అమేథిలో రాహుల్, రాయ్‌బ‌రేలీలో ప్రియాంక పోటీ?

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అమేథి, రాయ్‌బ‌రేలీ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ తర‌పున ఎవ‌రు పోటీ చేస్తార‌నే దానిపై కొన‌సాగుతోన్న ఉత్కంఠ‌కు మ‌రో నాలుగైదు రోజుల్లో తెర‌ప‌డే అవ‌కాశం ఉంది. ఈ స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను కాంగ్రెస్ అధిష్టానం ఏప్రిల్ 30వ తేదీ త‌ర్వాత అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అమేథి నుంచి రాహుల్ గాంధీ, రాయ్‌బ‌రేలీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తార‌ని జోరుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

రాహుల్ గాంధీ కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ నుంచి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇక్క‌డ ఏప్రిల్ 26వ తేదీన పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అదే రోజున అమేథి, రాయ్‌బ‌రేలీ స్థానాల్లో నామినేష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. వ‌య‌నాడ్‌లో పోలింగ్ ప్ర‌క్రియ ముగియ‌గానే అమేథీ, రాయ్‌బ‌రేలీ ఎంపీ స్థానాల‌పై అన్నాచెల్లెళ్లు దృష్టి సారించ‌నున్న‌ట్లు స‌మాచారం.

అమేథి, రాయ్‌బ‌రేలీ ఎంపీ స్థానాల‌కు నామినేష‌న్లు దాఖ‌లు చేసేందుకు చివ‌రి తేదీ మే 3. చివ‌రి తేదీకి రెండు రోజుల ముందు రాహుల్, ప్రియాంక నామినేష‌న్లు వేసే అవ‌కాశం ఉంది. ఇక నామినేష‌న్ల దాఖ‌లు కంటే ముందు.. అన్నాచెల్లెళ్లు అయోధ్య బాల‌రాముడిని ద‌ర్శించుకునే అవ‌కాశం ఉంద‌ని జాతీయ మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. 

ఈ ఏడాది జ‌న‌వ‌రి 22న అయోధ్య‌లో నిర్వ‌హించిన బాల‌రాముడి విగ్ర‌హ ప్రాణ‌ప్ర‌తిష్ఠ‌కు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉన్న విష‌యం విదిత‌మే. కాంగ్రెస్‌కు ప‌ట్టున్న రాయ్‌బ‌రేలీ నుంచి సోనియా గాంధీ పార్ల‌మెంట్‌కు ప్రాతినిధ్యం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. 2004 నుంచి 2019 వ‌ర‌కు సోనియానే గెలుపొందారు. 

ఇటీవ‌ల సోనియా రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. దీంతో రాయ్‌బ‌రేలీ నుంచి సోనియా కూతురు ప్రియాంక బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు స‌మాచారం. అమేథిలో 2004 నుంచి వ‌రుస‌గా మూడుసార్లు రాహుల్ ఎన్నిక‌య్యారు. 2019 ఎన్నిక‌ల్లో బీజేపీ నాయ‌కులు స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓట‌మి పాల‌య్యారు. ఆ ఎన్నిక‌ల్లో రాహుల్ వ‌య‌నాడ్ నుంచి గెలుపొందారు.

 దేశంలో అత్యధికంగా 80 లోక్ సభ స్థానాలు గల ఉత్తర ప్రదేశ్ లో పోటీచేయకుండా వదిలేస్తే జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకం కాగలదని పలువురు సీనియర్లు సూచించడంతో చివరకు వారిద్దరూ పోటీకి సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. కాగా, బిజెపి సహితం రాయ్‌బ‌రేలీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.

ప్రస్తుతం బిజెపి ఎంపీ, గాంధీ కుటుంభంకు చెందిన వరుణ్ గాంధీని ఇక్కడి నుండి పోటీచేయమని బిజెపి నాయకత్వం కోరుతున్నట్లు తెలుస్తున్నది. అందుకు వరుణ్ గాంధీ అంగీకరిస్తే ఆయనే అభ్యర్థిగా ఉండే అవకాశం ఉంది.