మోదీ, రాహుల్ ప్రసంగాలపై ఈసీ నోటీసులు

బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఎన్నికల సంఘం తాజాగా నోటీసులు ఇచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి విద్వేషపూరిత ప్రసంగాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించిన నేపథ్యంలో ఈసీ విచారణ చేపట్టింది. దీనిపై ఫిర్యాదులు రావడంతో రెండు పార్టీలకు ఎన్నికల సంఘం తాజాగా నోటీసులు పంపింది
ఏప్రిల్ 29వ తేదీ ఉదయం 11 గంటల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలను ఈసీ ఆదేశించింది. ఈ సందర్భంగా మోదీ, రాహుల్‌ ప్రసంగాలపై ఈసీ అసహనం వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులు ఎన్నికల నియమావళిని అనుసరిస్తున్నాయా లేదా అన్నది ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని, అది పార్టీ బాధ్యత అని తెలిపింది. ముఖ్యంగా స్టార్‌ క్యాంపెయినర్ల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 

ఉన్నత స్థాయిల్లో ఉన్న వ్యక్తుల ప్రచార ప్రసంగాలు మరింత తీవ్రమైన పరిణామాలకు దారి తీసే ప్రమాదం ఉంటుందని ఈసీ తన నోటీసుల్లో పేర్కొంది. పార్టీ అధ్యక్షులకు నోటీసులు  ఇవ్వడం ద్వారా ఎన్నికల కమిషన్ ఇప్పటివరకు నేరుగా ఉల్లంఘనలకు పాల్పడిన నేతలకు నోటీసులు ఇచ్చే సంప్రదాయాన్ని మార్చిన్నట్లయింది. ప్రస్తుత ఎన్నికల సమయంలోనే దిలీప్ ఘోష్ (బీజేపీ), రణదీప్ సూర్జేవాలా, సుప్రియా షినాటే (కాంగ్రెస్), అతిషి (ఆప్) లకు నేరుగా నోటీసులు ఇవ్వడం గమనార్హం.

ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 77 ప్రకారం రెండు పార్టీల అధ్యక్షులకు ఎన్నికల సంఘం నోటీసులు పంపింది. ప్రాథమికంగా, స్టార్ క్యాంపెయినర్ల సైన్యాన్ని రంగంలోకి దింపడానికి పార్టీ అధ్యక్షులను కమిషన్ బాధ్యులను చేసింది. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల చర్యలకు తొలి బాధ్యత వహించాలని ఇరు పార్టీల అధ్యక్షులకు సూచించారు. ముఖ్యంగా స్టార్ క్యాంపెయినర్ల విషయంలో.. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల ఎన్నికల ప్రసంగాల ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని గుర్తు చేసింది. 

బిజెపి అధ్యక్షుడు  జెపి నడ్డాకు పంపిన నోటీసులో ప్రధాన మంత్రి పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ  రాజస్థాన్ లో కాంగ్రెస్ ను ఎన్నుకొంటే జాతి సంపదను `చొరబాటుదారులు’, `ఎక్కువమంది సంతానం’ గలవారికి పంచుతారంటూ ఆయన చేసిన ప్రసంగంపై సిపిఎం, సిపిఎం చేసిన ఫిర్యాదులను ప్రస్తావించింది.

కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు పంపిన నోటీసులు ఏప్రిల్ 18న కేరళలోని కొట్టాయిలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలో  ప్రధాని మోదీ `ఒకే  దేశం, ఒకే భాష, ఒకే మతం’ కోరుకుంటున్నారని అంటూ చేసిన ప్రసంగం ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని బిజెపి ఫిర్యాదు చేసిన్నట్లు ప్రస్తావించారు. అదే విధంగా అదే రోజున ఖర్గే రామమందిరం విగ్రహ ప్రతిష్టకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆమె షెడ్యూల్ ట్రైబ్ కావడంతో ఆహ్వానించలేదని పేర్కొన్నారని తెలిపారు.

రాజకీయ ప్రసంగాలలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పడానికి ప్రవర్తన నియమావళి నిబంధనల స్ఫూర్తిని పరిగణలోకి తీసుకొని పాటించాలని తమ  తమ స్టార్ క్యాంపెయినర్ల దృష్టికి తీసుకురావాలని  ఆ నోటుసులలో నడ్డా, ఖర్గే లను ఎన్నికల కమిషన్ కోరింది.