సర్వర్ల డౌన్ తో ఏపీలో నిలిచిన భూ రిజిస్ట్రేషన్లు

ఏపీలో వరుసగా రెండో రోజు మంగళవారం కూడా భూముల రిజిస్ట్రేషన్లకు అంతరాయం ఏర్పడింది. జూన్ 1 నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనుండడంతో ఈ లోపుగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వస్తున్నవారు ఆదుర్దా చెందుతున్నారు.  సర్వర్లు మొరాయించడంతో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి.
 
 దీంతో జనం ఆఫీసుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మరో రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపుతో పెద్ద ఎత్తున భూలావాదేవీలు జరిపిన వారు రిజిస్ట్రేషన్ల కోసం ఆఫీసులకు క్యూకట్టారు. సర్వర్లు పని చేయకపోవడంతో దస్తావేజులను రిజిస్ట్రేషన్లు చేయడం ఆలస్యం అవుతుందని అధికారులు అంటున్నారు.
 
అయితే రిజిస్ట్రేషన్ ధరల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని పలువురు కోరుతున్నారు. నాలుగు రోజుల క్రితం చలానా కట్టినా సర్వర్ డౌన్ తో రిజిస్ట్రేషన్ కాలేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇలా ఇష్టానుసారంగా ఛార్జీలు పెంచుతూ ప్రజలపై భారం మోపడం సరికాదని అంటున్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచొద్దని, నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు.

 గ్రామాల నుండి ప్రజలు భూములు అమ్మకం, కొనుగోలు రిజిస్ట్రర్‌లతో పాటు ఈసీలు, నకళ్ల కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వస్తే సర్వర్లు మొరాయించడంతో ఆన్‌లైన్‌ సేవలు నిలిచిపోయి క్రయ, విక్రయాల రిజిస్ట్రర్లు జరగకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఆన్‌లైన్‌ ఈసీలు రాక రిజిస్ట్రేషన్ కాకపోవడం, సబ్‌ రిజిస్ట్రర్‌ కార్యాలయంలోనే ఆన్‌లైన్‌ సర్వర్లు మొరాయించడంతో రిజిస్ట్రేషన్లు కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ఏపీలో జూన్ 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతూ సీఎం జగన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్ లో ఉన్నాయి. జూన్1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. దానితో రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. సర్వర్ల మొరాయింపుతో బుధవారం నుంచి మాన్యువల్ పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. 2010కి ముందు రాష్ట్రంలో మాన్యువల్ పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు నిర్వహించేది.