హిందూ మహిళలపై అంజుమ‌న్ కేసు కొట్టివేత

జ్ఞాన్‌వాపి మసీదులో పూజ‌లు చేసే హక్కును కోరుతూ వారణాసి కోర్టులో ఐదుగురు హిందూ మహిళలు దాఖలు చేసిన పిటిష‌న్ కొన‌సాగింపును సవాలు చేస్తూ అంజుమ‌న్ మ‌సీదు క‌మిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది. శృంగార గౌరి, ఇతర దేవీదేవతలకు నిత్యం పూజలు చేసేందుకు అనుమతించాలని కోరుతూ దాఖలైన దావాకు విచారణార్హత ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.

ఐదుగురు హిందూ మహిళలు ప్రార్థన చేసే హక్కును కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై తమ అభ్యంతరాలను వారణాసి కోర్టు తోసిపుచ్చడాన్ని ఈ సివిల్ రివిజన్ పిటిషన్‌లో ఏఐఎంసీ సవాల్ చేసింది. జస్టిస్ జేజే మునీర్ విస్తృతంగా వాదనలను విన్న తర్వాత ఈ అభ్యంతరాలను తోసిపుచ్చారు.

 కోర్టు తీర్పు అనంతరం న్యాయవాది సుభాష్ నందన్ చతుర్వేది మాట్లాడుతూ ఇది హిందువుల విజయమని చెప్పారు. ఏఐఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.  ఇది చారిత్ర‌క తీర్పు అని, అంజుమ‌న్ మ‌సీదు క‌మిటీ పిటిష‌న్‌కు విచారణార్హ‌త‌ లేద‌ని కోర్ట్ స్ప‌ష్టంగా చెబుతూ పిటిష‌న్‌ను కొట్టివేసింద‌ని తీర్పు అనంత‌రం కేసులో హిందువుల ప‌క్షాన నిలిచిన‌ విష్ణు శంక‌ర్ జైన్ పేర్కొన్నారు.

అయితే, మ‌సీదు క‌మిటీ త‌ర‌పున వాద‌న‌లు వినిపించిన న్యాయ‌వాది మ‌హ్మ‌ద్ త‌హీద్ ఖాన్ కోర్టు తీర్పు హిందువుల ప‌క్షానికి ఏమంత విజ‌యం కాద‌ని వ్యాఖ్యానించారు. ఆర్డ‌ర్ 7 సీపీసీపై అంజుమ‌న్ మ‌సీదు క‌మిటీ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పైనే కోర్టు తీర్పు వెలువ‌రించింద‌ని తెలిపారు. తాము రివ్యూ పిటిష‌న్ వేయ‌డంతో పాటు సుప్రీంకోర్టునూ ఆశ్ర‌యిస్తామ‌ని చెప్పారు. కోర్టు తీర్పును అధ్య‌య‌నం చేసిన అనంత‌రం త‌దుప‌రి చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు.

జ్జ్ఞాన్‌వాపి వివాదానికి సంబంధించి మొత్తం ఏడు కేసుల‌ను కోర్టు బుధ‌వారం విచారించింది. జ్జ్ఞాన్‌వాపి మ‌సీదు స్ధ‌లంలో ఆల‌య పున‌రుద్ధ‌ర‌ణ‌ను కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్‌ను 2021, ఏప్రిల్ 8న విచారిస్తూ మ‌సీదు కాంప్లెక్స్‌లో స‌మ‌గ్ర స‌ర్వే నిర్వహించాల‌ని ఏఎస్ఐని వార‌ణాసి కోర్టు ఆదేశించింది.