దేశాన్ని ఎలా గౌరవించాలో నేర్చుకో రాహుల్

దేశాన్ని ఎలా గౌరవించాలో ఆయన తన పూర్వీకుల నుంచి నేర్చుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కేంద్ర హోం మంత్రి అమిత్ షా హితవు చెప్పారు. విదేశాల్లో స్వదేశాన్ని విమర్శించడం ఏ రాజకీయ నేతకూ తగదని పేర్కొంటూ రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి, మన దేశాన్ని దూషిస్తూ, విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా గుజరాత్‌లోని పటన్ జిల్లా, సిద్ధ్‌పూర్ పట్టణంలో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడారు. ఏ దేశభక్తుడైనా భారత దేశ రాజకీయాల గురించి భారత దేశంలోనే చర్చించాలని స్పష్టం చేశారు.

విదేశాలకు వెళ్లి, స్వదేశంలోని రాజకీయాల గురించి చర్చించడం, దేశాన్ని తప్పుబట్టడం ఏ రాజకీయ నాయకునికీ తగదని చివాట్లు పెట్టారు. ఈ విషయాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని రాహుల్ గాంధీ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

 భారత దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని కాంగ్రెస్ పార్టీ ఆపడం లేదని ఆయన మండిపడ్డారు. వేసవి కాలం ఉష్ణోగ్రతల కారణంగా రాహుల్ సెలవులను గడిపేందుకు విదేశాలకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన విదేశాల్లో మన దేశాన్ని తప్పుబడుతున్నారని చెప్పారు. ‘‘మీ పూర్వీకుల నుంచి నేర్చుకోండి’’ అని రాహుల్ గాంధీకి తాను సలహా ఇస్తున్నానని చెప్పారు.

గడచిన తొమ్మిదేళ్లలో ప్రధాని మోదీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల కలలను నెరవేర్చిందని అమిత్ షా కొనియాడారు. నూతన విద్యా సంస్థలను తెరవడం, రాయితీ ధరలకు గృహాలను ఇవ్వడం, లక్షలాది ఉద్యోగాలను సృష్టించడం ద్వారా మధ్య తరగతి ప్రజల కలలను సాకారం చేసిందని పేర్కొన్నారు.

మోదీ పాలనలో మధ్య తరగతి ప్రజల ఆర్థిక పరిస్థితి వేగంగా పెరిగిందని చెబుతూ సంవత్సరానికి రూ.7 లక్షల ఆదాయం వచ్చేవారికి పన్ను మినహాయింపు ఇచ్చామని గుర్తు చేశారు. జనఔషధి ద్వారా తక్కువ ధరలకు మందులను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. అదే విధంగా బీమా సదుపాయాలు కూడా కల్పిస్తున్నామని తెలిపారు.