ఒడిశా ఘటనలో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్య

ఒడిశా రైలు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్యను అందిస్తామని బిలియనీర్, వ్యాపార వేత్త గౌతమ్ అదానీ ప్రకటించారు. శుక్రవారం ఒడిశాలో జరిగిన ఈ అత్యంత ఘోర రైలు ప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందని గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు.
 
లోకం తెలియని పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారడం చూడలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వారికి మంచి విద్యను అందించి భవిష్యత్ కల్పించాలనే ఉద్దేశంతోనే వారికి ఉచిత విద్యను అందించాలనుకుంటున్నట్లు వివరించారు. బాధితులను, వారి కుటుంబాలను ఆదుకోవడం, వారి పిల్లలకు మంచి భవిష్యత్తును అందించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.
 
‘‘ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంతో అందరం తీవ్ర కలత చెందాం. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పాఠశాల విద్యను అందించాలని అదానీ గ్రూప్ నిర్ణయించుకుంది. బాధితులను ఆదుకోవడం మనందరి ఉమ్మడి బాధ్యత. వారి కుటుంబాలు, పిల్లలకు మంచి భవిష్యత్‌ను అందించండి’’ అంటూ గౌతమ్ అదానీ హిందీలో ట్వీట్ చేశారు.
51 గంటల తర్వాత ప్రారంభమైన రైళ్ల రాకపోకలు
మరోవైపు ట్రాక్‌ పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన చేస్తుండడంతో ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే తిరిగి పట్టాలపై రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. బాహనాగ్‌ వద్ద పునరుద్ధరించిన పట్టాలపై ఆదివారం రాత్రి 10.40 గంటలకు తొలి గూడ్సు రైలు రాకపోకలను రైల్వే మంత్రి  అశ్వని వైష్ణవ్ ప్రారంభించారు. అది విశాఖ ఓడరేవు నుంచి రూర్కెలా ఉక్కు కర్మాగారానికి బొగ్గు తీసుకెళ్తుంది.
 
మరికొన్ని రైళ్లను ప్రయోగాత్మకంగా పంపించి రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో రైళ్ల రాకపోకలను ప్రారంభిస్తామని అశ్వినీ వైష్ణవ్‌  వెల్లడించారు. వేగంగా రైల్వే లైనును పునరుద్ధరించిన సిబ్బందిని, అధికారులను ఆయన అభినందించారు.