కారడవిలో 40 రోజులకు మృత్యుంజయులుగా చిన్నారులు

విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి, ప్రమాదకర ఆమెజాన్ అడవుల్లో 40 రోజుల పాటు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని సజీవంగా, తమ  కోసం వెతుకుతున్న భద్రత దళాలకు లభించి తిరిగివచ్చి నలుగురు పిల్లలు మృత్యుంజయులుగా నిలిచారు. ఆ నలుగురిలో 11 నెలల పసిపాప కూడా ఉంది. కొలంబియాలో మే 1వ తేదీన ఒక చిన్న సెస్నా సింగిల్ ఇంజిన్ విమానం ప్రమాదానికి గురైంది.
అందులో పైలట్ సహా ఏడుగురు ప్రయాణిస్తున్నారు. సాంకేతిక లోపంతో ఆమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో అది కూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న పైలట్, ఆ చిన్నారుల తల్లి మాగ్దలీనా వాలెన్షియా, మరో వ్యక్తి (గైడ్) ఆ ప్రమాదంలో మృతి చెందారు.  కానీ, అదృష్టవశాత్తూ, 13 ఏళ్ల లెస్లీ జాకోబాంబైర్, 9 ఏళ్ల సొలినీ జాకోబాంబైర్, 4 ఏళ్ల టియన్ రానోక్, పసిపాప క్రిస్టిన్.. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.
ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు కానీ వారు చిక్కుకుంది ఒక అత్యంత దట్టమైన, ప్రమాదకరమైన కారడవిలో దాదాపు 40 రోజుల పాటు వారు తిరుగుతూ ఒంటరిగా గడిపారు.  అంత చిన్న వయస్సు ఉన్న పిల్లలు ధైర్యంగా, అన్ని రోజులు అడవిలో గడపడం నమ్మశక్యం కాని వాస్తవం.ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు ‘ఆపరేషన్‌ హోప్‌’ పేరుతో సహాయక చర్యలు ప్రారంభించారు. విమాన ప్రమాదం తర్వాత, అధికారులు ఆ విమానం కోసం గాలింపు ప్రారంభించారు.
మే 16 న వారికి దట్టమైన అడవిలో భారీ వృక్షాల మధ్య విమాన శిధిలాలు కనిపించాయి. అక్కడ మూడు మృతదేహాలు ఉన్నాయి కానీ, చిన్నారుల జాడ లేదు. దీంతో వారి కోసం దట్టమైన అడవుల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. దాదాపు 150 మంది సైనికులు అమెజాన్‌ అడవిని జల్లెడపట్టగా మే 18వ తేదీన చిన్నారులు క్షేమంగా ఉన్నట్లు తెలియజేసే కొన్ని ఆధారాలు వారి కంటపడ్డాయి.
దీంతో వారు స్థానిక తెగల వారితో కలిసి తమ గాలింపును మరింత విస్తృతం చేశారు. ఎట్టకేలకు ప్రమాదం జరిగిన 40 రోజుల తర్వాత శుక్రవారం చిన్నారులను సజీవంగా గుర్తించారు. చాలా నీరసంగా ఉన్న ఆ చిన్నారులకు వెంటనే అవసరమైన తక్షణ వైద్య సహాయం అందించారు. ఈ ఘటనతో కొలంబియాలో పండుగ వాతావరణం నెలకొంది.
దేశాధ్యక్షుడు గుస్తావో పెడ్రో ఈ సమాచారాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు. ఆ చిన్నారుల ఫొటోలను షేర్ చేశారు. ఈ పిల్లలు చరిత్రలో నిలిచిపోతారని ప్రశంసించారు. చిన్నారులను కాపాడిన బృందంలోని అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు.

‘దేశమంతటికీ సంతోషకరమైన వార్త..! 40 రోజుల క్రితం కొలంబియా అడవిలో గల్లంతైన నలుగురు పిల్లలు సజీవంగా కనిపించారు. ఇది చరిత్రలో మిగిలిపోతుంది’ అంటూ పెట్రో సంతోషం వ్యక్తం చేశారు. నిత్యం క్రూరమృగాలు తిరిగి ఈ దట్టమైన అమెజాన్‌ అడవిలో చిన్నారులు ఇన్ని రోజులు బతికుండటం అద్భుతమనే చెప్పాలి.