రైల్వే ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు

 
275 మంది ప్రాణాలను బలిగొన్న బాలాసోర్ రైలు దుర్ఘటనపై సీబీఐ దర్యాప్తునకు రైల్వే బోర్డు సిఫార్సు చేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం వెల్లడించారు. రైలు ప్రమాదంపై అశ్విని వైష్ణవ్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది మానవ తప్పిదమా..? లేక మరేదైనా కుట్ర కోణం దగుందా..? అన్న దానిపై సీబీఐ విచారణ జరుపుతుందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
ఇప్పటికే బహనాగ స్టేషన్ మేనేజర్ ను కూడా అధికారులు విచారించారు. బహనాగ స్టేషన్ మాస్టర్ రూమ్, సిగ్నలింగ్ రూమ్ లో సీసీ కెమెరాలను పరిశీలించారు. మరోవైపు.. కోరమాండల్ ను కావాలనే లూప్ లైన్ లోకి మార్చారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టంలో ఎవరో మార్పులు చేశారని రైల్వేశాఖ మంత్రి చెప్పారు. సిగ్నలింగ్ వ్యవస్థపైనా సీబీఐ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తుందన్నారు.
బాలాసోర్ ట్రిపుల్ రైలు ప్రమాద స్థలం వద్ద ట్రాక్‌లను పరిశీలించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు అప్ అండ్ డౌన్ రైల్వే ట్రాక్‌లు రెండింటినీ మరమ్మతులు చేసినట్లు సమాచారం. ట్విటర్‌లో , ట్రాక్ లింక్ అప్-లైన్ పునరుద్ధరించారని, ఓవర్‌హెడ్ విద్యుదీకరణ పనులు కూడా ప్రారంభించారని రైల్వే మంత్రి తెలిపారు.
 
 “16.45 గంటలకు అప్-లైన్ ట్రాక్ లింకింగ్ పూర్తయింది. ఓవర్ హెడ్ విద్యుద్దీకరణ పనులు ప్రారంభమయ్యాయి” అని వైష్ణవ్ ఆదివారం ట్వీట్ చేశారు. అంతకుముందు హౌరాను లింక్ చేసే డౌన్ లైన్ పునరుద్ధరించబడిందని ట్వీట్ చేశారు.
వంద మంత్రి పరిస్థితి విషమం

బాలాసోర్ విషాద రైలు ప్రమాదంలో 1000 మందికి పైగా గాయపడ్డారని, మరో 100 మంది పరిస్థితి విషమంగా ఉందని  కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్లడించారు. అంతకుముందు ఒడిశాకు చేరుకున్న ఆయన రైలు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను భద్రపరిచిన భువనేశ్వర్ ఎయిమ్స్‌ను సందర్శించారు. “ఢిల్లీ  ఎయిమ్స్‌ , ఇతర ఆసుపత్రుల నుంచి నిపుణులైన వైద్యుల బృందం భారత వైమానిక దళం (ఐఎఎఫ్) ప్రత్యేక విమానంలో ఇక్కడికి చేరుకుంది. వారు అత్యాధునిక పరికరాలు, మందులతో చికిత్స చేయనున్నారు ”అని మాండవ్య తెలియజేశారు.

రోగుల పరిస్థితి, వారు చేరిన ఆసుపత్రులు, వారికి ఎలాంటి చికిత్స అవసరం, నిపుణుల బృందం వారికి ఎలా సహాయం చేయగలదో సమగ్ర సమీక్ష జరిపామని కేంద్ర ఆరోగ్య మంత్రి తెలిపారు. అధునాతన చికిత్స అందించడం కోసం వర్కింగ్ ప్లాన్ అమలవుతోందన్న ఆయన బాధితుల ప్రాణాలు కాపాడేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా రైలు ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తోన్న వైద్య సిబ్బందికి సహాయం చేయడానికి ఢిల్లీ ఎయిమ్స్‌తో సహా వివిధ ఆసుపత్రుల నుంచి నిపుణుల నిపుణుల బృందం ఒడిశాకు చేరుకుంది.

ఎల్ఐసి కీలక నిర్ణయం

రైలు ప్రమాదంలో బాధితుల క్లెయిమ్ పరిష్కారం కోసం భారత జీవిత భీమాసంస్థ (ఎల్‌ఐసి)పలు ఉపశమనాలను ప్రకటించింది. రైలు ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు క్లెయిమ్ పరిష్కారాలను  వేగవంతం చేస్తామని తెలిపింది.  ఎల్‌ఐసి పాలసీలు, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన క్లెయిందారుల కష్టాలను తగ్గించడానికి,  ఎల్‌ఐసి క్లెయిమ్ పరిష్కారం కోసం వివిధ రాయితీలను ప్రకటించింది.

“రిజిస్టర్డ్ డెత్ సర్టిఫికేట్‌లకు బదులుగా, రైల్వే అధికారులు, పోలీసులు లేదా ఏదైనా రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రచురించిన మరణాల జాబితా మరణానికి రుజువుగా అంగీకరించబడుతుంద”ని సంస్థ తెలిపింది. క్లెయిమ్ కు సంబంధిత సందేహాలకు ప్రతిస్పందించడానికి, హక్కుదారులకు సహాయం అందించడానికి ఎల్‌ఐసి డివిజనల్, బ్రాంచ్ స్థాయిలలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను కూడా ఏర్పాటు చేసింది.