
కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ దేశ ప్రజల మనోభావాలను అవమానించిందని, 60,000 మంది కార్మికుల శ్రమను అవమానించిందని ధ్వజమెత్తారు.
“మూడు రోజుల క్రితమే భారత్‌కు కొత్త పార్లమెంటు భవనం వచ్చింది. దానికి మీరు గర్వపడుతున్నారా? లేదా? అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. భారతదేశ ప్రతిష్ట పెరిగినందుకు మీరు సంతోషించారా?” అంటూ సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్, మరికొన్ని పార్టీలు దీనిపై కూడా రాజకీయాల బురద జల్లాయని అజ్మీర్‌లో జరిగిన ర్యాలీలో ఆయన విమర్శించారు.
ఆదివారం ప్రధాని చేసిన కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని కాంగ్రెస్ తోపాటు 20 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనే గిరిజన మహిళను ఆహ్వానించకుండా ఆమెను ప్రభుత్వం అవమానించిందని విమర్శలు గుప్పించాయి. ఇలాంటి అవకాశాలు తరాలకు ఒకసారి వస్తాయని, అయితే కాంగ్రెస్ తన స్వార్థపూరిత నిరసన కోసం దీనిని ఉపయోగించుకుందని మోదీ దయ్యబట్టారు.
దేశం సాధిస్తున్న అభివృద్ధిని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని ప్రధాని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ను ప్రస్తావిస్తూ, “పేదల కొడుకు” వారు కోరుకున్నది చేయడానికి వారిని అనుమతించడం లేదని పరోక్షంగా రాహుల్ గాంధీని ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు. “వారి అవినీతి, పరివార్‌వాద్ (వంశపారంపర్య రాజకీయాలు)పై ప్రశ్నలు లేవనెత్తుతున్నందున వారు కోపంగా ఉన్నారని మోదీ ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ తన పాలనలో పేదలను తప్పుదోవ పట్టించే విధానాన్ని అనుసరిస్తోందని ప్రధాని ఆరోపించారు. ‘పేదరికాన్ని తొలగిస్తామని యాభై ఏళ్ల క్రితం కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ అది పేదలకు చేసిన అతిపెద్ద ద్రోహంగా మారింది” అని విమర్శించారు. పేదలను తప్పుదోవ పట్టించడం, వారిని బహిష్కరించడం కాంగ్రెస్ విధానమని పేర్కొంటూ దీని వల్ల రాజస్థాన్ ప్రజలు కూడా చాలా నష్టపోయారని మోదీ హెచ్చరించారు.
మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా బిజెపి నెలరోజులపాటు చేపట్టిన ప్రచార కార్యక్రమం ప్రారంభోత్సవ సూచికగా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాజస్థాన్ లో ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ తొమ్మిదేళ్ల బీజేపీ ప్రభుత్వ పాలన పేద ప్రజల సేవలకు అంకితమైందని, చక్కని పరిపాలన, పేదల సంక్షేమం కోసం పాటుపడినట్టు ప్రధాని చెప్పారు. 2014 కు ముందు కాంగ్రెస్ రిమోట్ కంట్రోల్‌తో ప్రభుత్వాన్ని సాగించినప్పుడు అవినీతికి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి రావడంతో ప్రధాన నగరాలు స్తంభించిపోయాయని మోదీ గుర్తు చేశారు.
తన పాలనలో కాంగ్రెస్ అవినీతి వ్యవస్థని పెంచి పోషించిందని, అది దేశం రక్తాన్ని పీల్చివేసిందని, అభివృధ్ధి వెనక్కు పోయిందని తీవ్రంగా ఆరోపించారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ప్రజలు భారత్ గురించి మాట్లాడుకుంటున్నారని, కటిక పేదరికాన్ని అంతమొందించడానికి బాగా చేరువైందని నిపుణులు చెబుతున్నారని మోదీ పేర్కొన్నారు.
అంతకు ముందు ప్రధాని అజ్మీర్ జిల్లా పుష్కర్‌లో ప్రఖ్యాతి చెందిన బ్రహ్మాలయంలో పూజలు చేశారు. అక్కడ నుంచి జైపూర్ రోడ్‌లో కయాడ్ విశ్రామ్ స్థలికి హెలికాప్టర్‌లో ప్రయాణించి ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు అర్జున్‌రామ్ మెఘ్వాల్, కైలాస్ చౌదరి, రాజస్థాన్‌కు చెందిన బీజేపీ నేతలు ప్రధానిని అనుసరించారు.
More Stories
న్యూస్‌క్లిక్ వ్యస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆప్ ఎంపీ ఇంట్లో సోదాలు
ఆసియా క్రీడల్లో పారుల్ చౌదరి, అన్నురాణిలకు స్వర్ణ పతకాలు