మ‌హాకుంభ‌మేళా 2025కోసం డిజిటల్ కుంభ్ మ్యూజియం

ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని సంగమ్ నగరంలో జరిగే మ‌హాకుంభ‌మేళా 2025కోసం యోగి ఆదిత్య‌నాథ్ స‌ర్కార్ రూ. 300 కోట్ల పనులు చేబడుతూ విస్తృతంగా స‌న్నాహాలు చేస్తోంది. మ‌హాకుంభ‌మేళాకోసం పర్యాటక శాఖ రూ. 60 కోట్లతో డిజిటల్ కుంభ్ మ్యూజియం నిర్మాణాన్ని పర్యాటకులకు  ప్రత్యేక ఆకర్షణగా ప్రతిపాదిస్తున్నారు.
 
కుంభమేళా సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యతను ప్రదర్శించడం లక్ష్యంగా ఈ మ్యూజియం నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.  ఇది మహా కుంభమేళాతో ముడిపడి ఉన్న గొప్ప పురాణాలు, వారసత్వాన్ని తెలుసుకోవడానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడనుంది. ఈ ప్రతిపాదనను ఇటీవల పర్యాటక శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించింది.
 
మహా కుంభమేళా-2025 ఏర్పాట్లలో భాగంగా వివిధ ప్రాజెక్టులకు రూ. 170 కోట్లకు పైగా వ్యయం అవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టులతో పాటు రూ.120 కోట్లతో సివిల్ ఇంప్రూవ్‌మెంట్ పనులు, రూ.18 కోట్లతో ముఖద్వారం లైటింగ్ సంబంధిత పనులు కూడా చేపట్టాల్సి ఉంది.
 
ఇక ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహాకుంభ్ 2025ని చరిత్రలో అపూర్వమైన, గొప్ప సంఘటనగా మార్చాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భావిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రయాగ్‌రాజ్‌ని సందర్శించేందుకు భారతదేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుండి వచ్చే భక్తులకు సమగ్ర పురపాలక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడటమే యోగి సర్కార్ లక్ష్యంగా పెట్టింది.
 
ఇటీవల జరిగిన సమావేశంలో 2025లో జరిగే కుంభమేళాను రాబోయే సంవత్సరాల్లో భక్తులు ప్రశంసించే విధంగా ఉండాలని యోగి ఆదిత్యనాథ్ ఆకాంక్షించారు. డిజిటల్ కుంభ్ మ్యూజియం సందర్శకులకు హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్, ఆడియో-వీడియో గదులు వంటి సౌకర్యాలతో పూర్తి ఆధునిక కుంభ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది సముద్ర మంథన్ గ్యాలరీ, ఆధ్యాత్మిక, కుంభమేళా వివరణ గ్యాలరీ, అఖాడా గ్యాలరీ వంటి ఆధ్యాత్మిక నేపథ్య గ్యాలరీలను కలిగి ఉంటుంది.
 
మ్యూజియంలో ఫుడ్ ప్లాజా, సావనీర్ స్టోర్ ఉండనున్నాయి. కుంభమేళాకు సంబంధించిన పుస్తకాలు, సరుకులను కొనుగోలు చేయడానికి అందిస్తుంది. అదనంగా కల్చరల్ హాట్ (అక్షయవత్), మ్యూజియం, గ్యాలరీ, థియేటర్ (అమృత్ కలాష్) అలాగే అతిథి గృహం కూడా ఉంటాయి.  డిజిటల్ కుంభ్ మ్యూజియం ప్రవేశ లాబీలో సంగం నది డిజిటల్ ప్రొజెక్షన్ ఉంటుంది.కదిలే ఫ్రాక్టల్ జ్యామితి, స్థిర చిత్రాలను ఉపయోగించి, మ్యూజియం మూడు నదులను – గంగా, యమునా మరియు సరస్వతి – విభిన్న రంగులలో వర్ణిస్తుంది.
 
ఇంకా, ఇంటరాక్టివ్ ప్రయాగ్‌రాజ్ మ్యాప్ ఇంటర్‌ప్రెటేషన్ గ్యాలరీలో పెద్ద స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.  సందర్శకులు టచ్ ఇంటరాక్షన్‌ల ద్వారా దాన్ని అన్వేషించడానికి అనుమతిస్తుంది. మ్యూజియం ప్రయాగ్‌రాజ్‌లోని చారిత్రక, ప్రస్తుత అంశాల గురించి సమాచారాన్ని అందించనుంది.  సముద్ర మంథన్ గ్యాలరీలో ఫ్లోర్ ప్రొజెక్షన్ ద్వారా సముద్ర మంథన్ పురాణ కథ ప్రదర్శించబడుతుంది.
అఖాడా గ్యాలరీ దేశంలోని అఖాడా సంస్కృతిపై దృష్టి సారిస్తుంది. శంకరాచార్య ప్రయాణాలను వివరించే ఇంటరాక్టివ్ ప్రదర్శనను ప్రదర్శించనున్నారు. టెంపోరల్ సిటీ విభాగంలో వీడియో వాల్‌లు ఉండనున్నాయి.  భరద్వాజ ఆశ్రమం, ద్వాదశ మాధవ మందిరం, నాగవాసుకి మందిరం, దశాశ్వమేధ మందిరం, మనకామేశ్వర మందిరం, అలోపశంకరీ మందిరం, పడిల మహాదేవ్ మందిరం, పంచకోశి పరిక్రమ మార్గంలో ఉన్న దేవాలయాల అభివృద్ధితో పాటు, ఇతర అభివృద్ధి పనులను పర్యాటక శాఖ ప్రతిపాదించింది.