బీఆర్ఎస్ ఎమ్యెల్యే బాధితులు ఢిల్లీలో నిరసన

బెల్లంపల్లి బిఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా బాధితులు దేశ రాజధాని ఢిల్లీలో నిరసన గళం వినిపించారు. తనను ఎమ్మెల్యే లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆరోపణలు చేసిన శేజల్‌తో పాటు ఆర్జిన్ డైరీ నిర్వాహకులు మంగళవారం ఢిల్లీ చేరుకుని అధికార పార్టీ ఎమ్మెల్యేపై జాతీయ మహిళా కమిషన్‌కు, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
 
అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట ఫ్లెక్సీలు, ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఆ తర్వాత ఢిల్లీ పోలీసుల నుంచి అనుమతి తీసుకుని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాధితురాలు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కారణంగా తమ కంపెనీలో ఉన్న ఉద్యోగులు, సిబ్బంది మొత్తం రోడ్డున పడ్డారని తెలిపారు.
 
తమను ఎమ్మెల్యే చాలాకాలంగా లైంగికంగా వేధిస్తున్నారని, లొంగకపోవడంతో తప్పుడు కేసు పెట్టి బెదిరిస్తున్నారని వెల్లడించారు. బెయిల్ మీద బయటికొచ్చిన తర్వాత కూడా వేధింపులు అపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అరాచకాలపై రాష్ట్ర మంత్రి కేటీ రామారావును కలిసి ఫిర్యాదు చేయడం కోసం అపాయింట్మెంట్ అడిగానని, ఇంతవరకు ఇవ్వలేదని తెలిపారు.అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి కారణమేంటో తెలియడం లేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో న్యాయం కోసం హస్తిన బాట పట్టామని, న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తనలాగే ఎంతోమంది బాధితులున్నారని, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కామాంధుడని ఆరోపించారు.
తమ ఫిర్యాదును తెలంగాణ పోలీసులు స్వీకరించడం లేదని, అందుకే తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయాలని అనుకుంటున్నామని చెప్పారు. లైంగిక వేధింపుల ఆధారాలన్నీ భద్రంగా ఉంచామని, వాటితో ఎమ్మెల్యేను చట్టం ముందు దోషిగా నిలబెడతామని వెల్లడించారు.