సమర్ధ ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థ అభివృద్ధి చెందాలి

“మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగి పోలేదు. ప్రస్తుత పరిస్థితిలో  ఆరోగ్యం ఆధారిత పర్యవేక్షణ  వ్యవస్థలను ఏకీకృతం చేసి  బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది” అని కేంద్ర ఆరోగ్య  కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ సూచించారు.

భారతదేశం అధ్యక్షత  జి20 3వ హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు హైదరాబాద్ లో జరుగుతున్న సమావేశాలను ఆమె ప్రారంభించారు.   కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్‌ ఎస్‌పి సింగ్ బాఘెల్, నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వి కె పాల్ కూడా పాల్గొన్నారు.

ఆరోగ్య సంరక్షణ రంగంలో ప్రపంచ దేశాల మధ్య సహకారం, సమన్వయం తప్పనిసరి అని డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ స్పష్టం చేశారు.  “క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవడానికి పటిష్ట సమర్ధ  బహుపాక్షిక భాగస్వామ్యం అవసరాన్ని కరోనా గుర్తు చేసింది. అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రమే కాకుండా సాధారణ సమయాల్లో కూడా దేశాల మధ్య సహకారం, సమన్వయం తప్పనిసరి” అని ఆమె సూచించారు.

ప్రాథమిక ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రతిస్పందన వ్యవస్థను అభివృద్ధి చేసినప్పుడు అన్ని వ్యవస్థలు సక్రమంగా పని చేస్తాయని  ఆమె చెప్పారు. “జీ-20 సమావేశాల ద్వారా దేశాల మధ్య బలపడే బంధం పరస్పర సహకారం, సమాచార మార్పిడి, నూత్న వ్యవస్థల అభివృద్ధికి దారి తీస్తుంది. అన్ని దేశాల కలిసి పని చేసినప్పుడు సానుకూల ప్రభావం ఏర్పడి ఫలితాలు సాధించడానికి వీలవుతుంది” అని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఎదుర్కోవడానికి సురక్షితమైన, సమర్థవంతమైన, నాణ్యమైన వైద్య ప్రతిస్పందన వ్యవస్థ పనిచేయాల్సి ఉంటుందని డాక్టర్ పవార్ తెలిపారు. భారతదేశం అధ్యక్షతన జీ-20 ప్రపంచ వ్యాప్తంగా అమలు జరిగే విధంగా  గ్లోబల్ మెడికల్ కౌంటర్‌మెజర్ వ్యవస్థ అభివృద్ధి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె చెప్పారు.

నెట్‌వర్క్ ఆఫ్ నెట్‌వర్క్‌ల విధానాన్ని అనుసరించి, ప్రపంచ, ప్రాంతీయ స్థాయిలో అమలులో ఉన్న వ్యవస్థల ఆధారంగా  గ్లోబల్ మెడికల్ కౌంటర్‌మెజర్ వ్యవస్థ అభివృద్ధి కోసం  ఏకాభిప్రాయాన్నిసాధించడానికి జీ-20 కృషి చేస్తుందని డాక్టరో పవార్  వివరించారు. దీనిలో భాగంగా  ఇంటర్‌గవర్నమెంటల్ నెగోషియేటింగ్ బాడీ (ఐ ఎన్ బి) ప్రక్రియ ద్వారా పనిచేసే ఒక తాత్కాలిక వ్యవస్థ రూపకల్పనకు కృషి చేయాలని  జీ-20 దేశాలకు  డాక్టర్ పవార్ సూచించారు.

ప్రపంచ స్థాయి ఆరోగ్య వ్యవస్థ నిర్మాణానికి జీ-20, జీ-7 ప్రాధాన్యత ఇస్తున్నాయని చెబుతూ  జీ-7 అధ్యక్ష హోదాలో జపాన్ పనిచేసిన సమయంలో ఎంసిఎం ప్రారంభమైన అంశాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. జీ-20 ప్రతిపాదనకు అనుగుణంగా జీ-7 ప్రారంభించిన  ఎంసిఎం వ్యవస్థ ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ దిశలో సాగుతున్న ప్రయత్నాలకు సహకారం అందించాలని ప్రపంచ దేశాలను కోరిన డాక్టర్ పవార్ ” పరిష్కార మార్గాలు సిద్ధం అయ్యేంతవరకు మహమ్మారి  వేచి ఉండకపోవచ్చు. తగిన వ్యూహంతో సిద్ధం కావాల్సిన  సమయం ఇప్పుడు వచ్చింది” అని తెలిపారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచ ఆరోగ్య రంగంలో  ప్రవేశ పెట్టడానికి వీలు కల్పించే విధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహిస్తున్న వ్యవస్థ కోసం భారతదేశం ప్రతిపాదనలను  అందించిందని డాక్టర్ పవార్ తెలిపారు. భారతదేశం ప్రతిపాదించిన అంశాలను వివరిస్తూ   “డిజిటల్ రంగంలో  దేశాల మధ్య ఉన్న అంతరాన్నిభారతదేశం చేసిన ప్రతిపాదనలు తగ్గిస్తాయి. దీనివల్ల  సాంకేతికత ఫలాలు ప్రపంచంలోని ప్రతి పౌరుడికి అందుబాటులోకి వస్తాయి” అని ఆమె వివరించారు.