యువశక్తితో భవ్యమైన భారత్ నిర్మాణం

కేంద్ర ప్రభుత్వం దేశ యువశక్తితో భవ్యమైన భారత్ నిర్మించేందుకు కృషి చేస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్ జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థలో జరిగిన మెగా జాబ్ మేళా ముగింపు వేడుకలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జాబ్ మేళా లో ఉద్యోగాలకు ఎంపికైన 1300 మంది అభ్యర్థులకు రిటైల్, హాస్పిటాలిటీ, బ్యాంకింగ్ & ఫైనాన్స్, ఆటోమోటివ్, ఫార్మా మొదలైన రంగాల నుంచి 220 కంపెనీల ఆఫర్ లెటర్‌లను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ యువశక్తి సామర్థ్యాన్ని సంపూర్ణంగా సద్వినియోగ పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తోందని చెప్పారు.

అన్ని రంగాల్లో యువతను భాగస్వామ్యం చేస్తూ వినూత్నమైన, సృజనాత్మకమైన మార్పులను తీసుకువస్తోందని చెబుతూ దేశంలో, రాష్ట్రంలో యువతలో శక్తి సామర్థ్యాలు అపారంగా ఉన్నాయని తెలిపారు.  కౌశల్ మహోత్సవ్ లో భాగంగా భారత ప్రభుత్వ సహకారంతో దక్షిణ భారత్ లోనే మొదటి జాబ్ మేళా నిర్వహించామని వెల్లడించారు.

యువత శక్తి సామర్థ్యాలకు నైపుణ్యమనే ఆయుధాన్ని అందించడం ద్వారా అద్భుతాలు సాధించే దిశగా మోదీ సర్కారు పనిచేస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నిపుణ స్వచ్ఛంద సంస్థలతో కలిసి నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఈ జాబ్‌మేళాలను నిర్వహిస్తోందని కేంద్ర మంత్రి చెప్పారు.

అవసరమైన శిక్షణ ఇచ్చి వివిధ రంగాలలో ఉపాధి పొందేలా కౌశల్ మహోత్సవ్ ద్వారా ప్రభుత్వం కృషి చేస్తున్నదని  కిషన్ రెడ్డి వివరించారు.  ఇప్పటి వరకు నైపుణ్యాభివృద్ధి ద్వారా కోటి 25 లక్షల మందికి నైపుణ్య శిక్షణ అందించినట్లు తెలిపారు. ఆదివారం నాటి జాబ్‌మేళాలో 15వేల మంది రిజిస్ట్రేషన్‌ చేయించుకోగా 5వేల మంది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారని, వారిలో  1300 మందికి ఉద్యోగ పత్రాలను అందజేస్తున్నట్లు వివరించారు.