పోలవరం నీటి నిల్వపై తెలంగాణ అభ్యంతరం

పోలవరం ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయొద్దని తెలంగాణ డిమాండ్ చేసింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈకి తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ శనివారం ఆ మేరకు లేఖ రాశారు. పోలవరంలో 150 అడుగుల లెవల్‌‌లో నిల్వ చేస్తే తెలంగాణలో 899 ఎకరాల భూమిలో నీళ్లు నిలిచాయని గుర్తుచేశారు.

కిన్నెరసాని నది, ముర్రేడు వాగు సహా అనేక వాగులు గోదావరిలో కలవకుండా నీరు వెనక్కి నిలిచిపోతుందని తెలిపారు. 2022 జులైలో గోదావరికి వరద పోటెత్తడంతో  తెలంగాణలోని 103 గ్రామాల్లోని 40,446 ఎకరాల భూమి ముంపునకు గురైందని, 28 వేల మంది ప్రజలు నిర్వాసితులయ్యారని లేఖలో పేర్కొన్నారు. 

ఈ వరదలను ప్రామాణికంగా తీసుకొని పోలవరంలో ముంపుపై జాయింట్ సర్వే చేయాలని, ముంపునకు గురయ్యే భూమిని సేకరించాలని, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని కోరారు. పోలవరంలో ముంపునకు గురయ్యే భూమి ఎంతో జాయింట్ సర్వే చేసి నిర్ధారించాలని 2022 సెప్టెంబర్ 6న సుప్రీంకోర్టు ఆదేశించిందని గుర్తుచేశారు.

జాయింట్ సర్వే చేసి ముంపును నిర్ధారించాలని సీడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలోనూ నిర్ణయించారని చెప్పారు. పోలవరం బ్యాక్ వాటర్‌‌‌‌తో మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్, భద్రాచలం శ్రీసీతారామాలయం, సారపాక ఐటీసీ పడే ప్రభావంపైనా అధ్యయనం  చేయాలని కోరారు. 

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ ఏడాది ఏప్రిల్ 12న నిర్వహించిన కో ఆర్డినేషన్ మీటింగ్‌‌లో పోలవరం కారణంగా తెలంగాణలో 954 ఎకరాలు ముంపునకు గురవుతాయని ఏపీ ఇచ్చిన నివేదిక స్పష్టం చేసిందని పేర్కొన్నారు. పోలవరంతో అశ్వాపురం, భద్రాచలం, బూర్గంపాడు, చెర్ల, దుమ్ముగూడెం, పినపాక మండలాలపై పడే ప్రభావంపైనా అధ్యయనం చేయాలని కోరారు.

ఈ మండలాల్లోని వాగులు గోదావరిలో కలవకుండా వెనకకు నిలిచే నీటిపైనా స్టడీ చేయాలని కోరారు. అయితే, ఏపీ ప్రభుత్వం మాత్రం జాయింట్ సర్వేకు సహకరించడం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు.