హైదరాబాద్‌లో ఒక్కసారిగా పలుచోట్ల వర్షం

ఎండ, ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టగా ఆదివారం  సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలుచోట్ల ఈదురుగాలులతో వర్షం కురిసింది.  బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, లింగంపల్లి, నిజాంపేట, జీడిమెట్ల, గాజులరామారం, కూకట్‌పల్లి, బాలానగర్‌, కొంపల్లి, అల్వాల్, బొల్లారం, నేరెడ్‌మెట్‌తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

ఒక్కసారిగా వర్షం కురవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మెట్రో పిల్లర్ల కింద తలదాచుకున్నారు. ఇదిలావుంటే, రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లో అలెర్ట్ జరీ చేసింది. ఆదివారం, సోమవారం రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది.

ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మిగిలిన చోట్ల అక్కడక్కడ చిరు జల్లులు కురుస్తాయని వెల్లడించింది.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. భానుడి భగభగను తట్టుకోలేక జనం విలవిల్లాడుతున్నారు. ఉదయం 10 దాటిందంటే బయటకు రావడానికే జంకుతున్నారు. వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగానే ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలకుపైగా పెరిగాయి. కొన్ని జిల్లాల్లో 45 డిగ్రీలకు దగ్గరగా చేరాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.

అయితే ఈ ఏడాది మారిన వాతావరణ పరిస్థితుల్లో వడగాడ్పులు వీస్తున్నాయని వాతావరణశాఖ అధికారులు అంటున్నారు. రాబోయే ఏడు రోజులు రాష్ట్రమంతటా గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు స్థిరంగా నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.