జూన్ 11న సచిన్ పైలట్ సొంత పార్టీ ప్రకటన?

జూన్ 11న సచిన్ పైలట్ సొంత పార్టీ ప్రకటన?

మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరుగనున్న రాజస్థాన్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి  గట్టి ఎదురుదెబ్బ తగలనున్నది. కాంగ్రెస్ అధిష్టానం గత వారం రాజస్థాన్ కాంగ్రెస్‌లో కుదర్చిన రాజీ ఫార్ములా నీరుగారిపోనున్నది. కాంగ్రెస్ నుండి వైదొలిగి సొంత పార్టీ ఏర్పాటు చేసుకోవాలని కాంగ్రెస్ అసమ్మతి నాయకుడు సచిన్ పైలట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

తన తండ్రి, మాజీ కేంద్ర మంత్రి రాజేష్ పైలట్ వర్ధంతి నాడు జూన్ 11న ప్రగతిశీల్ కాంగ్రెస్ పేరిట సచిన్ పైలట్ కొత్త పార్టీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు చెందిన పిఎసి సాయంతో కొత్త పార్టీ ఏర్పాటుకు సచిన్ పైలట్ సన్నాహాలు చేస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

కొత్త పార్టీ ఏర్పాటుపై కొద్దికాలంగా ఆయన తన సన్నిహితులతో మంతనాలు సాగిస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఆయన మాత్రం దీనిపై ఇంతవరకు పెదవి విప్పలేదు. రాజస్థాన్‌లో మరి కొద్ది నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో హనుమాన్ బెనివాల్‌కు చెందిన రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ, ఆప్‌తో కలసి తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని సచిన్ పైలట్ యోచిస్తున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.

పైలట్ సొంత పార్టీ పెట్టుకున్న పక్షంలో ఆయన వెంట ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళతారో వేచి చూడాల్సి ఉంది. అదే విధంగా దీని ప్రభావం రాష్ట్రంలో కాంగ్రెస్‌పై ఏమేరకు పడుతుందో కూడా చూడాల్సి ఉంటుంది. 45 సంవత్సరాల సచిన్ పైలట్‌కు అనేక సంవత్సరాలుగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో తీవ్ర స్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయి.

2018 అసెంబ్లీ ఎన్నికలలో పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన సచిన్ తనకు ముఖ్యమంత్రి పీఠం దక్కుతుదని ఆశపడి భంగపడ్డారు. ఉపముఖ్యమంత్రి పదవి, పిసిసి అధ్యక్ష పదవిలో కొనసాగినా ముఖ్యమంత్రి పదవి కోసమై కొందరు ఎమ్యెల్యేలతో తిరుగుబాటు జరిపారు.

అయితే అవసరమైన సంఖ్యలో ఎమ్యెల్యేలను సమీకరించుకోలేక పోవడంతో రాజీపడవలసి వచ్చింది. అందుకు ఉపముఖ్యమంత్రి పదవితో పాటు పిసిసి అధ్యక్ష పదవిని కూడా కోల్పోయారు.  వచ్చే ఎన్నికలలో తిరిగి కాంగ్రెస్ గెలుపొందిన ముఖ్యమంత్రి పదవిపై భరోసా లేకపోవడంతో పార్టీ నుండి వైదొలిగేందుకు మొగ్గు చూపుతున్నారు.

రాహుల్ గాంధీ అమెరికా వెళ్లేముందు ఆయన సమక్షంలో పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే గెహ్లాట్, సచిన్ పైలట్ లతో గత నెల 31న సుదీర్ఘంగా చర్చించి, రాజీ కుదిర్చిన్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను కలిసికట్టుగా ఎదుర్కోవాలని గెహ్లాట్, పైలట్ నిర్ణయించినట్టు కాంగ్రెస్ అధికార ప్రతినిధులు మీడియా ముందు ఆర్భాటంగా ప్రకటించారు.

అయితే, ఆ తర్వాత రాజస్థాన్  చేరుకున్న పైలట్ గెహ్లాట్‌ సర్కార్‌కు మాజీ బిజెపి సీఎం వసుంధరాజే అవినీతి చర్యలపై చర్యలు తీసుకొనేందుకు తాను విధించిన గడువు ఈరోజుతో తీరనుందని, అవినీతి వ్యతిరేక పోరాటం ముందుకు తీసుకువెళ్తానని ప్రకటించడంతో కాంగ్రెస్‌లో తలెత్తిన విభేదాలు తగ్గుముఖం పట్టలేదనే సంకేతాలు మరోసారి ప్రస్ఫుటమయ్యాయి. గెహ్లాట్ సహితం అసలు సచిన్ కాంగ్రెస్ లో ఉంటె గదా కలిసి పనిచేయడం అంటూ నర్మగర్భంగా మాట్లాడారు. 

అయితే, గెహ్లాట్ స్థానంలో పైలట్‌ను కూర్చోపెట్టేందుకు కాంగ్రెస్ నాయకత్వం సిద్ధంగా లేకపోవడంతో ఇక వేరు కుంపటే శరణ్యమని సచిన్ భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.