గూడ్సు పట్టాలు తప్పలేదు.. కోరమాండల్ రైలే ఢీకొట్టింది

ఒడిశా రైలు ప్రమాద ఘటనలో గూడ్సు రైలు పట్టాలు తప్పలేదని, అందులో ఇనుప ఖనిజం ఉండటం వల్ల దాన్ని ఢీకొట్టిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌పై పెను ప్రభావం పడిందని రైల్వే బోర్డు సభ్యురాలు (ఆపరేషన్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్) జయవర్మ సిన్హా తెలిపారు. ఒడిస్సా రైలు ప్రమాదంలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ మాత్రమే ప్రమాదానికి గురయినట్లు ఆమె చెప్పారు.
‘ఒడిశా రైలు ప్రమాద ఘటనలో గూడ్స్ రైలు పట్టాలు తప్పలేదు. గూడ్సు వ్యాగన్లలో ఇనుప ఖనిజం ఉన్నందున.. దాన్ని ఢీకొన్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌పై తీవ్ర ప్రభావం పడింది. ఇది భారీ సంఖ్యలో మరణాలు, గాయాలకు దారితీసింది’ అని ఆమె చెప్పారు. ఆ సమయంలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు దాదాపు గంటకు 128 కి.మీ వేగంతో ప్రయాణిస్తోందని, అయితే, అతి వేగం ప్రమాదానికి కారణం కాదని పేర్కొన్నారు.
బాలాసోర్‌లోని బహనాగ బజార్‌స్టేషన్‌ నాలుగు లైన్ల కూడలి అని, మధ్యలో రెండు ప్రధాన లైన్లు, ఇరువైపులా లూప్‌ లైన్లు ఉన్నాయని ఆమె తెలిపారు.  రెండు లూప్‌ లైన్‌ల్లో ఇనుప ఖనిజంతో గూడ్స్‌రైళ్లు వెళుతున్నట్లు చెప్పారు. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ గంటకు 128 కి.మీ., మరో రైలు 126 కి.మీ. పరిమితి గంటకు 130 కి.మీ. కాబట్టి వాటిలో ఏదీ ఓవర్‌ స్పీడ్‌ కాదని జయ వర్మ సిన్హా తెలిపారు.
రెండు ప్రధాన లైన్లలో గ్రీన్‌ సిగ్నల్  ఉండటంతో.. 128 కి.మీ వేగంతో వెళుతున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిందని, 126 కి.మీ వేగంతో వెళ్తోన్న యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ చివరి రెండు బోగీలను  ఢీ కొట్టాయని పేర్కొన్నారు.  సమాచారం కోసం బాధిత కుటుంబాలు హెల్ప్‌లైన్ నంబర్ 139ను సంప్రదించాలని ఆమె సూచించారు.
వారి ప్రయాణం, ఇతర ఖర్చులను రైల్వే పూర్తిగా భరిస్తుందని ఆమె స్పష్టం చేశారు.  సిగ్నలింగ్‌లో లోపం వల్ల రైలు ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని రైల్వే బోర్డు తెలిపింది. అయితే, ఈ ఘటనపై రైల్వే సేఫ్టీ కమిషనర్ నుంచి పూర్తిస్థాయి నివేదిక రావాల్సి ఉందని ఆమె వెల్లడించింది.
 
ప్రమాద సమయానికి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దాదాపు గంటకు 128 కి.మీ వేగంతో ఉన్నట్లు పేర్కొంది. అయితే, అతి వేగం ప్రమాదానికి కారణం కాదని ఆమె వివరించింది. ఒడిశాలో చోటుచేసుకున్న ఈ రైలు ప్రమాదంలో 294 మంది దుర్మరణం చెందారు. మరో 1,175 మందికి పైగా గాయపడగా, క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

లూప్‌ లైన్‌ లోకి వెళ్లిన కొరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, ఐరన్‌ ఓర్‌ తో ఉన్న గూడ్స్‌ రైలును ఢీ కొట్టిందని, భారీ బరువుతో ఉన్న రైలును  ఢీ కొట్టడంతో  మొత్తం షాక్‌ ను గ్రహించిందని ఆమె వెల్లడించారు.  దీంతోనే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని,  భారీ సంఖ్యలో మరణాలు, గాయాలకు దారితీసిందని తెలిపారు.

లింకే హాఫ్‌మన్‌ బుష్‌ (ఎల్‌హెచ్‌బి) కోచ్‌లు సురక్షితంగా ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. దేశీయంగా అభివృద్ధి  చేసిన ఆటోమేటిక్‌ రైలు రక్షణ వ్యవస్థ ”కవచ్‌” అందుబాటులో లేదని రైల్వే తెలిపింది. ప్రపంచంలోని ఏ సాంకేతికత కూడా కొన్ని ప్రమాదాలను నివారించలేదని, వాహనాల ముందు బండరాళ్లు అకస్మాత్తుగా పడిపోతుంటాయని సిన్హా ఉదహరించారు.

సిగ్నల్  సమస్య కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ మాత్రమే ప్రమాదానికి గురైందని, మూడు రైళ్లు కాదని ఆమె పునరుద్ఘాటించారు.