ముగిసిన రెస్క్యూ ఆపరేషన్ .. ట్రాక్ పునరుద్ధరణ ప్రారంభం

రైలు ప్రమాద స్థలంలో బాధితులను కాపాడేందుకు శుక్రవారం రాత్రి ప్రారంభించిన రెస్క్యూ ఆపరేషన్ శనివారం మధ్యాహ్నం ముగిసిందని రైల్వేస్ అధికార ప్రతినిధి అమితాభ్ శర్మ వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం తర్వాత ట్రాక్ పునరుద్ధరణ పనులు ప్రారంభం అయ్యాయని తెలిపారు.

ప్రమాదం జరిగిన తర్వాత దాదాపు 18 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిందని పేర్కొన్నారు. ప్రమాద స్థలం నుంచి బాధితులను తరలించేందుకు 200 అంబులెన్స్ లు, 50 బస్సులు, 45 మొబైల్ హెల్త్ యూనిట్లను ఉపయోగించినట్లు ఒడిశా అధికారులు తెలిపారు. సుమారు 1200 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారని వెల్లడించారు. మృతదేహాలను తరలించేందుకు అన్ని వాహనాలనూ వాడుకున్నామని పేర్కొన్నారు.

దేశ రైల్వే చరిత్రలోనే అతి పెద్ద దుర్ఘటనల్లో ఇది ఒకటి కావడంతో వేలాదిగా సహాయ సిబ్బంది తరలి వచ్చారు. వైమానిక దళం, సైన్యం రంగంలోకి దిగాయి.  మృతుల సంఖ్య 288కి చేరినట్లు శనివారం రైల్వే అధికారులు తెలిపారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందన్నారు. 1000 మందికి పైగా తీవ్రగాయాలైనట్లు వెల్లడించారు.

తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించేందుకు గాను భారత వైమానిక దళం రెండు ఎంఐ–17 హెలికాప్టర్లను పంపిందని పేర్కొన్నారు. సమీపంలోని సైనిక కేంద్రాల నుంచి సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఆర్మీ మెడికల్‌, ఇంజనీరింగ్‌ బృందాలు అంబులెన్సులు, ఇతర సామగ్రితో ఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపారు

రైలు ప్రమాద స్థలంలో 300 మంది నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్ వెల్లడించారు. మెటల్ కట్టర్స్, స్నిఫర్ డాగ్ స్క్వాడ్స్, హెవీ లిఫ్ట్ ఎక్విప్ మెంట్లతో వారంతా బాధితుల కోసం వెతికారని ఆయన తెలిపారు.

స్థానిక పోలీసులు, రైల్వే సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 9 బృందాలుగా సహాయక చర్యల్లో పాల్గొన్నారని, వీరిలో మహిళా సిబ్బంది, వైద్య బృందాలు కూడా ఉన్నట్లు చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ల సభ్యులు 44 మందిని ప్రాణాలతో కాపాడారని, 71 మంది మృతదేహాలను వెలికితీశారని పేర్కొన్నారు.

ప్రధానంగా ధ్వంసమైన రైలు బోగీలను కట్ చేస్తూ, వాటిలో బతికి ఉన్న వారిని కాపాడటమే తమ సిబ్బందికి ఇచ్చిన మెయిన్ టాస్క్ అని తెలిపారు. రైలు ప్రమాదం జరిగిన వెంటనే ఆ పరిసరాల్లో ఉన్న స్థానికులు పరుగుపరుగున వచ్చి ఎంతో మందిని కాపాడారు. బోగీల్లో నెత్తురోడుతున్న వారిని బయటకు తీసి సమీపంలోని దవాఖానకు తరలించారు.

పోలీసులకు, రైల్వే సిబ్బందికి కొందరు సమాచారం ఇవ్వగా, మరికొందరు బాధితులను బయటకు తీశారు. గాయపడిన వాళ్లను ఇంకొందరు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. ఇలా ఎవరికి తోచినట్లుగా వారు ఆపన్నహస్తం అందించారు.

ఒడిశాలో రైలు దుర్భటన నేపథ్యంలో 48 రైలు సర్వీసులను రద్దు చేయగా, 39 రైళ్లను దారి మళ్లించారు. మరో 10 సర్వీసులను పాక్షికంగా రద్దు చేశారు. ఇందులో చాలా వరకు దక్షిణ, ఆగ్నేయ రైల్వే జోన్ల పరిధిలోని సర్వీసులే. అలాగే, సికింద్రాబాద్‌ నుంచి ఒడిశా వైపు వెళ్లే పలు రైళ్లనూ రైల్వే అధికారులు రద్దు చేశారు.