రైల్వే ప్రమాదంపై ప్రారంభమైన సీబీఐ దర్యాప్తు

ఒడిసా ఘోర రైలు ప్రమాదంపై కటక్‌లో కేసు నమోదయింది. దేశ రైల్వేల చరిత్రలోనే అత్యంత విషాదాల్లో ఒకటైన ఈ ఘటనపై సీబీఐ  దర్యాప్తు ప్రారంభించింది. పది మంది సభ్యులు గల సీబీఐ బృందం దర్యాప్తు స్థలంకు చేరుకొంది. బాలాసోర్ కు చేరుకున్న సీబీఐ బృందం ఘటనా స్థలాన్ని పరిశీలిస్తోంది. అక్కడి అధికారులతో ప్రమాదానికి సంబంధించి అన్ని కోణాల్లో విచారిస్తోంది. అయితే ప్రమాద ఘటనపై సీబీఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఈ ఘోరానికి నిర్దిష్టంగా ఎవరు బాధ్యులనేది ఇంకా నిర్ధారించలేదని ఎఫ్‌ఐఆర్‌లో ఒడిశా పోలీసులు తెలిపారు. దర్యాప్తు తర్వాతే వారు ఎవరనేది తెలుస్తుందని పేర్కొన్నారు. నిర్లక్ష్యం కారణంగా మరణాలు, ప్రాణాలకు హామీ అనే అభియోగాల కింద కేసు నమోదు చేశారు. ఒడిశాలోని బాలాసోర్‌ వద్ద మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో 200 మందికి పైగా ప్రయాణికులు మరణించిన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేపట్టాల్సిందిగా సీబీఐని ఆదివారం కేంద్ర రైల్వే శాఖ కోరింది. రైల్వే రాకపోకలను నియంత్రించే ఇంటర్‌లాకింగ్‌ సిస్టమ్‌లో ఎవరో కావాలని మార్పులు చేసినట్లు ఆ శాఖ భావిస్తోంది.

అలాగే, ప్రమాదం జరిగిన మార్గంలో స్వయంచాలక నియంత్రణ వ్యవస్థ అయిన ‘కవచ్‌’ అందుబాటులో లేదని పేర్కొంది. అయితే, కవచ్‌ ఉన్నా ప్రమాదాన్ని ఆపగలిగేది కాదని స్థానిక రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

కాగా, మృతుల సంఖ్యను ఎక్కువగా ప్రకటించి, ఆ తర్వాత దాన్ని తగ్గించడంపై ఒడిశా ప్రభు త్వం వివరణ ఇచ్చింది. పొరపాటున కొన్ని మృతదేహాలను రెండుసార్లు లెక్కించినట్టు తెలిపింది. 275 మంది మరణించినట్టు ప్రకటించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం, అందులో 200మంది మృతదేహాలను ఇంకా గుర్తించా ల్సి ఉన్నదని పేర్కొంది.

ప్రమాదస్థలిలో అవిశ్రాంతంగా సహాయకచర్యల్లో పాలుపంచుకున్న జాతీయ విపత్తు నిర్వహణ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) బృందాలు సోమవారం తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశాయి. చివరి బోగీ శిథిలాన్ని సైతం తొలగించి వేయడంతో అక్కడ మిగిలిన తొమ్మిది బృందాలనూ ఎన్‌డీఆర్‌ఎఫ్‌ వెనక్కి పిలిపించింది.

50 గంటలు అక్కడే గడిపిన రైల్వే మంత్రి

కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఏకంగా 50 గంటలకుపైగా ఘటనాస్థలిలోనే ఉండిపోయారు. సహాయక చర్యలను పరిశీలిస్తూ,దెబ్బతిన్న బోగీల తొలగింపు పనులను పర్యవేక్షిస్తూ, పట్టాల పునరుద్ధరణను వేగవంతం చేస్తూ, తిరిగి ఆ మార్గం గాడిలో పడేవరకు మొత్తం మూడు నిద్ర లేని రాత్రులు, రెండు అలుపు లేని పగళ్లు ఆయన అక్కడే ఉన్నా రు. సోమవారం పునరుద్ధరించిన పట్టాలపై తొలి గూడ్స్‌ రైలు ప్రయాణించిన తర్వాతే ఆయన అక్కడి నుంచి కదిలారు.

ఒడిశా రైలు ప్రమాద బాధితుల కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని ఆగ్నేయ రైల్వే ప్రకటించింది. 77 మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగించినట్టు తెలిపింది. బాధితుల కుటుంబీకులు వివరాల కోసం బాలాసోర్‌ రైల్వే స్టేషన్‌ను 8249591559, 7978418322 హెల్ప్‌లైన్‌ నంబర్లతో పాటు రైల్వేల ప్రత్యేక నంబర్‌ 64810 ద్వారా సంప్రదించాలని సూచించింది. మృతుల కుటుంబాలకు పరిహారంతో పాటు ఇతరత్రా ఆదుకుంటామని తెలిపింది.

అయితే, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీల్లో చిక్కుకున్న కనీసం 40 మృతదేహాలను వెలికితీయగా వాటిపై ఎటువంటి గాయాల గుర్తులు లేకపోవడంతో విద్యుదాఘాతానికి గురై ఉంటారని భావిస్తున్నారు. తెగిపడిన ఓవర్ హెడ్ కేబుల్స్ ద్వారా షాక్‌కు గురై ఉంటారని రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించిన పోలీసు అధికారి ఒకరు సోమవారం వెల్లడించారు. లైవ్ ఓవర్‌హెడ్ కేబుల్స్ బోగీలపై పడటంతో చాలా మంది మరణాలకు విద్యుదాఘాతమే కారణమని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.