ఒడిశా రైలు ప్రమాదంలో కుట్ర కోణం?

ఒడిశా రైలు ప్రమాదంలో కుట్ర కోణం ఉండొచ్చని రైల్వే వర్గాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ రైల్వే అధికారి మాట్లాడుతూ కుట్ర కోణంతో పాటు ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థలో ట్యాంపరింగ్‌ కూడా జరిగి ఉండొచ్చని చెప్పారు.  అయితే ఈ ట్యాంపరింగ్‌ లోపల వ్యక్తులు చేశారా? లేక బయట నుంచి చేశారా? అనేది తేలాల్సి ఉన్నదని, ఈ రెండు కోణాల్లో దేనినీ తోసి పుచ్చలేమని తెలిపారు.

సంఘటన స్థలాన్ని సందర్శించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహితం ఉగ్ర కోణం గురించి అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయమై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కేంద్ర ప్రభుత్వంకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సిబిఐతో దర్యాప్తు చేయించాలని రైల్వే బోర్డు సిఫార్సు చేయడం గమనార్హం.మరోవంక, యుద్ధ ప్రాతిపదికన నిర్వహించిన పనులతో 51 గంటల్లో ట్రాక్ పునరుద్దరణ పూర్తయింది. తొలుత గూడ్స్‌ రైలు నడిచింది.

మరోవైపు ఘటనాస్థలిలో దర్యాప్తు పూర్తి చేసిన రైల్వే సేఫ్టీ కమిషనర్‌ (సీఆర్‌ఎస్‌) తన విచారణలో భాగంగా సోమ, మంగళవారాల్లో సాక్షులను కలువనున్నారని సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే ఓ ప్రకటనలో పేర్కొన్నది. ప్రమాదంపై ఆగ్నేయ రైల్వేకు చెందిన సేఫ్టీ కమిషనర్‌ ఖరగ్‌పూర్‌లోని సౌత్‌ ఇనిస్టిట్యూట్‌లో బహిరంగ విచారణ చేపట్టనున్నారు.

ఖరగ్‌పూర్‌లో నిర్వహించనున్న బహిరంగ విచారణకు ప్రయాణికులు, మృతులు/గాయపడినవారి కుటుంబ సభ్యులు, క్షతగాత్రులు, స్థానిక ప్రజలు హాజరు కావాలని రైల్వే శాఖ కోరింది. మరోవైపు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, పలువురు రైల్వే అధికారులు ఒడిశా రైలు ప్రమాదానికి మూల కారణం తెలిసిందని వెల్లడించారు.

ఇది ప్రమాదం కాదని, సిగ్నలింగ్‌ వ్యవస్థలో మార్పుల వల్లే ఈ ఘోరం జరిగిందని పేర్కొంటూ దీనిలో కుట్ర కోణం ఉండొచ్చని పరోక్షంగా రైల్వే మంత్రి స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌ లాకింగ్‌ వ్యవస్థను మార్చడమే ప్రమాదానికి కారణమని చెప్పారు. పాయింట్‌ మెషిన్‌ సెట్టింగ్‌లు ఎవరో మార్చివేశారని ఆరోపించారు. అయితే వారిని ఇప్పటికే గుర్తించామని త్వరలోనే వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు.

 ఒడిశా రైలు దుర్ఘటనపై రైల్వే సేఫ్టీ కమిషనర్‌ దర్యాప్తు పూర్తి చేశారని, తుది నివేదిక సమర్పించాల్సి ఉన్నదని మంత్రి వైష్ణవ్‌ పేర్కొన్నారు. కాగా, రైలు ప్రమాదంలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు లోకోపైలట్‌ తప్పిదం లేదని రైల్వే బోర్డు ఉన్నతాధికారులు క్లీన్‌చిట్‌ ఇచ్చారు. గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిన తర్వాత రైలును డ్రైవర్‌ ముందుకు పోనిచ్చాడని తెలిపారు.

అతి వేగంగా కూడా వెళ్లలేదని, ఆ ప్రాంతంలో గరిష్ఠ వేగం గంటలకు 130 కిలోమీటర్లు ఉండగా, అతను రైలును 128 కిలోమీటర్ల వేగంతో పోనిచ్చాడని వివరించారు.  కాగా, ఈ ప్రమాదంలో లోకోపైలట్ జి మొహంతి రెండు కాళ్లు తెగిపడ్డాయి. భువనేశ్వర్‌లో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మొహంతి ఆదివారం సాయంత్రం మృతిచెందాడు.

కాగా అసిస్టెంట్ లోకోపైలట్ ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. లోకో పైలట్‌ మృతితో డేటా లాగర్ సిమ్యులేషన్ సాక్ష్యంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రమాదానికి గురైన మరో రెండు రైళ్లలోని లోకో పైలట్లు సురక్షితంగా ఉన్నారు.