుంది. ఆ తర్వాత వాళ్లు చైనా, భారత్ లేదా ఈ భూమ్మీద ఉన్న మరేదైనా నరకప్రాయమైన ప్రదేశం నుంచి మొత్తం కుటుంబాన్ని తీసుకువస్తారని దుయ్యబట్టారు.
ఇది చూడడానికి మీరు మరీ దూరం వెళ్లనవసరం లేదు. ఇక్కడ ఇప్పుడు ఇంగ్లిష్ మాట్లాడటం లేదు. ఇప్పుడు ఇక్కడికి వస్తున్న వలసదారుల్లో ఈ దేశం పట్ల ఏమాత్రం విధేయత లేదు. కాని ఒకప్పుడు ఇలా ఉండేది కాదు అని ఆ లేఖలో ట్రంప్ పేర్కొన్నారు. పైగా, ఐరిష్, ఇటాలియన్, పోలిష్, లిథువేనియన్, డొమేనియన్, రష్యన్ వంటి సమూహాలు అమెరికన్ సమాజంలో విజయవంతంగా కలిసిపోయాయని, అయితే సంప్రదాయ మెల్టింగ్ పాట్(వివిధ సంస్కృతుల సమ్మేళనం) ఆశించిన విధంగా పనిచేయడం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు.
పౌర హక్కుల సంఘంపై మండిపాటు
తల్లిదండ్రుల నేపథ్యంతో సంబంధం లేకుండా అమెరికాలో పుట్టిన ఎవరైనా ఆటోమేటిక్‌గా పౌరులు అవుతారని భావన అయిన జన్మతః పౌరసత్వం అసమంజమైనదని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అమెరికన్ పౌర హక్కుల సంఘాన్నీ (ఏసీఎల్‌యూ) లక్ష్యంగా చేసుకుంటూ మాఫియా కుటుంబాలు అన్నిటినీ కలిసి చేసిన నష్టానికన్నా అధికంగా ఏసీఎల్‌యూ అమెరికాకు నష్టం చేకూర్చిందని ఆయన ఆరోపించారు.
ఆరోగ్య సంరక్షణ వంటి ప్రజాసేవలకు వలసదారులు భారం మోపుతున్నారని, పత్రాలు లేని వ్యక్తుల ఖర్చులను పన్ను చెల్లింపుదారులే భరిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. కేవలం మన తీరంలో ఒక పసికందును వదిలి ఆ తర్వాత మొత్తం కుటుంబాన్ని తరలిస్తున్న చైనీయులతో మన దేశం నిండిపోతున్నది. దివాలా తీసిన దేశంలో కనీస ఇంగితజ్ఞానం ఎందుకు లేదు? అంటూ ప్రశ్నించారు.
ఏసీఎల్‌యూ న్యాయవాది వాంగ్ మన జాతీయ గుర్తింపును నాశనం చేయడానికి, మనల్ని చైనా వలస దేశంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. కాని ఇది కేవలం చైనాకే పరిమితం కాదు. భారతదేశానికి కూడా వర్తిస్తుంది అని ఆ లేఖలో ట్రంప్ పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా అక్కడి నుంచి వచ్చే ఐటీ మేధావులు ల్యాప్‍టాప్‌లు పట్టుకున్న గ్యాంగ్‌స్టర్లని వ్యాఖ్యానించారు.
ఈ వాఖ్యలు భారతీయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉండటంతో దౌత్యపరమైన చిక్కులు మొదలయ్యాయి. ఈ వ్యాఖ్యల వీడియోను అమెరికా అధ్యక్ష హోదాలో ఉన్న ట్రంప్ రీపోస్ట్ చేయడంతో కలకలం చెలరేగింది. భారత మీడియాలో ఈ వార్త దావానంలా వ్యాపించడంతో అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి రంగంలోకి వచ్చారు. “భారత్ ఒక గొప్ప దేశం. అక్కడ నాకు అత్యంత ఆప్తమిత్రుడు నాయకత్వం వహిస్తున్నారు” అని ట్రంప్ అన్నట్లు ఆయన వెల్లడించారు.
అయితే ఈ వ్యాఖ్యలు ట్రంప్ ఎప్పుడు, ఎక్కడ చేశారన్నది మాత్రం స్పష్టం చేయలేదు. కేవలం వివాదాన్ని సద్దుమణిగేలా చేయడానికే ఈ ప్రకటన చేసినట్లు దౌత్య నిపుణులు భావిస్తున్నారు.
వ్యూహాత్మకంగా భారత విదేశాంగ శాఖ
ఈ వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆ అంశంతో కూడిన కొన్ని వార్తా నివేదికలను చూశామని, దాన్ని అక్కడే వదిలేస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ అంశంపై మరింత వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు. “మేము కొన్ని నివేదికలను చూశాం. ఆ వ్యాఖ్యలు అనుచితమైనవి, స్పష్టమైన అవగాహన లేనవి, అసభ్యకరమైనవి” అని కొట్టిపారేసారు.
అయితే, ఈ వ్యాఖ్యలు భారత్-అమెరికా సంబంధాల వాస్తవికతను ప్రతిబించవన్న ఆయన పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రయోజనాలపై ఆధారపడి ఈ బంధం ఎంతో కాలంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ట్రంప్ పోస్టు వైరల్ కావడంతో న్యూఢిల్లీలోని అమెరికా ప్రతినిధి క్రిష్టోఫర్ ఎల్మ్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. భారత్ గురించి ట్రంప్ సానుకూలంగా మాట్లాడారని, స్నేహపూర్వక సంబంధాలను గుర్తు చేశారని చెప్పుకొచ్చారు.
నిజానికి ఈ వివాదానికి మూలమైన మైఖేల్ సావేజ్ తన పాడ్‌కాస్ట్‌లో అమెరికా సుప్రీం కోర్టు వాదనలను తప్పుబట్టారు. “ల్యాప్‌టాప్‌లు పట్టుకున్న గ్యాంగ్‌స్టర్లు” దేశ డెమోగ్రాఫిక్‌ను మార్చేస్తున్నారని, వీరికి అడ్డుకట్ట వేయాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికా జెండాను వారు అగౌరవపరుస్తున్నారని జాత్యహంకార పూరిత వ్యాఖ్యలు చేశారు.
అయితే రెండు దేశాల మధ్య బంధం బలంగా ఉన్న తరుణంలో ఇలాంటి సోషల్ మీడియా ప్రకటనలు చిచ్చు పెట్టకుండా అమెరికా యంత్రాంగం వేగంగా స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ అంశంపై ప్రతిపక్ష కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భారతీయులపై అవమానకర వ్యాఖ్యలు వచ్చినప్పటికీ ప్రధాని స్పందించలేదని ఆరోపించారు. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వ స్థాయిలో ఎందుకు లేవనెత్తడం లేదని ప్రశ్నించారు.
కాగా, భారత్, చైనాలను నరక కూపాలుగా ట్రంప్ వర్ణించడాన్ని భారత్ లోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ పరోక్షంగా ప్రస్తావిస్తూ ఇరాన్‌లోని నాగరికతను నాశనం చేస్తానని బెదిరించిన ఓ నరక కూపానికి యుద్ధ నేరస్తుడైన అధ్యక్షుడిగా ట్రంప్‌ను వర్ణించారు. చైనా, భారత్ రెండూ నాగరికతకు పుట్టినిల్లు అని ఓ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.

More Stories
బెంగాల్ లో 10 శాతం పెరిగిన పోలింగ్, తగ్గిన 12 శాతం ఓట్లు!
ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల ధరలతో ‘విద్యా వివక్ష’
అమెరికాలో అసంతృప్తిగా 40 శాతం మంది భారతీయులు