టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళనకు పట్టించుకోని ప్రభుత్వం

ఈ నెల 11న టీఎస్‌పీఎస్సీ నిర్వ‌హించబోయే గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదాకు హైకోర్టు నిరాక‌రించడంతో యధావిధిగా జరిగే అవకాశం ఏర్పడింది. టీఎస్‌పీఎస్సీ ప్ర‌శ్న‌ప‌త్రాలు లీకైన నేప‌థ్యంలో గతేడాది అక్టోబ‌ర్ 16న నిర్వ‌హించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను టీఎస్‌పీఎస్సీ ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే.

నాడు గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన అభ్య‌ర్థుల‌కు మ‌రోసారి ఈ నెల 11న ప‌రీక్ష నిర్వ‌హించేందుకు టీఎస్‌పీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ప‌రీక్ష‌కు సంబంధించి టీఎస్‌పీఎస్సీ హాల్ టికెట్లు కూడా విడుద‌ల చేసింది. ఈ నెల 11న రాష్ట్రంలోని 995 కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు తెలిపింది. జూన్‌ 11న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహిస్తామని ప్ర‌కటించింది. కాగా, 503 గ్రూప్‌-1 పోస్టులకు మొత్తం 3,80,202 దరఖాస్తు లొచ్చాయి.

అయితే,  ఉన్నత స్థాయిలో ఎలాంటి మార్పులు చేయకుండా కింది సిబ్బందిని కొంచం అటు, ఇటు మార్చి ప్రభుత్వం గ్రూప్ 1 ప్రిలిమినరీ నిర్వహణకు తేదీలను ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రశ్నపత్రాల లీకేజీ సంఘటన నేపథ్యంలో టీఎస్పీఎస్సీ పాలక మండలిని ప్రక్షాళన చేయాలని డిమాండ్ ను ప్రభుత్వం పక్కన పెట్టింది.

ఐఏఎస్ అధికారి బీఎం సంతోష్ ను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ గా నియమించి పరీక్షల నిర్వహణకు సిద్ధమైంది. గ్రూప్1 ప్రిలిమ్స్ తో పాటు పలు ప్రశ్నపత్రాలు లీకైన విషయం తెలిసిందే. వాటిని అంగట్లో పెట్టి అగ్గువకు అమ్మారన్న సంచలన నిజాలు సిట్ దర్యాప్తులోనే బయటికి వస్తున్నాయి. ఈ వ్యవహారానికి ఒకరిద్దరిని బాధ్యులుగా చేసి చేతులు దులుపుకుందామని ప్రభుత్వం భావించింది.

కానీ అక్రమాల చిట్టా తవ్వినకొద్దీ బయటపడుతున్నది. ఈ కేసులో దాదాపు 50 మందిని సిట్ అరెస్టు చేసింది. టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణ డొల్లతనమంతా బయటపడింది.  కమిషన్ పాలక మండలిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. టీఎస్పీఎస్సీ ఆఫీసును ముట్టడించినా ప్రభుత్వం స్పందించలేదు. ఓ వైపు సిట్ విచారణ సాగుతుండగానే ఆదరాబాదరగా గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష తేదీని ప్రకటించింది.

పేపర్ లీక్ లో ప్రజా ప్రతినిధులు!

మరోవైపు పేపర్‌ లీక్‌ వ్యవహారంలో కొందరు ప్రజా ప్రతినిధులు తమ పిల్లల కోసం ప్రశ్నపత్రాలు కొన్నట్టు బహిర్గతమైంది. కరీంనగర్‌ జిల్లాకు చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యురాలు శ్రీలత భర్త శ్రీనివాస్‌ ప్రమేయం ఉన్నట్టు సిట్‌ పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.

తన కుమార్తె ఏఈఈ పరీక్ష కోసం హైటెక్‌ మాస్‌కాపీయింగ్‌ సూత్రధారి రమేశ్‌ సహకారం తీసుకున్నట్టు పోలీసులు నిర్ధారించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న తమ కుమార్తె కోసం రమేశ్‌ను కలిశాడు. ఏఈఈ పరీక్షకు సహకరిస్తే రూ.75 లక్షలు చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఉద్యోగం వచ్చాకే డబ్బులిస్తానని ఎంపీటీసీ భర్త షరతు విధించాడు. ఈ మేరకు ఫిబ్రవరి 26న శ్రీనివాస్‌ కూతురుతో హైదరాబాద్‌లో పరీక్షను రాయించాడు. గుట్టుగా సాగిన వ్యవహారం బయటకు రాగానే మాజీ ఎంపీటీసీ దంపతులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సోమవారం సిట్‌ పోలీసులు బొమ్మకల్‌లోని వారి నివాసానికి వెళ్లి తనిఖీలు చేసి కొన్నిపత్రాలు, పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

పేపర్‌ లీక్‌ కేసులో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిన పూల రమేశ్‌ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా బీరంగి కొత్తకోటగా గుర్తించారు. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో నీటిపారుదల శాఖలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో సైదాబాద్‌లో నివాసం ఉంటూ పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి శిక్షణ ఇస్తున్నాడు. ఇతని ద్వారా దాదాపు 80 మందికి పైగా ఏఈ ప్రశ్నపత్రాలు చేతులు మారినట్లు గుర్తించారు.

ఒక్కో అభ్యర్ది నుంచి పరీక్షల్లో సాయం చేయడానికి రూ.30లక్షల రుపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు. మలక్‌పేట్‌ కేంద్రంగా 8 మంది సహాయకులతో కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేసి ఏఈఈ, డీఏవో పరీక్షకు హాజరైన ఏడుగురు అభ్యర్థులకు సమాధానాలు చేరవేశాడు.

మరోవైపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఏఈ రమేశ్‌కు సహకరించిన టోలిచౌకి ప్రాంతానికి చెందిన కాలేజీ ప్రిన్సిపల్‌ అలీ పరారీలో ఉన్నాడు. పరీక్షల్లో అక్రమాలకు సహకరించేందుకు నిందితుడు రమేష్ రూ.20లక్షలు చెల్లించినట్లు గుర్తించారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో అలీ ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

రమేష్‌ వ్యవహారంతో ప్రధాన నిందితులకు సంబంధం లేదని తేలింది. ఒకరి నుంచి ఒకరికి చైన్‌ లింకులా పేపర్‌ లీక్ వ్యవహారం సాగింది. పోలీసుల విచారణలో నిందితుడు తాను ప్రజాప్రతినిధితో కూడా ఒప్పందం చేసుకున్నట్టు అంగీకరించాడు.