ఒడిశాలో ఇంకా గుర్తించని 82 మృతదేహాలు

ఒడిశాలోని బాలాసోర్‌ సమీపంలో గత శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో చనిపోయిన 82 మంది వ్యక్తుల మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. ఎయిమ్స్‌ భువనేశ్వర్‌లో వీటిని భద్రపరిచారు. అయితే ఈ మృతదేహాల గుర్తింపు కోసం పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల సహాయాన్ని ఒడిశా ప్రభుత్వం కోరింది.
 
ఆయా రాష్ట్రాల అధికారులతో చర్చలు జరిపింది. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాద మృతుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసి బాధిత కుటుంబాలకు అందజేసేందుకు సహకరించాలని పేర్కొంది.  కాగా, రైలు ప్రమాద మృతులను గుర్తించేందుకు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ విజయ్ అమృత కులంగే తెలిపారు.
 
అలాగే మృతదేహాలను గుర్తించేందుకు వచ్చే బాధిత కుటుంబాలకు ఆహారం, వసతి వంటి ఏర్పాట్లు కూడా చేసినట్లు చెప్పారు. ఎయిమ్స్ భువనేశ్వర్‌లో ఉంచిన 162లో 80 మృతదేహాలను సంబంధిత కుటుంబాలకు అప్పగించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఇంకా 82 మృతదేహాలను గుర్తించాల్సి ఉందని పేర్కొన్నారు.
 
మృతదేహాలు తమ వారివేనంటూ ఎక్కువ మంది చెబుతున్నారని, దీంతో డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి వాటిని అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఇప్పటి వరకు 50 డీఎన్‌ఏ నమూనాలు సేకరించి పరీక్ష కోసం ఎయిమ్స్ ఢిల్లీకి పంపినట్లు అధికారులు తెలిపారు.
 
తొలుత పంపిన 29 డీఎన్‌ఏ నమూనాల రిపోర్టులు మరో రెండు రోజుల్లో వస్తాయని, అప్పుడు మృతదేహాలను సరైన కుటుంబాలకు అప్పగిస్తామని చెప్పారు. అలాగే మృతదేహాలు పాడవకుండా మైనస్‌ 18 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉన్న కంటైనర్‌లో ఉంచినట్లు వెల్లడించారు.అయితే మృతదేహాలు తారుమారవుతున్నట్లు కొందరు ఆరోపించారు. రైలు ప్రమాదంలో మరణించిన తన కుమారుడి మృతదేహాన్ని బీహార్‌ కుటుంబానికి అప్పగించారని బెంగాల్‌కు చెందిన వ్యక్తి తెలిపాడు. డీఎన్‌ఏ పరీక్ష రిపోర్ట్‌ రాకముందే తన కుమారుడిగా భావించిన మృతదేహాన్ని వేరే వారికి అప్పగించారని ఆరోపించాడు.

సరిగ్గా వారం కిందట ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో 288 మంది మరణించగా, వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. వందలాది మంది కాళ్లు, చేతులు కోల్పోయి వికలాంగులయ్యారు. ఇలా ఉండగా, ఒడిశా రైళ్ల ప్రమాదంలో మృతదేహాలు భద్రపరిచేందుకు తాత్కాలిక శవాగారంగా వినియోగించిన బాలాసోర్‌ జిల్లాలోని బాహానగా హైస్కూల్‌ను కూల్చివేశారు. ఈ ఘటనలో మృతదేహాలను స్థానిక బాహానగా హైస్కూల్‌లో భద్రపరిచారు. దీంతో స్థానికులు అటు వైపు పోవడానికి కూడా జంకుతున్నారు.

సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో పాఠశాలకు వచ్చేందుకు విద్యార్థులు భయపడుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఈ పాఠశాలకు పిల్లలను పంపించేందుకు వెనకడుగు వేస్తున్నారు. దీంతో స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ప్రమీలా స్వయిన్‌ ఈ విషయాన్ని బాలాసోర్‌ జిల్లా కలెక్టర్‌ దత్తాత్రేయ షిండేకు చెప్పగా ఆయన పాఠశాల కూల్చివేతకు ఆదేశించారు.