కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మోదీ ఆధ్వర్యంలోని ఎన్‌డీయే ప్రభుత్వం ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ బిల్లును ప్రవేశపెట్టి, ఆ తర్వాత జెపిసికి పంపి, సుమారు మూడు నెలల విరామ సమయం ఇచ్చి, శీతాకాల సమావేశాల్లో ఆమోదం కోసం చేపట్టే అవకాశం ఉంది.
కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ఎలాంటి చర్చ లేదా సంప్రదింపులు లేకుండా బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేస్తుండగా, ఎనిమిది మంది ఎంపీలు ఉన్న శరద్ పవార్ ఎన్‌సిపి మాత్రం జెపిసి మార్గానికి మద్దతు ఇస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనకు ఉభయ సభలలో ప్రత్యేక మెజారిటీతో పాటు సగానికి పైగా రాష్ట్రాల ఆమోదం అవసరం కాగా, ఎఫ్‌సిఆర్‌ఎకు కేవలం సాధారణ మెజారిటీ మాత్రమే అవసరం కాబట్టి సంఖ్యాబలం ఒక అడ్డంకిగా కనిపించడం లేదు.
ఈ రెండింటికీ సంబంధం లేదని, ఒకదానికొకటి ఇచ్చిపుచ్చుకునే ధోరణి లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు, షాడో బ్యాంకింగ్ ప్రమాదాలు, ఎఫ్‌ఎటిఎఫ్ నిబంధనలకు అనుగుణంగా 1960ల నాటి చట్టాన్ని ఈ సవరణలు ఆధునీకరిస్తాయని హోం మంత్రిత్వ శాఖ వాదిస్తోంది. ఈ బిల్లు ఏ వర్గాన్నీ లక్ష్యంగా చేసుకోలేదని తెలియజేయడానికి హోం మంత్రి క్రైస్తవ ప్రతినిధి బృందాలతో సమావేశమయ్యారు. చర్చిలకు, మిషనరీలకు అందే విరాళాలు మొత్తం విరాళాలలో కేవలం 15-17% మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.
ఫారెన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) అమెండ్‌మెంట్ బిల్, 2026 (ఎఫ్‌సీఆర్‌ఏ) పేరుతో ఈ సవరణ బిల్లును కేంద్రం గత మార్చి 25న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును పరిశీలించి ఆమోదించేందుకు లోక్‌సభ అజెండాలో ఇప్పటివరకు చేర్చలేదు. కానీ దీనిని ఆగస్టు 12న చేపట్టవచ్చని ప్రభుత్వం ఇంతకుముందే సూచించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన అనంతరం మిజోరాం ముఖ్యమంత్రి లాల్‌దుహోమా మాట్లాడుతూ, ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై పార్లమెంటులో ఆగస్టు 12న చర్చ జరిగి ఆమోదం లభిస్తుందని, అయితే ఇది గత తేదీ నుండి (రెట్రోస్పెక్టివ్‌గా) అమలులోకి రాదని తెలిపారు.
ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్ కోల్పోయే స్వచ్ఛంద సంస్థల (ఎన్జీఓలు) ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఒక శక్తివంతమైన ప్రత్యేక అధికారాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, విదేశీ నిధులు పొందే సంస్థలపై పర్యవేక్షణను కఠినతరం చేయాలని ప్రతిపాదించిన ఈ చట్టంపై ఆందోళనలను తెలియజేసేందుకు, మిజోరాంకు చెందిన చర్చి నాయకుల బృందంతో కలిసి లాల్‌దుహోమా షాను కలిశారు.
“కొత్త ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుకు సంబంధించి మాకున్న ఆందోళనలను హోం మంత్రికి తెలియజేశాము. ఈ బిల్లు గత తేదీ నుండి అమలులోకి రాదని ఆయన మాకు హామీ ఇచ్చారు,” అని పార్లమెంట్ భవన సముదాయంలో విలేకరులతో లాల్‌దుహోమా చెప్పారు. ఈ బిల్లును ప్రతిపక్షాలతోపాటు పలు క్రైస్తవ సంస్థలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
భారత్ లోని కంపెనీలకు, స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచి అందుతున్న నిధులపై నియంత్రణకు, పారదర్శకత కోసం కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తోంది. ఈ బిల్లు ప్రకారం విదేశాల నుంచి అందుతున్న నిధుల కోసం ఒక ప్రత్యేక పర్యవేక్షణా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. విదేశీ సంస్థలకు చెందిన నిధులు, ఆస్తులు, విరాళాల్ని ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది. మతపరమైన సంస్తకు చెందిన ఆస్తుల విషయంలో కూడా ఆయా నిర్వహణా సంస్థలు వాటి ఔన్నత్యాన్ని, విశ్వాసాన్ని కాపాడాలి.
ఈ విషయంలో ఏదైనా సంస్థ నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఈ బిల్లును తమిళనాడుతోపాటు మిజోరం వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. ఎఫ్‌సీఆర్‌ఏ పోర్టల్ ప్రకారం 2019 నుంచి 2022 మధ్య 13,520 సంస్థలకు విదేశాల నుంచి రూ.55,741 కోట్లు విరాళాలుగా వచ్చాయి.
విరాళాలు అందుకుంటున్న సంస్తలకు సంబంధించి 2026, జూలై 15 నాటికి 14,449 సంస్థలకు సర్టిఫికెట్లు ఉన్నాయి. 22,498 సర్టిఫికెట్లు రద్దయ్యాయి. 15,212 సంస్థలకు చెందిన సర్టిఫికెట్ల గడువు ముగిసింది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లును జేపీసీకి కేంద్రం పంపనుంది. అక్కడ ఈ కమిటీ బిల్లులోని అంశాల్ని పరిశీలిస్తుంది. తగిన సూచనలు చేస్తుంది. అనంతరం మార్పులు, చేర్పులకు అవకాశం ఉంది. తర్వాత ఈ బిల్లు మళ్లీ పార్లమెంట్ ముంగిటకు వస్తుంది..

More Stories
రూ. 4 లక్షల కోట్ల అప్పులతో తెలంగాణాలో ఆర్థిక అత్యవసర పరిస్థితి
పాలిమర్ కరెన్సీ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
అసెంబ్లీకి ఏబీవీపీ భారీ నిరసన ర్యాలీ.. రాంచీలో ఉద్రిక్తత