రైల్వే ప్రమాదానికి కారణం, బాధ్యులను గుర్తించాం

ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదానికి కారణాన్ని గుర్తించినట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదివారం ప్రకటించారు. ఘటనా స్థలిలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ రైలు దుర్ఘటనపై విచారణ పూర్తయ్యిందని, రైల్వే సెఫ్టీ కమిషనర్ త్వరలోనే నివేదిక సమర్పిస్తారని చెప్పారు. కాగా మూడు రైళ్లు ఢీకొన్న ప్రాంతాన్ని ఆదివారం ఉదయం సందర్శించారు. ట్రాక్‌ల పునరుద్ధరణ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
‘రైల్వే సేఫ్టీ కమిషనర్ ఈ విషయంపై దర్యాప్తు చేసి నివేదికను అందజేస్తారు. అయితే మేము సంఘటనకు కారణాన్ని, దానికి బాధ్యులను గుర్తించ. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు కారణంగా ఇది జరిగింది. ప్రస్తుతం మా దృష్టంతా పునరుద్ధరణపైనే ఉంది’ అని రైల్వే మంత్రి వెల్లడించారు.  ట్రాక్ పునరుద్దరణ పనులు ప్రారంభించామని, బుధవారం ఉదయానికల్లా వీటిని పూర్తిచేసి రైళ్లను నడపాలని భావిస్తున్నట్టు మంత్రి చెప్పారు.
అలాగే, మృతదేహాలను ఘటనా స్థలి నుంచి పూర్తిగా తొలగించామని వివరించారు. రైలు ప్రమాదానికి సిగ్నలింగ్ వైఫల్యమే కారణమని రైల్వే ప్రాథమిక నివేదికలో పేర్కొంది. ప్రమాదస్థలంలో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, 1000 మందికిపైగా ఒడిశా కార్మికులు శ్రమిస్తున్నారని ఆయన తెలిపారు.
 
ఇంటర్‌లాకింగ్ అనేది రైల్వే సిగ్నలింగ్‌లో అంతర్భాగం. ఇది నియంత్రిత ప్రాంతం గుండా రైలు సురక్షితంగా వెళ్లేలా చేస్తుంది. రైల్వే సిగ్నలింగ్ అన్-ఇంటర్‌లాక్డ్ సిగ్నలింగ్ వ్యవస్థ ప్రస్తుత ఆధునికరణ చాలా వరకు పూర్తయింది.  భారతీయ రైల్వే రిసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్ డి ఎస్ ఓ) ప్రకారం  ఈఐ వ్యవస్థ ఇంటర్‌లాకింగ్ లాజిక్ సాఫ్ట్‌వేర్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది ఎటువంటి వైరింగ్ మార్పుల అవసరం లేకుండా ఏదైనా సులభంగా మార్పు చేసుకోవచ్చు.
 
మెయిన్ ట్రాక్‌పైకి రైలు వెళ్లేందుకు తొలుత సిగ్నల్ ఇచ్చి వెంటనే నిలిపివేయడంతో లోకో-పైలట్ లూప్ లైన్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ను మళ్లించారు. ఈ మార్గంలో నిలిపి ఉన్న గూడ్సు రైలు ఢీకొట్టి బోగీలు మెయిన్ లైన్ పట్టాలపై పడ్డాయని చెబుతున్నారు.  అయితే, కొంతమంది రైల్వే నిపుణులు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ నేరుగా లూప్ లైన్ లోపల గూడ్స్ రైలును ఢీకొట్టి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ పరిస్థితి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఇంజన్ గూడ్స్ రైలు పైభాగంలో ఉన్నట్లు కనిపిస్తుంది.

కోరమండల్ ఎక్స్‌ప్రెస్ నేరుగా గూడ్స్ రైలును ఢీకొట్టినట్లు తెలియజేస్తుందని అభిప్రాయపడుతున్నారు. లూప్ లైన్ అనేది ప్రధాన రైల్వే ట్రాక్‌ల నుంచి విడిపోయి ఉండి కొంత దూరం తర్వాత మెయిన్‌లైన్‌కి తిరిగి కలుస్తుంది. ఇది రద్దీగా ఉండే రైలు ట్రాఫిక్‌ని నిర్వహించడానికి సహాయపడుతుంది.

మరోవైపు, ఈ ప్రమాదంతో దక్షిణ, ఆగ్నేయ రైల్వేజోన్లలో 90 రైళ్లను రద్దు చేసి, 46 రైళ్లను దారి మళ్లించారు. 11 రైళ్ల గమ్యస్థానాలను కుదించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయానికి ఖరగ్‌పుర్‌లో ఉన్న చెన్నై సెంట్రల్‌ – హౌరా (12480) రైలును జరోలీ మీదుగా పంపించారు. అలాగే వాస్కోడగామా – షాలిమార్‌ (18048), సికింద్రాబాద్‌ – షాలిమార్‌ వీక్లీ (22850) రైలును కటక్‌ మీదుగా నడుపుతున్నారు.