దేశంలో టెర్రర్ కార్యకలాపాలకు పాల్పడుతున్న పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎల్ఎఫ్ఐ)కు నిధులు సమకూర్చిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఏఐ) జార్ఖండ్ లో సోదాలు నిర్వహించింది. జార్ఖండ్ పోలీసుల సహకారంతో సోమ, మంగళవారం ఈ తనిఖీలు చేసింది.
ఇందులో భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు,మందుగుండు సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దినేశ్ గోపి అలియాస్ కుల్దీప్ యాదవ్ ను మే 21న ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో జార్ఖండ్ లోని ఖుంటి, గుమ్లా, సిమ్డేగా జిల్లాలో రెయిడ్లు చేసి ఆయుధాలు, సామగ్రిని అధికారులు సీజ్ చేశారు.
వారం వ్యవధిలోనే ఇలా ఆయుధాలు స్వాధీనం చేసుకోవడం ఇది మూడోసారి. మే 26న కూడా భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సీజ్ చేశారు. అంతకుముందు నమోదు చేసిన చార్జిషీట్లో పీఎల్ఎఫ్ఐ మెంబర్ల నుంచి స్వాధీనం చేసుకున్న రూ.25.38 లక్షల నగదులోనూ గోపి పాత్ర ఉందని అధికారులు పేర్కొన్నారు. పరారీలో ఉన్న గోపి ఆచూకీ తెలిపినా, పట్టిచ్చినా రూ.5 లక్షల రివార్డు అందజేస్తామని ఎన్ఐఏ ప్రకటించింది. జార్ఖండ్ ప్రభుత్వం కూడా గోపీపై రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది.
కాగా, ఉగ్రవాదులకు నిధుల కేసులో కర్నాటకలోని మంగళూరులోనూ ఎన్ఐఏ అధికారులు బుధవారం సోదాలు చేశారు. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకర్తలకు చెందిన 16 ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు ఫండింగ్ చేశారన్న కేసులో అధికారులు కొద్దిరోజులుగా సోదాలు చేస్తున్నారు.
More Stories
నీట్ పేపర్ లీకేజ్‌లో 144 మందికి ప్రశ్నాపత్రం
మణిపూర్‌లో భారీగా ఆయుధాలు లభ్యం
రైలును పట్టాలు తప్పించేందుకు మరోసారి కుట్ర