
మణిపూర్‌లో చెలరేగిన విస్తృత హింసాకాండపై హైకోర్టు రిటైర్డ్ జడ్జీ నేతృత్వంలో ఓ కమిటీతో విచారణ చేపట్టనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. మణిపూర్ పోలీస్ చీఫ్ పి. దౌంగెల్‌ను తొలగించి, ఆయన స్థానంలో రాజీవ్ సింగ్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. హోంశాఖ ఓఎస్డీగా పీ డొంగోల్‌ను నియమించారు.
మణిపూర్‌లో హింసను నియంత్రించే ఉద్దేశంతో.. కేంద్ర మంత్రి అమిత్ షా ఆ రాష్ట్రంలో నాలుగు రోజుల పర్యటన చేపట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సుస్థిరతను పునరుద్ధరించే ప్రణాళికలో భాగంగా హింసాకాండపై విచారణ, శాంతి కమిటీలను నియమిస్తున్నట్లు ప్రకటించారు.
‘‘మూడు రోజులుగా నేను ఇంఫాల్, మోరె, చురాచాంద్‌పుర్ సహా పలు ప్రాంతాల్లో పర్యటించాను. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పే దిశగా స్థానిక అధికారులతో మాట్లాడాను. మణిపూర్ గవర్నర్ నేతృత్వంలో పీస్ కమిటీని ఏర్పాటు చేశాం. ఈ ఘటనల వెనుక ఉన్న కుట్రలను గుర్తించేందుకు ఉన్నతస్థాయి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాం. ఈ దర్యాప్తు పూర్తి తటస్థంగా ఉంటుందని హామీ ఇస్తున్నా’’ అని వివరించారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయిగల విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతూ ఈ దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్, భద్రతా సలహాదారు కులదీప్ సింగ్, సివిల్ సొసైటీ సభ్యుల నేతృత్వంలో శాంతి కమిటీ ఏర్పాటు కానుందని వెల్లడించారు.
రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు వివిధ సంస్థలు పని చేస్తున్నాయని చెబుతూ భద్రతా సలహాదారుడైన సీఆర్‌పీఎఫ్ రిటైర్డ్ డీజీ కుల్‌దీప్ సింగ్ ఈ సంస్థలను సమన్వయపరుస్తారని తెలిపారు. మణిపూర్‌లో జరుగుతున్న వర్గ పోరును దర్యాప్తు చేసేందుకు పలు ఏజెన్సీలు ఇప్పటికే పనిచేస్తున్నాయని తెలిపారు.
ఆరు సంఘటనల్లో కుట్ర ఉన్నట్లు సీబీఐ ఉన్నత స్థాయి దర్యాప్తులో తేలిందని, కేంద్రం మార్గదర్శకత్వంలో సిబిఐ దర్యాప్తును నిర్వహిస్తుందని తెలిపారు.
మణిపూర్ సంక్షోభాన్ని చర్చలతోనే పరిష్కరించే అవకాశం ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. నిష్పాక్షిక దర్యాప్తు, విచారణ జరుగుతుందని మణిపూర్ ప్రజలకు హామీ ఇచ్చారు. హింసాకాండకు సంబంధించి ఆరు కేసులను సిబిఐ విచారించనుందని, భద్రతా సిబ్బంది నుండి ఆయుధాలను దోచుకున్న ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇటువంటి హింసాత్మక సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
హింసాకాండలో ఆత్మీయులను కోల్పోయినవారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. డిబిటి ద్వారా పరిహారం అందించబడుతుందని అమిత్ షా పేర్కొన్నారు. ఆయుధాలను కలిగియున్నవారు వెంటనే వాటిని పోలీసులకు అప్పగించాలని ప్రజలను కోరారు.
కూంబింగ్ ఆపరేషన్ శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందని చెబుతూ ఎవరి వద్దనైనా అక్రమ ఆయుధాలు కనిపిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వదంతులు నమ్మవద్దని ప్రజలను, ప్రజా సంఘాలను కోరారు. ఇరు పక్షాలు శాంతియుతంగా వ్యవహరించవలసిన అవసరం ఉందని చెప్పారు. విద్యాశాఖకు చెందిన అధికారులు రాష్ట్రంలో పర్యటిస్తారని, నిరాటంకంగా విద్యాబోధన కొనసాగించేందుకు కావాల్సిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.
అల్లర్లలో గాయపడ్డవారికి చికిత్స అందించేందుకు 8 డాక్టర్ల బృందంలో ప్రస్తుతం మణిపూర్‌లో ఉన్నాయి. ఖోంగ్‌సాంగ్ రైల్వే స్టేషన్ వద్ద తాత్కాలిక ప్లాట్‌ఫామ్‌ను వేగంగా నిర్మిస్తున్నామని, దీన్ని వారంలోగా ఆపరేషన్ స్థాయికి తీసుకువస్తామని అమిత్ షా వివరించారు.
More Stories
న్యూస్‌క్లిక్ వ్యస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆప్ ఎంపీ ఇంట్లో సోదాలు
ఆసియా క్రీడల్లో పారుల్ చౌదరి, అన్నురాణిలకు స్వర్ణ పతకాలు