మహాభారత్ `శకుని మామ’ కన్నుమూత

మ‌హాభార‌త్ టీవీ సీరియ‌ల్‌లో శ‌కుని పాత్ర‌ను పోషించిన ప్ర‌ఖ్యాత న‌టుడు గుఫి పెయింటాల్ ఇక లేరు. సోమ‌వారం ఆయ‌న తుది శ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌సు 79 ఏళ్లు. గుఫి మృతిచెందిన స‌మాచారాన్ని ఆయ‌న బంధువు హితేన్ పెయింటాల్ వెల్ల‌డించారు.
 
గత కొంతకాలంగా వృద్ధాప్యం కారణంగా తలెత్తిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో నిద్రలోనే ఆయన కన్నుమూసినట్లు వారు చెప్పారు. 1980 ద‌శ‌కంలో గుఫి అనేక హిందీ చిత్రాల్లో న‌టించారు. సుహాగ్‌, దిల్‌ల‌గీ లాంటి ఫిల్మ్స్‌లో చేశారు. సీఐడీ, హ‌ల్లో ఇన్‌స్పెక్ట‌ర్ లాంటి టీవీ షోల్లోనూ న‌టించారు.
 
గుఫీ అసలు పేరు శరబ్‌జీత్‌ సింగ్‌ పైంటాల్‌. పంజాబ్‌లో జన్మించిన ఆయన ఇంజనీరింగ్‌ చేశారు. తదుపరి ఆయన సోదరుడి సహకారంతో యాక్టింగ్‌ వైపు అడుగులేశారు. 1969లో ముంబైకి మకాం మార్చి మోడలింగ్‌లో అడుగుపెట్టారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పలు చిత్రాలకు, సీరియళ్లకు పనిచేయడమే కాకుండా నటించారు కూడా. ఆయన సోదరుడిని డైరెక్ట్‌ చేశారు.

బి.ఆర్‌ చోప్రా, రవి చోపార దర్శకత్వం వహించిన ‘మహాభారత్‌’ సీరియల్‌లో శకుని పాత్రతో ఆయనకు ఎంతో గుర్తింపు వచ్చింది. శకుని పాత్ర ఆయనకు కెరీర్‌ బెస్ట్‌ రోల్‌ అని గుఫి పైంటాల్‌ చెబుతుండేవారు. . శకుని మామగా ప్రతి ఇంటా ఆయన పేరు మార్మోగింది.

శ్రీ చైతన్య మహ్రాపభు సినిమాను కూడా ఆయన డైరెక్ట్‌ చేశారు. ‘మహాభారత్‌’ సీరియల్‌తోపాటు బహదూర్‌ షా జఫర్‌, కానూన్‌, ఓం నమః శివాయ, సీఐడీ, కోయి హై ద్వారకా ధీష్‌ భగవాన్‌ శ్రీ కృష్ణ, రాధాకృష్ణ సీరియళ్లలో కనిపించాడు. 1975 చిత్రం రఫూ చక్కర్‌తో బాలీవుడ్‌లో అరంగేట్రం చేశాడు. గుఫికి కుమారుడు, కోడ‌లు, మ‌నువ‌లు ఉన్నారు.