మణిపూర్ లో శాంతి కమిటీ ఏర్పాటు

ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం మణిపూర్ గవర్నర్ నేతృతంలో శాంతి కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం ముఖ్యమంత్రి, కొందరు రాష్ట్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులు కమిటీలో ఉంటారు.

వీరితోపాటు మాజీ ప్రభుత్వ అధికారులు, విద్యావేత్తలు, సాహితీవేత్తలు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు, వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రతినిధులు కమిటీలో ఉంటారు. రాష్ట్రంలోని వివిధ జాతులు, సామాజికవర్గాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొల్పి,  ఘర్షణ పడుతున్న పార్టీలు, గ్రూపుల మధ్య శాంతియుత చర్చలు జరపడం కమిటీ ప్రధాన లక్ష్యం.

జాతుల మధ్య సామాజిక ఐక్యత, పరస్పర అవగాహన, సుహృత్ సంబంధాలు పెంపొందించడం ఈ కమిటీ బాధ్యతగా హోం మంత్రిత్వశాఖ పేర్కొంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించడానికి కేంద్రహోం మంత్రి అమిత్‌షా మణిపూర్‌ను సందర్శించిన తరువాత శాంతికమిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగాయి.

రాష్ట్రంలో జరిగిన హింసాయుత సంఘటనలకు సంబంధించి నమోదైన ఆరు ఎఫ్‌ఐఆర్‌లు, నేరపూరిత కుట్రకోణంలో నమోదైన ఐదు కేసులు, సాధారణ కుట్రపై నమోదైన ఒక కేసుపై సిబిఐ దర్యాప్తు జరుగుతుందని అమిత్ షా ప్రకటించారు. సిబిఐ ఆరు కేసులను నమోదు చేయడమే కాక, దర్యాప్తుకు పదిమంది అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది.

ఇలా ఉండగా, శుక్రవారం కూడా ఒక గ్రామంలో భద్రతా దళాల దుస్తువులతో వచ్చి ముగ్గుర్ని ఇంట్లో నుండి పిలిచి, కాల్చి చంపడడంతో హింసాయుత చర్యలు కొనసాగుతూ ఉండడంతో రాష్ట్రంలో కేంద్ర దళాల మోహరింపును జూన్ చివరి వరకు కొనసాగిస్తున్నారు. 114 కంపెనీల కేంద్ర దళాలు ఇక్కడ ఉన్నాయి.

పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్న సమయంలో అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ శనివారం అక్కడ పర్యటన జరిపారు. శర్మ మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ను కలసి పరిస్థితుల గురించి చర్చించారు. హింసాకాండ చెలరేగిన తర్వాత ఈశాన్య రాష్ట్రాలలో మరో ముఖ్యమంత్రి ఇక్కడ పర్యటించడం ఇదే మొదటిసారి.

ఈశాన్య ప్రాంత ఎన్డీయే కన్వీనర్ గా ఒక రోజు పర్యటనకు వచ్చిన ఆయన ఎమ్యెల్యేలు, పౌరసమాజ ప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలను కూడా కలుస్తున్నారు. హోమ్ మంత్రి అమిత్ షా నాలుగు రోజులపాటు మణిపూర్ లో పర్యటించి, వివిధ వర్గాలతో సమాలోచనలు జరిపి, జరిగిన హింసాకాండపై న్యాయ విచారణతో పాటు సీబీఐ దర్యాప్తు జరుపనున్నట్లు ప్రకటించారు.

అదే విధంగా గవర్నర్ నేతృత్వంలో శాంతి కమిటీ ఏర్పాటును కూడా ప్రకటించారు. ఆ తర్వాత ఇప్పుడు హేమంత్ బిస్వా శర్మ పర్యటించడం ప్రాధాన్యత సంతరింప చేసుకుంది. కాగా, మే 3 నుండి అమలులో ఉన్న ఇంటర్ నెట్ నిషేధంను సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది.