ఐఐటీల్లో 40 శాతం మందికి ఉద్యోగాల్లేవు

ఐఐటీల్లో చదివినవారిలో దాదాపు 40 శాతం మందికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లలో ఉద్యోగాలు లభించడం లేదని, ఉద్యోగాలు వచ్చినవారిలోనూ చాలామందికి రూ.10 లక్షల లోపే వార్షిక వేతనం ఉంటుందని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. ఉద్యోగాల కల్పన సేవలు అందించే ఆఫీస్‌ ఆఫ్‌ కెరీర్‌ సర్వీసెస్‌ (ఓసీఎస్‌)లో 1,814 మంది ఐఐటీ- ఢిల్లీ విద్యార్థులు ఉద్యోగాల కోసం నమోదు చేసుకుంటే 1,083 మందికే లభించాయి. అంటే దాదాపు 40 శాతం మందికి ఉద్యోగాలు దొరకలేదు. 

గత ఐదేండ్లలో 22 శాతం మంది విద్యార్థులకు ఉద్యోగాలు దొరకలేదని ఓ ఆర్టీఐ దరఖాస్తు ద్వారా వెల్లడైంది. ఇక ఐఐటీ- కాన్పూర్‌ విషయానికి వస్తే.. 2022లో 90 శాతం మందికి, 2023లో 91 శాతం మందికి ఉద్యోగాలు లభిస్తే ఈ ఏడాది మాత్రం 69 శాతం మందికే ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఐఐటీ-బాంబేలో గత ఏడాది 1,485 మంది విద్యార్థులకు ఉద్యోగాలు దొరకగా 32.8 శాతం మందికి నిరాశే ఎదురైంది. ఇంతకుముందు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లకు వచ్చి 6 – 8 మందిని ఎంపిక చేసుకునే కంపెనీలు ఇప్పుడు గరిష్ఠంగా ఒకరిద్దరిని మించి ఎంపిక చేయడం లేదు. 

దీంతో ఐఐటీల్లోని ప్లేస్‌మెంట్‌ కార్యాలయాల అధికారులు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లకు ఎక్కువ కంపెనీలు హాజరయ్యేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లలో ఉద్యోగాల భర్తీ తగ్గిపోవడం ఒక సమస్య అయితే.. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు లభిస్తున్న వేతనాలు కూడా అంతగా ఆశాజనకంగా లేవు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లలో ఎంపికైన చాలామందికి రూ.10 లక్షల లోపు వార్షిక వేతనాన్ని మాత్రమే ఇచ్చేందుకు కంపెనీలు ఆఫర్‌ చేస్తున్నాయి. 

ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో ఓ కంపెనీ ట్రెయినీ ఇంజినీర్‌ ఉద్యోగాలకు రూ.3.6 లక్షలు, ట్రెయినీ డిజైన్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలకు రూ.6 లక్షల వార్షిక వేతనం మాత్రమే ఆఫర్‌ చేసింది. వివిధ ఐఐటీల్లో చదువుతున్న చాలామంది విద్యార్థులు రూ.6 – 7 లక్షల వార్షిక వేతన ప్యాకేజీలకు ఉద్యోగాలు పొంది, తర్వాత అది సరిపోక మళ్లీ కొత్త ఉద్యోగాలను వెతుక్కుంటున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ప్రభావం వల్లనే ఐఐటీల్లో చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు, వేతనాలు తగ్గుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.