ముస్లింల మద్దతు కోసం బిజెపి ‘మోదీ మిత్రాస్’ ప్రచారం!

ఇప్పటి వరకు బిజెపికి దూరంగా ఉంటున్నారని భావిస్తున్న ముస్లింలను దగ్గరకు తీసుకొని, 2024 ఎన్నికలలో వారి మద్దతు కూడదీసుకొనేందుకు బిజెపి మైనారిటీ మోర్చా దేశ వ్యాప్తంగా “మోదీ మిత్రాస్” అనే ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ముస్లింలను “మోదీ మిత్రులు”గా మార్చుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.

దేశవ్యాప్తంగా ముస్లింలు 30 శాతంకు పైగా ఉన్న 65 లోక్ సభ నియోజకవర్గాలను బిజెపి గుర్తించి, ఆయా నిజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ  ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్దిఖ్ తెలిపారు. ప్రధాన మంత్రి మోదీ చేపట్టిన `సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ విధానంకు అనుగుణంగా ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు.

అవి ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లలో 13 చొప్పున, కేరళ, అస్సాంలలో 6 చొప్పున, జమ్మూ కాశ్మీర్ లో 5, బీహార్ లో 4, మధ్య ప్రదేశ్ లలో 3, తెలంగాణ, హర్యానాలలో 2 చొప్పున, మహారాష్ట్ర, లక్షద్వీప్ లలో 1 చొప్పున నియోజకవర్గాలు ఉన్నాయి.

ఈ ప్రచారంలో భాగంగా ఇంటిని తిరగడంతో పాటు, వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ మోదీ ప్రభుత్వ పధకాల అమలు తీరుతెన్నుల పట్ల వారి అభిప్రాయాలను తెలుసుకుంటామని సిద్దిఖ్ తెలిపారు. దేశ వ్యాప్తంగా ముస్లిం జనాభా 20 శాతంకు పైగా ఉన్న నియోజకవర్గాలు 80 ఉండగా, 2019 ఎన్నికల్లో వీటిలో 58 నియోజకవర్గాలలో బిజెపి అభ్యర్థులు గెలుపొందారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముస్లింలు ‘మోదీ మిత్రులుగా’ మారేందుకు ఆ రాష్ట్ర బిజెపి మైనారిటీ మోర్చా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ముస్లింల ప్రాబల్యంకా గల 29 లోక్‌సభ సీట్లున్నాయి. అందులో 2019లో 14 నియోజకవర్గాల్లో బిజెపి గెలవలేకపోయింది.  గత ఏడాది మొరాదాబాద్, బిజ్నోర్, సహరన్‌పూర్, ముజఫ్ఫర్‌నగర్, అమ్రోహ, బాల్‌రామ్‌పూర్, ఘాజీపూర్, బరేలి, రామ్‌పూర్, ఆజంఘడ్, బాఘ్‌పట్, మీరట్ సహా 15 సీట్లను బిజెపి గెలుచుకుంది.

‘మహా సంపర్క్ అభియాన్’ లో భాగంగా యూపీ బిజెపి మైనారిటీ మోర్చా కున్వర్ బాసిత్ అలీ ప్రచారాన్ని ప్రారంభించారు. బిజెపి తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ  నాయకత్వం గురించి నెల రోజుల పాటు ఈ ప్రచార కార్యక్రమంలో వివరిస్తారు. ఈ ప్రచారంలో ముస్లింల వద్దకు వెళ్లి ‘మోదీ మిత్రులను’ తయారు చేసుకుంటారు.

బిజెపి ప్రభుత్వం పాలసీలు, సందేశాలను మైనారిటీలకు తెలుపుతారు. మైనారిటీల కోసం మోదీ ప్రభుత్వం  ప్రారంభించిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తారు.  పిఎం ఆవాస్ యోజన, స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్ల నిర్మాణం, ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ సిలిండర్‌లు…దాదాపు 4.5 కోట్ల మంది ముస్లింలు ప్రయోజనం పొందారని వివరించనున్నారు.

ఇంతేకాక కరోనా మహమ్మారి కాలంలో 2 కోట్ల మంది ముస్లిం జనాభాకు ఉచిత రేషన్ పథకం ప్రయోజనాలు అందించారని తెలుపుతారు. మదర్సాలలో, సూఫీయిజం పాటించే కమ్యూనిటీలలో జూన్ 21న యోగా దినోత్సవం నిర్వహించాలని మోర్చా ప్రణాళిక రచించుకుంది. సూఫీలు బిజెపికి మద్దతు ఇవ్వాలని అలీ కోరారు.