రూ.793 కోట్ల మార్గదర్శి ఆస్తులు అటాచ్!

మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఏపీ సీఐడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇటీవల మార్గదర్శి డైరెక్టర్ రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్ ను విచారించిన సీఐడీ అధికారులు చిట్ ఫండ్ వ్యాపారంలో అక్రమాలకు పాల్పడ్డారని అభియోగిస్త ఆ సంస్థకు చెందిన రూ.793 కోట్ల విలువైన ఆస్తులకు అటాచ్ చేస్తున్నట్లు ప్రకటించింది

మార్గదర్శిలో ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఫోర్‌మెన్‌, ఆడిటర్లు చిట్ ఫండ్స్ సేకరణలో అక్రమాలకు పాల్పడ్డారని ఏపీ సీఐడీ తెలిపింది. సేకరించిన చిట్స్ ను హైదరాబాద్‌ కార్పొరేట్‌ ఆఫీస్‌ ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఏపీలోని 37 బ్రాంచ్‌ల ద్వారా మార్గదర్శి సంస్థ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

ఏపీలో 1989 చిట్స్‌ గ్రూప్‌లు, తెలంగాణలో 2,316 చిట్స్‌ గ్రూప్‌లు ఉన్నాయి. అయితే ఖాతాదారులకు వెంటనే డబ్బు చెల్లించే స్థితిలో మార్గదర్శి సంస్థ లేదని సీఐడీ అధికారులు వెల్లడించారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి ఖాతాదారుల డబ్బును వివిధ రంగాలకు మళ్లించిందని సీఐడీ ఆరోపిస్తోంది. విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, అనంతపురం, ఏలూరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం మార్గదర్శి శాఖల్లో అక్రమాలు వెలుగుచూశాయని సీఐడీ తెలిపింది.

మార్గదర్శి ఆడిటర్‌ కె. శ్రవణ్‌, ఈ శాఖల ఫోర్‌మెన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ చెరుకూరి శైలజ, ఛైర్మన్‌ రామోజీరావు కుట్ర పన్నారని, అక్రమాలకు పాల్పడ్డారని ఏపీ సీఐడీ పేర్కొంది. మార్గదర్శికి చెందిన 1989 యాక్టివ్ చిట్ గ్రూపులను ఆంధ్రప్రదేశ్‌లోని తన శాఖలలో రూ.50,000 నుంచి రూ.1 కోటి వరకు చిట్ విలువతో నిర్వహిస్తున్నట్లు సిఐడి తెలిపింది.

మార్గదర్శి అటాచ్ చేసిన చరాస్తులపై నియంత్రణలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ అదనపు డైరెక్టర్ జనరల్‌ను కోరింది. ఉత్తర్వులు సంపూర్ణంగా ఉండేలా సంబంధిత కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని సీఐడీని ఆదేశించింది.