ఆసక్తి కలిగిస్తున్న అమిత్ షాతో చంద్రబాబు భేటీ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి ఢిల్లీలో  బీజేపీ కీలక నేతలతో భేటీ కావడం ఆసక్తి కలిగిస్తున్నది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిపిన సమావేశంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొనడంతో రాజకీయ అంశాలపైననే వారు చర్చలు జరిపినట్లు భావిస్తున్నారు.  సుమారు 50 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చించారు.

2018లో ఎన్డీయే కూటమి నుంచి బయటికొచ్చిన తర్వాత అమిత్‌షాతో గాని, కేంద్ర బిజెపి నేతలతో గాని చంద్రబాబు భేటీ అవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. త్వరలో తెలంగాణాలో, వచ్చే ఏడాది లోక్ సభతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సమయంలో ఈ భేటీ జరగడం ఆసక్తి కలిగిస్తున్నది.

2018లో ఎన్డీయే నుండి వైదొలిగిన తర్వాత కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడంతో పాటు ప్రధాని మోదీపై  వ్యక్తిగత విమర్శలకు చంద్రబాబు దిగడంతో బిజెపి నాయకత్వం ఆగ్రహంగా ఉంటూ వస్తున్నది. ఇప్పుడు జరిగిన భేటీలో నాటి పరిస్థితులలో తన ప్రవర్తనపై చంద్రబాబు సంజాయిషీ ఇచ్చుకున్నట్లు తెలుస్తున్నది. గతం మరచిపోయి, ముందుకు సాగుదామని ప్రతిపాదించినట్లు చెబుతున్నారు.

వారు ఏ అంశాలపై చర్చించారో ఎవ్వరూ బైటకు చెప్పకపోయినప్పటికీ రాబోయే ఎన్నికల గురించే అయి ఉంటుందని భావిస్తున్నారు. గత ఆదివారమే వైసిపి అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో అమిత్ షాతో భేటీ జరిపిన వారం లోపుగా ఈ భేటీ జరగడం గమనార్హం.

జగన్ మోహన్ రెడ్డి ఎన్డీయేలో భాగస్వామి కాకపోయినప్పటికీ పార్లమెంట్ లో అన్ని అంశాలలో బిజెపి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సహితం జగన్ ప్రభుత్వం పట్ల అనేక అంశాలలో సానుకూలంగా వ్యవహరిస్తున్నది. మరోవంక, బిజెపి మిత్రపక్షం జనసేన `వైసిపి ముక్త ఆంధ్ర ప్రదేశ్’ నినాదంతో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చేయడం కోసం టిడిపి, జనసేన, బీజేపీ ఉమ్మడిగా పోటీచేయాలని ప్రతిపాదిస్తున్నారు.

అయితే జనసేన ప్రతిపాదన పట్ల ఇప్పటివరకు బిజెపి సానుకూలంగా స్పందించడం లేదు. పైగా తమకు జనసేనతో మాత్రమే పొత్తు ఉందని, టిడిపితో లేదని స్పష్టం చేస్తున్నారు. కొందరు ఏపీ బిజెపి నాయకులైతే `కుటుంభ పార్టీలతో’ తమకు పొత్తు ఉండదని ప్రకటనలు కూడా చేశారు.

ఇంకో వంక, సీఎం వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెడుతున్నారనే ప్రచారం జరుగుతుంది. టిడిపితో తిరిగి బిజెపి చేతులు కలపకుండా అవసరమైతే అసెంబ్లీ ఎన్నికల అనంతరం వైసీపీ ఎన్డీయేలో చేరుతుందని సంకేతం ఇచ్చారని చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో చంద్రబాబుతో అమిత్ షా, జెపి నడ్డాలు భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరింప చేసుకుంది.

ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికలలో తెలుగువారు బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేశారని భావిస్తున్నారు. గత ఎన్నికలలో ఏపీలో నోటాకన్నా తక్కువ ఓట్లు బిజెపికి వచ్చాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణాలో కాంగ్రెస్ కొంచెం జోష్ మీదున్నది. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగు రాస్త్రాలలో పార్టీ పరిస్థితులు మెరుగుపరచేందుకు బిజెపి నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? అనే ప్రశ్న తలెత్తుతుంది.

మరోవంక, ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నుండి ఎదురయ్యే వేధింపులు, దౌర్జన్యాలను ఎదుర్కోవాలంటే కేంద్ర ప్రభుత్వపు అండ తప్పనిసరి అనే భావనతోనే కొంతకాలంగా చంద్రబాబు నాయుడు కేంద్ర బిజెపి నాయకత్వానికి సానుకూల సందేశం పంపుతూ వస్తున్నారు.

అజాదీ కా అమత్ మహోత్సవ్ ఉత్సవాల సందర్బంగా దేశంలోని ప్రముఖ రాజకీయ నేతలందరినీ కేంద్రం ఆహ్వానించింది. ఈ సమయంలో చాలాకాలం తర్వాత మోదీ, చంద్రబాబుల మధ్య పలకరింపులు చోటుచేసుకున్నాయి. అంతేకాని, 2018 తర్వాత బిజెపి నాయకులను కలిసేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లడం ఇదే ప్రధమం కావడం గమనార్హం.

అయితే, టిడిపితో పొత్తు పెట్టుకుంటే తెలుగు రాష్ట్రాలలో బిజెపి పురోగతికి ప్రతిబంధకంగా మారగలదని, ప్రస్తుత ఎన్నికల్లో కొన్ని నష్టాలు ఎదురైనా పార్టీ సొంతంగా బలం పెంచుకోవాలంటే ఆ పార్టీకి దూరంగా ఉండాలనే అభిప్రాయం కూడా బీజేపీ వర్గాలలో వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం జరిగిన భేటీ ప్రాధమికమైనదని, నిర్దిష్టంగా ఎటువంటి ప్రతిపాదనలను చర్చించలేదని  చెబుతున్నారు.

తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోండగా, ఏపీలో జగన్‌ను ఓడించి అధికారాన్ని దక్కించుకోవాలని టీడీపీ భావిస్తోంది. తెలంగాణలో టీడీపీ కొన్నిచోట్ల బలంగా ఉండటంతో బీజేపీ దానిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. పరస్పర ప్రయోజనాలకోసం ఈ రెండు పార్టీలు వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు ఎటు దారితీస్తాయో చూడాల్సి ఉంది.