ఓఆర్ఆర్ టెండర్లలో గోప్యత ఎందుకు?

ఔటర్‌ రింగ్‌ రోడ్డు టెండర్ల వ్యవహారంలో ఎందుకంత గోప్యత పాటిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సర్కారు మౌనం ఈ టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందన్న అనుమానాలకు బలం చేకూర్చుతోందని ఆయన పేర్కొన్నారు.
 
ఆదాయానికి గండికొట్టి మరీ టెండర్‌ కట్టబెట్టడం వెనక ఆంతర్యమేంటని సీఎం కేసీఆర్‌ను నిలదీశారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. లిక్కర్‌ స్కాం, టీఎ్‌సపీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ, ప్యాకేజీల పేరుతో ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని.. ఇప్పుడు ఓఆర్‌ఆర్‌ టెండరుపై సీఎం మౌనంతో భారీ స్కామ్‌ జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయని చెప్పారు.
 
ఓఆర్‌ఆర్‌ టెండర్‌ ప్రక్రియలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణకు ఆదేశించడంతో పాటు వాస్తవాలను బహిర్గతం చేయాలని సంజయ్ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ‘‘ఓఆర్‌ఆర్‌ టోల్‌ టెండర్‌ అప్పగింత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యమంత్రిగా వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది” అని స్పష్టం చేశారు.
 
“అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రస్తుతం ఓఆర్‌ఆర్‌పై ఏడాదికి రూ.415 కోట్ల ఆదాయం వస్తోంది. ఏటా 5ు పెరిగినా.. 30 ఏళ్లకు ప్రభుత్వానికి రూ.30,000 కోట్ల ఆదాయం వస్తుంది. సర్కారు కనీసం ఆలోచన చేయకపోవడం వెనక ఆంతర్యం ఏమిటి?” అని ప్రశ్నించారు.
 
 ఈ టెండరు దక్కించుకున్న ఐఆర్‌బీ సంస్థ ముంబై-పుణె హైవే కాంట్రాక్టు కూడా నిర్వహిస్తోందని చెబుతూ తక్కువ దూరం, తక్కువ కాలానికి మహారాష్ట్ర ప్రభుత్వం టెండర్‌ అప్పగించినప్పుడు ఎక్కువ కాలం, ఎక్కువ దూరానికి తక్కువ ధరకు టెండర్‌ ఇవ్వాల్సిన అవసరం ఏమిటో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు.
 
ఓఆర్‌ఆర్‌ టెండర్‌పై ప్రభుత్వ మార్గదర్శకాల నోటిఫికేషన్‌ దగ్గర నుంచి.. ఖరారు వరకు అంతా రహస్యంగానే ఉంచారని విస్మయం వ్యక్తం చేశారు. బేస్‌ ప్రైస్‌ ఎంత పెట్టారో చెప్పేందుకు కూడా ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని ప్రశ్నించారు. మరోవైపు ఓఆర్‌ఆర్‌పై వార్తలు రాస్తే బెదిరింపులకు దిగుతోందని మండిపడ్డారు.
ప్రశ్నించే పార్టీలకు లీగల్‌ నోటీసుల పేరిట బెదిరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, టెండర్‌ విషయంలో ఏదో జరిగిందన్న అనుమానాలకు మరింత బలం చేకూరుతోందిని బండి సంజయ్‌ ఆ లేఖలో పేర్కొన్నారు.