మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

మావోయిస్టు పొలిట్ బ్యూరో మెంబర్ కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, అలియాస్ దూలా(69) గుండెపోటుతో మృతిచెందారు. మే 31న దండకారణ్య అటవీ ప్రాంతంలో హఠాత్తుగా గుండెపోటుకు గురై మరణించినట్టు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో తెలిపారు.  కటకం సుదర్శన్ దీర్ఘకాలికంగా శ్వాసకోశ వ్యాధి, డయాబెటీస్, బీపీ సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. గత బుధవారం మధ్యాహ్నం 12.20 గంటలకు గుండెపోటుకు గురై ఆయన మరణించినట్లు ప్రకటించారు.
 
కటకం సుదర్శన్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నాల బస్తీవాసి. గెరిల్లా వార్ లో కటకం సుదర్శన్ దిట్ట. నాలుగున్నర దశాబ్దాల క్రితం కటకం సుదర్శన్ ఉద్యమంలోకి వెళ్లారు. కటకం సుదర్శన్ మరణంపై కేంద్ర కమిటీ సంతాపాన్ని ప్రకటించింది. ఈ నెల 5 నుంచి ఆగస్ట్ 3 వరకు కటకం సుదర్శన్ సంతాప సభలు నిర్వహించాలని పిలుపునిచ్చింది.
 
శ్రీకాకుళం పోరాటాల ప్రేరణతో 1974లో మైనింగ్ డిప్లోమా విద్యార్థిగా ఉద్యమం వైపు అడుగులు వేశారు. 1975లో రాడికల్ విద్యార్థి సంఘం నిర్మాణంలో సుదర్శన్ కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత బెల్లంపల్లి పార్టీ సభ్యుడిగా ఆయన పనిచేశారు. ఈ సమయంలో సింగరేణి కార్మిక ఉద్యమం, రాడికల్ విద్యార్థి ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు సుదర్శన్.
 
1978లో లక్షెట్టిపేట, జన్నారం ప్రాంతాల మావోయిస్టు పార్టీ ఆర్గనైజర్ గా రైతాంగ ఉద్యమాన్ని నడిపించారు. 1980లో ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడిగా, 1987లో దండకారణ్య ఫారెస్ట్ కమిటీకి కటకం ప్రాతినిథ్యం వహించారు. 1995లో ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కార్యదర్శిగా పనిచేశారు.  2001లో రెండోసారి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికైన సుదర్శన్  ఆయన సెంట్రల్ రీజనల్ బ్యూరో సెక్రటరీగా 2017 వరకు పనిచేశారు. అనారోగ్య సమస్యల కారణంగా తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
ఆయనను ఆనంద్‌, మోహన్‌, వీరేందర్‌జీ అని వివిధ పేర్లతో పిలుస్తారు.  సుదర్శన్‌పై హత్య కేసు సహా ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 17 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. రెండేండ్ల క్రితం ఛత్తీస్‌గడ్‌లోని దంతేవాడలో  సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై జరిగిన మావోయిస్టుల దాడిలో సుదర్శన్‌ హస్తం ఉన్నది. ఈ దాడిలో 70 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు చనిపోయిన విషయం తెలిసిందే.
ఇక గత నెల 28న ఛత్తీస్‌గఢ్‌  కాంగ్రెస్‌ నాయకులపై జరిగిన దాడికి పథక రచన చేసింది ఆయననేని పోలీసులు అనుమానిస్తున్నారు.  గత మూడు దశాబ్దాలుగా ఆయన ఉత్తర తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని దండకార్యణంలో ఉన్న ఆదివాసీ ప్రాంతాల్లో మావోయిస్టు ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ఆయన సతీమణి, మావోయిస్టు నాయకురాలు సాధన  గత కొన్నేండ్ల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందింది.