పాకిస్థానీ చొరబాటుదారుడి కాల్చివేత

జమ్మూ కశ్మీర్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన పాకిస్థానీ వ్యక్తిని సరిహద్దు భద్రతా దళం మట్టుబెట్టింది. హెచ్చరించినా ఆ వ్యక్తి దూసుకు వస్తుండడంతో భద్రతా సిబ్బంది కాల్పులు జరపాల్సి వచ్చింది. అంతర్జాతీయ సరిహద్దుల్లో సాంబ సెక్టార్‌లో గురువారం ఈ సంఘటన జరిగింది.

అంతర్జాతీయ సరిహద్దు లోని బీఓపీ (బోర్డర్ అవుట్ పోస్ట్) మంగుచక్ వద్ద గురువారం తెల్లవారుజామున 2.50 గంటలకు పాకిస్థాన్ వైపు నుంచి ఓ వ్యక్తి అనుమానాస్పదంగా దూసుకొస్తుండగా బీఎస్‌ఎఫ్ సిబ్బది గమనించింది. హెచ్చరించినా ఆ వ్యక్తి వినకుండా సరిహద్దు కంచె వైపు దూసుకొచ్చాడు. దీంతో భద్రతా సిబ్బంది కాల్పులు జరపగా ఆ వ్యక్తి చనిపోయాడని అధికారులు తెలిపారు.

కాగా, జమ్ము కశ్మీర్ లోని బారాముల్లాలో లష్కరే తొయిబాకు చెందిన ఇద్దరు మిలిటెంట్లను భద్రతా దళాలు గురువారం అరెస్టు చేశాయి. వీరి నుంచి ఆయుధాలతోపాటు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఫ్రెస్టిహార్ జీరి గ్రామంలో ఉగ్రవాదుల ఉనికి సమాచారం అందడంతో పోలీస్‌లు భద్రతా దళాలతో కలిసి ఫ్రెస్టిహార్ వారిపోరా క్రాసింగ్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు.

భద్రతా దళాలను గమనించిన ఇద్దరు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించగా బలగాలు చాకచక్యంగా వారిని పట్టుకున్నాయని పోలీస్ సిబ్బంది తెలిపారు. నిందితులు ఇద్దరూ ఎల్‌ఈటీకి చెందిన మిలిటెంట్లుగా పేర్కొన్నారు. సోదా చేయగా రెండు చైనీస్‌ పిస్టల్స్‌, రెండు మ్యాగజైన్లు, 15 పిస్టల్ రౌండ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.

నిందితులిద్దరు ఫ్రెస్టిహార్‌ క్రీరికి చెందిన సుహైల్‌ గుల్జార్‌, హుడిపోరా రఫియాబాద్‌కు చెందిన వసీమ్‌ అహ్మద్‌గా గుర్తించారు. వారిపై పలు సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 27న బారాముల్లా జిల్లా నాబాల్‌లో ఎల్‌ఈటీకి చెందిన ఓ వ్యక్తిని సైతం బలగాలు అరెస్టు చేశాయి. పోలీసు, భద్రతా బలగాలను చూసి పారిపోతుండగా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి గ్రనేడ్‌ను స్వాధీనం చేసుకున్నారు.