రాహుల్ గాంధీ అసత్య, అప్రజాస్వామిక, దేశ-వ్యతిరేక రాజకీయాలు

రాహుల్ గాంధీ అసత్య, అప్రజాస్వామిక, దేశ-వ్యతిరేక రాజకీయాలు

–ప్రదక్షిణ

రాహుల్ గాంధీ ఎన్నిసార్లు విదేశీ పర్యటనలకు వెళ్ళినా, అవి ఎన్నో దేశవ్యతిరేక సంచలనాత్మక ప్రకటనలకు దారి తీస్థాయి. అయితే, భారతీయుల విమర్శలు, సోషల్ మీడియాలో వీరి గుట్టురట్టవడం, ఎన్నిసార్లు జరిగినా, కాంగ్రెస్ పార్టీ ఎంతమాత్రం మారకపోవడం, ప్రజాస్వామిక వ్యవస్థలో అత్యంత ప్రమాదకరం.

 జూన్ 2023 మొదటి వారంలో, అనగా నాలుగు రోజుల క్రితం నుంచి రాహుల్ గారి అమెరికా పర్యటన అత్యంత కీలక పరిణామాల నేపధ్యంలో జరుగుతోంది.

 పరువునష్టం కేసు – హిండెన్బర్గ్/ అదానీ వ్యవహారం

 ఇటీవలి కాలంలో, `మోదీ’ అనే వెనకబడ్డ కులాలకు చెందిన ప్రజలను, దోపిడీదారులు అని దూషించిన కారణంగా, ఒకరు వేసిన పరువునష్టం దావాలో, రెండు ఏళ్ళ జైలు శిక్ష పడగా, రాహుల్ గాంధి లోకసభ సభ్యత్వం కోర్టు ద్వారా రద్దయింది. ఆ కేసు త్వరలో గుజరాత్ ఉన్నత న్యాయస్థానంలో తిరిగి ప్రారంభమవవచ్చు.

 అలాగే, రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఎప్పటికప్పుడు దుర్భాషలాడి దూషించడం సాధారణం అయిపొయింది. అదే విధంగా, ఈ రాహుల్ గారు, అంబాని-అదాని పేరుతో, మోది గారిని కొన్ని సంవత్సరాలుగా, ఎటువంటి రుజువులు లేని ఆరోపణలు చేస్తూ, అలసట లేకుండా తిడుతూనే ఉన్నారు.  విదేశాల నుంచి హిండెన్బర్గ్ అనే షార్ట్-సెల్లింగ్ కంపెనీ, కొన్ని కుమ్మక్కైన విదేశీ, భారత-వ్యతిరేక రాజకేయ శక్తులు, పనికట్టుకుని అదాని కంపెనీల్లోని షేర్లను కావాలని దీవాలా తీయించాయి. దీని వెనుకాల ఉన్న కుట్రలు తేటతేల్లంగా అర్ధం అవుతూనే ఉన్నా, సొంత దేశంలోని ఒక పెద్ద కంపెనీ షేర్లను, విదేశీ కంపెనీ తొక్కేసినందుకు, విపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎంతో ఆనందంతో పండగ చేసుకున్నాయి. ప్రధాని మోదీ గారికి `మొదాని’ అనే కొత్త పేరు కూడా పెట్టాయి.  మొత్తం పార్లమెంటు సమావేశాలు బహిష్కరించి దేశం అంతా హంగామా సృష్టించాయి. అయితే ఇటీవలే సుప్రీమ్ కోర్టు నియమించిన నిపుణల కమిటీ,  హిండెన్బర్గ్  షార్ట్-సెల్లింగ్ కంపెనీ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, అదాని గారి కంపెనీలు సక్రమంగానే పనిచేస్తున్నాయని, `మార్కెట్ రెగులేటర్’ అయిన సెబి (SEBI) విధుల్లో కూడా ఎలాంటి నిర్లక్ష్యం, వైఫల్యాలు జరగలేదని తేల్చింది. అయితే, కాంగ్రెస్ మరియు ఇతర విపక్ష పార్టీలు నిరాధార ఆరోపణలు చేసి, ప్రధానిని దూషించినందుకు ఎటువంటి మొహమాటం లేకుండా, క్షమాపణలు కూడా చెప్పలేదు.

 అలాగే, కేవలం రెండు సంవత్సరాలలో, అతి తక్కువ ధరకు, అద్భతంగా నిర్మించిన, కొత్త పార్లమెంట్ భవనాల భవ్య ప్రారంభోత్సవం కూడా, కాంగ్రెస్ సహా ఎన్నో విపక్షాలు బహిష్కరించాయి.

 పాస్పోర్టు

 రాహుల్ గాంధి అమెరికా పర్యటన ముందు ఇంకొక వింత జరిగింది. సాధారణ పాస్పోర్ట్ కి అర్జీ పెట్టుకున్న రాహుల్ గాంధీకి, `నేషనల్ హెరాల్డ్’ అవినీతి కేసులో బెయిల్ మీదున్న అతనికి, పాస్పోర్ట్ జారీ చేయకూడదని డా. సుభ్రమణ్యం స్వామి కోరినా, ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం, రాహుల్ గాంధికి వెంటనే పాస్పోర్ట్ మంజూరు చేయించింది.

 రాహుల్ అమెరికా పర్యటన

కర్ణాటక రాష్ట్ర ఎన్నికలలో గెలిచిన విజయగర్వంతో, తన లోకసభ సభ్యత్వం పోయినా బాధ పడకుండా, మరింత ఉత్సాహంగా, రాహుల్ గాంధి గారు, అందరికీ బాగా సుపరిచితమైన భారత-వ్యతిరేక సంస్థల సౌజన్యంతో ఏర్పాటు చేసిన సభలలో ప్రసంగించడానికి అమెరికా వెళ్ళిపోయారు. అక్కడ ప్రముఖ ఇస్లామీ సంస్థలు IAMC (ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్), ICNA (ఇస్లామిక్ సర్కిల్ ఆఫ్ నార్త్ అమెరికా), కాలిఫోర్నియా, సాంటా క్రూజ్ లో  నిర్వహించిన ప్రసంగ కార్యక్రమాల్లో పాల్గొని, ఎంతగా భారత దేశాన్ని దూషించగలరో, అంతగా దూషించి పరువు తీసారు. భారత దేశంలో అల్పసంఖ్యాక వర్గాలన్నీ, ముఖ్యంగా ముస్లిములు ఎంతో అణచివేతకు గురవుతున్నారని, రాజ్యాంగ సంస్థలన్నిటినీ  మోదీ గారు తన గుప్పెట్లో పెట్టుకున్నారని, ఎపుడూ చేసే నిరాధార ఆరోపణలు మళ్ళి చేసారు. అయితే, దళితులు, గిరిజనులను కూడా ఈ `అల్పసంఖ్యాక వర్గ’ జాబితాలో చేర్చి, షెడ్యుల్డ్ కులాలు, తెగలు కూడా హిందువులు కారేమో అనే భ్రమను, బాగా కల్పించారు. ( మోదీ గారు రాజ్యాంగ సంస్థలను నియంత్రిస్తుంటే, కర్ణాటక ఎన్నికలలో, కాంగ్రెస్ పార్టీ ఎలా గెలవగలిగిందో వాళ్ళు చెప్పరు).

ICNA మొదలైన ఇస్లామీ నిర్వాహక సంస్థలకు, జమాతీ ఇస్లామీ పాకిస్తాన్ తోను, నిషేధిత ఉగ్రవాద లష్కర్-ఎ-తయేబా తోను, అతి దగ్గర సంబంధాలు ఉన్నాయని డిసిన్ఫో (DisInfo lab) వంటి సంస్థలు ఎప్పుడో బయటపెట్టాయి. అట్లాగే, కౌన్సిల్ ఆన్ అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్(CAIR) అనే ఇస్లామిక్ సంస్థ కూడా భారత వ్యతిరేక కార్యకలాపాలలో ఎపుడూ ముందే ఉంటుంది. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో ఉన్నా, దాని భారత-వ్యతిరేక కార్యాలకు ఎటువంటి విఘాతం కలగలేదు, ఎందుకంటే చైనా ఎప్పడూ పాకిస్తాన్ కి పెద్దదిక్కుగా, ఆర్థికంగా సహకారం అందిస్తూనే ఉంటుంది.

స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మక `ఐవీ లీగ్’ విద్యా సంస్థ యొక్క ఒక విద్యార్థి సంఘం, రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి ప్రసంగం వినడానికి, అతన్ని ఆహ్వానించారంటే నమ్మశక్యం కాదు. అలాగే, హడ్సన్ విశ్వవిద్యాలయం `థింక్-టాంక్’, `హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్’ (హిందువుల మానవ హక్కులు)అనే కపట సంస్థని నిర్వహిస్తున్న సునితా విశ్వనాధ్, సామ్ పిట్రోడా (విదేశాలలో కాంగ్రెస్ పార్టీ సంచాలకుడు), మరికొంత మందితో ఉన్న ఫోటోలు బయటపెట్టింది. వీరందరూ ఏమి చర్చిస్తున్నారో, తెలియరాలేదు. వీరి వెనకాల జార్జ్ సోరోస్ సంస్థ వ్యక్తులు కూడా ప్రముఖంగా ఉన్నారు.

వీరందరూ కలిసి 2020లో కూడా `భారత పౌరచట్ట సవరణ 2019 (CAA)’ మీద అమెరికాలో లేనిపోని అబద్ధాలు చెప్తూ, కోట్లాది ముస్లిములు భారతదేశంలో తమ పౌరసత్వం కోల్పోతున్నారని అసత్య ప్రచారాలు చేసారు. ఎన్నో అమెరికా నగరపాలక సంస్థలలో, CAAకి వ్యతిరేకంగా, తీర్మానాలు జారీ చేయించారు. వీరి దేశవ్యతిరేక కార్యకలాపాలు గురించి ప్రజలకు తెలిసినా, అమెరికా నగరపాలక సంస్థలు ఇతర దేశాల వ్యవహారాలలోతలదూర్చడం, చెప్పుడుమాటలు వినే వారి తెలివితేటలు కూడా స్పష్టంగా కనిపించాయి.

పైన పేర్కొన్న ఇస్లామియా సంస్థ- IAMC (ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్), IAMC ఏర్పరిచిన హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్’ (హిందువుల మానవ హక్కులు) మరియు `ఆర్గనైజేషన్ ఫర్ మైనారిటీస్ ఆఫ్ ఇండియా (OFMI) కలిసి `అలైయన్స్ ఫర్ జస్టిస్ అండ్ అకౌంటబిలిటి’ (AJA) అనే వేదిక ఏర్పాటు చేసుకున్నాయి. (ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా అమెరికా హ్యుస్టన్ నగరంలో సెప్టెంబర్ 2019లో, ఈ AJA నిరసన ప్రదర్శన చేసింది).  ఈ సంస్థల మధ్య ఉన్న అవినాభావ సంబంధాల గుట్టురట్టు ఎప్పుడో జరిగింది.

జూన్ 2023 రెండవ వారంలో, న్యూయార్క్ మహానగరంలో కూడా రాహుల్ గాంధీ కార్యక్రమాలను నిర్వహిస్తున్న ముస్లిం సంస్థలు, మసీదుల వివరాలు వారే తెలియచేసారు. అందులో ముఖ్యమైనవి- మస్జిద్ అల్-వలి, నార్త్ ఎడిసన్, మస్జిద్ MCMC, సౌత్ ఎడిసన్, ISCJ, సౌత్ బ్రన్స్విక్, కెండాల్ పార్క్, ప్రిన్స్టన్ మొదలైన ప్రదేశాల్లో ఇస్లామియా మసీదులు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నట్లు ప్రకటన వెలువడింది. ప్రఖ్యాత న్యూయార్క్ `మాడిసన్ స్క్వయర్ గార్డెన్’ సభలో కూడా రాహుల్ గాంధీ ప్రసంగం ఉంటుందని ప్రకటన తెలిపింది.

ఇటువంటి ఎన్నో ఇస్లామియా, లేక క్రిస్టియన్ లేక జార్జ్ సోరోస్ వంటి భారత-వ్యతిరేక, హిందూ-వ్యతిరేక సంస్థలు, వ్యక్తులతో, కాంగ్రెస్ పార్టీ సంబంధాలు ఏమిటో ఎవరికీ తెలియదు. (అలాగే చైనా కమ్యూనిస్ట్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ

(రాహుల్, సోనియా గాంధీలు) 2008లో చేసుకున్న ఒప్పందం ఇంతవరకు బయటకు రాలేదు). జార్జ్ సోరోస్ ఇదివరకే ప్రధాని మోదిని ఓడించడానికి బిలియన్ల డాలర్లు ఖర్చు పెడుతున్నానని ప్రకటించాడు, అయినా, సోరోస్ కి చెందిన `ఓపెన్ సొసైటీ’ సంస్థ  భారత్ లో యదేచ్చగా పనిచేయడమే కాక, ఆ సంస్థ ముఖ్యుడు సలీల్ శెట్టి, రాహుల్ గాంధీతో కలిసి అతని యాత్రలో పాల్గొన్నాడు.

అంత పెద్ద అమెరికా దేశంలో, రాహుల్ గాంధికి ఒక్క హిందూ సంస్థ కూడా కనిపించకపోవడం గమనార్హం.

భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి?

పైన పేర్కొన్న ఎన్నెన్నో సంస్థలు, వ్యక్తులు, బయటపడని మరెన్నో శక్తులు కలిసి భారతదేశ-వ్యతిరేక, హిందువులకు వ్యతిరేకంగా, ఎటువంటి కుట్రలు పన్నుతున్నారో, సోషల్ మీడియా ఇంకా కొందరు జాతీయవాద మేధావుల పుణ్యమా అని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలుస్తున్నాయి. అయితే, ఈ దేశవ్యతిరేక శక్తుల కుట్రల గురించి సామాన్య భారత ప్రజలకు ఇంకా పూర్తిగా అవగాహన లేదు. కానీ ఎంతో పెద్ద రక్షణ, నిఘా, గూఢచార, సమాచార వ్యవస్థ ఉన్న భారత ప్రభుత్వానికి కూడా ఈ సమాచారం తెలియదా? విదేశాలలో కాంగ్రెస్ పార్టీ (ఓవర్సీస్ కాంగ్రెస్) కార్యకలాపాలపై, భారత ప్రభుత్వం ఎందుకు విచారణ చేయట్లేదు? భారత ప్రాజస్వామ్యానికి, సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఎప్పటినుంచో చేస్తున్న రాజకీయాలను నేరంగా పరిగణించి, శిక్షించే రాజకీయ, న్యాయవ్యవస్థలు భారత దేశంలో ఉన్నాయా? ఉంటే, ఎందుకు రాహుల్ గాంధీకి ఆయా వ్యవస్థలు శిక్షలు విధించట్లేదు? ఇంకా ఎన్నెన్ని కుట్రలు, దేశం వెలుపల, అంతర్గతంగా, 2024 లోకసభ ఎన్నికల లోపు ప్రజలు చూడాల్సి వస్తుందో?